క్ష‌మాప‌ణ చెప్ప‌మ‌న్నందుకే మాపై దాడులు

తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని తేలిపోయింది

త‌ప్పుడు ప్ర‌చారం చేసినందుకు భ‌క్తుల‌కు సారీ చెప్పాల్సిందే

సీఎం చంద్ర‌బాబుని డిమాండ్ చేసిన మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని 

తాడేప‌ల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని

చంద్ర‌బాబు, ప‌న‌వ్ క‌ళ్యాణ్ చేయ‌కూడ‌ని పాపం చేశారు

ఆ పాపం కూట‌మి ప్ర‌భుత్వానికి ఉరితాడులా బిగుసుకుంది

చేసిన త‌ప్పుని క్ష‌మించ‌మ‌ని అడ‌గాల్సింది పోయి ఇంకా దిగ‌జారిపోతున్నారు

సీబీఐ సిట్ చార్జిషీట్ డైవ‌ర్ష‌న్ కోస‌మే వైయస్ఆర్‌సీపీ నాయ‌కుల‌పై వ‌రుస దాడులు

రూల్ ఆఫ్ లా అమ‌లు చేసే ప‌నైతే పెమ్మ‌సాని, గ‌ల్లా మాధవి ఇప్ప‌టికే జైల్లో ఉండేవారు

దాడులు చేసిన వారిని వ‌దిలేసి బాధితుల‌మైన మాపై కేసులా? 

సీఎం చంద్ర‌బాబుని సూటిగా ప్ర‌శ్నించిన మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని.

తాడేప‌ల్లి: తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని ఆధారాలు లేకుండా త‌ప్పుడు ప్రచారం చేసిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసినందుకే మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్, నాపైన కూట‌మి నాయ‌కులు దాడుల‌తో తెగ‌బ‌డ్డారని మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీబీఐ సిట్ చార్జిషీట్ తో తిరుమ‌ల ల‌డ్డూకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని తేలిపోయింది కాబ‌ట్టి చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని ఆమె డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా శ్రీవారి ల‌డ్డూపై వారు చేసిన త‌ప్పుడు ప్ర‌చారం కూట‌మి ప్ర‌భుత్వానికి ఉరితాడులా బిగుసుకుంద‌ని దాన్నుంచి బ‌య‌ట‌కు రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నార‌ని చెప్పారు. అయితే చేసిన త‌ప్పుకి క్ష‌మాప‌ణ‌లు అడగాల్సిందిపోయి ఇంకా దిగ‌జారిపోయి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శ్రీవారి ప్ర‌తిష్ట‌ను ఇంకా దిగ‌జారుస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. అయినా ప్ర‌జ‌లు వారి కుట్ర‌ల‌ను న‌మ్మ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికి ప్ర‌ణాళిక ప్ర‌కారం వైయస్ఆర్‌సీపీ నాయ‌కుల‌పై చంద్ర‌బాబు దాడులు చేయిస్తున్నాడ‌ని ఆరోపించారు. ఆయ‌న చెప్పిన‌ట్టు రూల్ ఆఫ్ లా అమ‌లు జ‌రిగేట్టుంటే టీడీపీ ఎమ్మెల్యే గ‌ల్లా మాధ‌వి, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని ఈ పాటికే జైల్లో ఉండేవార‌ని దీటుగా స్పందించారు. దాడులు చేసిన వారిని వ‌దిలేసి బాధితుల‌మైన మాపై కేసులు పెట్టి జైళ్ల‌కు పంపుతూ రాజ్యాంగం అమ‌లు చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు ఎలా చెప్పుకుంటార‌ని మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప్ర‌శ్నించారు. 
ఆమె ఇంకా ఏమ‌న్నారంటే... 

 ● దాడులు చేసిన టీడీపీ ఎమ్మెల్యేను ఎలా వ‌దిలేశారు?  

తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని ఆధారాలు లేకుండా త‌ప్పుడు ప్రచారం చేసిన చంద్ర‌బాబు, కోట్లాది మంది శ్రీవారి భ‌క్తుల‌కు  క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని సీబీఐ సిట్ చార్జిషీట్ కాపీని ప‌ట్టుకుని డిమాండ్ చేసినందుకే మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్ ల ఇళ్ల‌పై కూట‌మి నాయ‌కులు దాడుల‌తో తెగ‌బ‌డ్డారు. రూల్ ఆఫ్ లా అమ‌లు చేస్తామ‌ని చెబుతున్న సీఎం చంద్ర‌బాబు, అంబ‌టి రాంబాబు గారి ఇంటిపై తామే దాడి చేసి విధ్వంసం సృష్టించామ‌ని మ‌ళ్లీ కూడా దాడి చేస్తామ‌ని మీడియా సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధ‌వి రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఆమెను ఇంత‌వ‌ర‌కు అరెస్ట్ చేయ‌లేదు. ఆమెతోపాటు కేంద్ర మంత్రి పెమ్మ‌సాని సైతం వైయస్ఆర్‌సీపీ నాయ‌కుల‌కు 24 గంట‌ల్లో సినిమా చూపిస్తామ‌ని బ‌హిరంగ స‌భ‌ల్లో హెచ్చ‌రిక‌లు జారీచేశాడు. ఇదంతా చూస్తుంటే ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం వైయస్ఆర్‌సీపీ నాయ‌కుల మీద జ‌రుగుతున్న దాడులేన‌ని ఎవ‌రికైనా తెలిసిపోతుంది. ఆవేశంలో తాను మాట్లాడిన మాట‌ల‌కు చింతిస్తున్నానని అంబ‌టి రాంబాబు ప్ర‌క‌టించిన త‌ర్వాతైనా నెమ్మ‌దించ‌కుండా ఇంకా రెచ్చిపోయారంటే ఇది ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగిన దాడిగానే చూడాలి. 
 బాధ్య‌తాయుత‌మైన ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న చంద్ర‌బాబు శాంతి భ‌ద్ర‌త‌లను కాపాడాల్సిందిబోయి తానే విధ్వంసాల‌కు ప‌థ‌క ర‌చ‌న చేస్తూ రాష్ట్రంలో అశాంతికి కార‌ణ‌మ‌వుతున్నాడు. దాడులు దౌర్జ‌న్యాల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాడు. 

● వివాదానికి కార‌ణ‌మైన ఫ్లెక్సీల‌కు పోలీసు ర‌క్ష‌ణా? 

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం చేసిన‌ట్టుగా ఆ నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప‌ల నూనెలు క‌ల‌వ‌లేద‌ని ఎన్‌డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి ప్ర‌ముఖ సంస్థ‌ల ల్యాబ్ రిపోర్టుల ద్వారా నిర్ధార‌ణ అయ్యింద‌ని సీబీఐ సిట్ చార్జిషీట్‌లో స్ప‌ష్టం చేసింది. దీంతో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని గ‌తంలో వారు చేసిన త‌ప్పుడు ప్ర‌చారం ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఉరితాడులా బిగుసుకుంది. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు కూట‌మి నాయ‌కుల‌కు చీవాట్లు పెడుతున్నారు. ఇప్ప‌టికైనా చేసిన త‌ప్పుపై మ‌న్నించ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను క్ష‌మాప‌ణ‌లు కోర‌కుండా క‌ల్తీ నిజ‌మేన‌ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మ‌రీ క‌లియుగ‌దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తున్నారు. అయినా వారిని ప్ర‌జ‌లు న‌మ్మ‌క‌పోవ‌డంతో దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డ‌మే ల‌క్ష్యంగా వైయస్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేసుకుని వ‌రుస దాడుల‌కు ప‌థ‌క ర‌చ‌న చేసి అమ‌లు ప‌రుస్తున్నారు. అందులో భాగంగానే బోయ‌పాలెం గుడికి వెళ్లి పూజ‌లు చేసి వ‌స్తున్న‌ నాపైనా చిల‌కలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దాడులు చేయించాడు. నాపై, మా నాయ‌కుల‌పై వ‌రుస‌పెట్టి దాడులు చేస్తూ తిరిగి మాపైనే కుల మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్నామ‌ని కేసులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివాదాల‌కు కార‌ణ‌మైన, కూట‌మి నాయ‌కులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను తొల‌గించ‌క‌పోగా వాటికి పోలీసుల‌ను కాపాలా పెట్టి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారు. ఇంత‌క‌న్నా దారుణం ఇంకోటి ఉంటుందా? వారు చేసిన త‌ప్పు బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాతైనా దేవుడిని రాజ‌కీయాల‌కు లాగ‌డం మానుకుంటార‌నుకుంటే ఇంకా దిగ‌జారి నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆఖ‌రుకి వైయస్ఆర్‌సీపీనాయ‌కులు గుడికి పోయి దేవుడికి పూజ‌లు చేసినా త‌ప్పేనా? వైయస్ఆర్‌సీపీలో ఉండే వారు గుడికి వెళ్ల‌కూడ‌ద‌ని కూడా జీవో ఇస్తారేమో. ఈ ప‌రిస్థితుల‌న్నీ చూస్తుంటే రాష్ట్రాన్ని ఏ వైపున‌కి తీసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నాడో అర్థం కావ‌డం లేదు. 

● రాష్ట్రంలో మ‌హిళలకు ర‌క్ష‌ణ లేదు

రాష్ట్రంలో మ‌హిళలకు ఏమాత్రం ర‌క్ష‌ణ లేదు. మాజీ మంత్రినైన నాపైన ఇప్ప‌టికే ప‌దిసార్లు దాడులు చేశారు. ఇక సామాన్య మ‌హిళ‌ల‌కు ఈ రాష్ట్రంలో ర‌క్ష‌ణ ఎక్కడ ఉంటుంది?  రెబ్ బుక్ రాజ్యాంగం పేరుతో 20 నెల‌లుగా రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌ని లోకేష్ పీన‌ల్ కోడ్ గా మార్చేశారు. పాల‌న‌లో పూర్తిగా విఫ‌ల‌మైన చంద్ర‌బాబుకి అప్పులు త‌ప్ప అభివృద్ధి చేయ‌డం చేత‌కావడం లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌తిపక్ష వైయస్ఆర్‌సీపీ ప్ర‌శ్నిస్తుంటే వారు ఓర్చుకోలేక‌ పోతున్నారు. చంద్ర‌బాబుకి చేత‌నైతే వైయ‌స్ జ‌గ‌న్ గారిక‌న్నా మంచి పాల‌న ఇచ్చి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాలే కానీ ఇలాంటి దాడుల‌తో వైయస్ఆర్‌సీపీని అడ్డుకోవాల‌ని చూడ‌టం అవివేకమని విడ‌ద‌ల ర‌జిని అన్నారు.

Back to Top