పిరికిపంద‌లే ఇళ్ల‌పై దాడి చేస్తారు

విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పే ధైర్యం కూట‌మికి లేదు 

దాడులు చేసే విష సంస్కృతికి ఫుల్‌స్టాప్ పెట్టాలి   

సీఎం చంద్ర‌బాబుకి హిత‌వు ప‌లికిన వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్‌

ఇబ్ర‌హీంప‌ట్నం లోని మాజీ మంత్రి జోగి ర‌మేష్ క్యాంపు కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ
పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్‌

ఇబ్ర‌హీంప‌ట్నం:  విమ‌ర్శ‌ల‌కు స‌మాధానాలు చెప్పుకోలేక రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల ఇళ్ల‌పై దాడులు చేసి వారి కుటుంబ‌స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేయ‌డం పిరికిపంద‌ల చ‌ర్య‌గా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అభివ‌ర్ణించారు. ఇబ్ర‌హీంప‌ట్నంలో మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుటుంబ సభ్యుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం అక్క‌డే క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్ ఇళ్ల‌పై టీడీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో చంద్ర‌బాబు దుష్ప్ర‌చారం చేసినందుకు నిర‌స‌న‌గా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసినందుకు దాడులు చేయ‌డమంటే స‌మాధానం చెప్పుకోలేక పారిపోవ‌డ‌మే అవుతుంద‌ని చెప్పారు. దాడుల‌తో ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్కాల‌ని చూస్తే వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఈ కూట‌మి నాయ‌కులు రోడ్డుపై తిరిగే వారేనా అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల ఇళ్ల‌పై దాడులు చేసే విష‌సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని, లేదంటే కూట‌మి నాయ‌కులు రాబోయే రోజుల్లో తీవ్ర‌ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని హెచ్చ‌రించారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

● క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందిబోయి...

సీఎం చంద్ర‌బాబు త‌న నీచ రాజ‌కీయాలకు తిరుమ‌ల శ్రీవారిని కూడా వాడుకుంటూ తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశాడు. సీబీఐ సిట్ చార్జిషీట్ ద్వారా అదంతా అబ‌ద్ధమ‌ని తేల‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. చేసిన త‌ప్పుని అంగీక‌రించి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి క‌ల్తీ జ‌రిగింద‌ని వితండ వాద‌న‌తో ఇంకా దారుణంగా తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను మంట‌గ‌లిపే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టాడు. ఏ ఆధారాల‌తో మాట్లాడుతున్నార‌ని కూట‌మి నాయ‌కుల‌ను నిల‌దీస్తుంటే స‌మాధానం చెప్పే ధైర్యం లేక వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన బీసీ, కాపు నాయ‌కుల‌పై దాడులు, దౌర్జ‌న్యాల‌తో రాష్ట్రంలో రాక్ష‌స‌ పాల‌నకి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టాడు. రాజ‌కీయాల‌కు సంబంధం లేని మ‌హిళ‌లు ఇంట్లో ఉండ‌గా దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల మీద హ‌త్యాప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

● పాల‌నా వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించ‌డానికే దాడులు

పాల‌న‌లో వైఫ‌ల్యం చెందిన చంద్ర‌బాబు వాటిని క‌ప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌ని వింత‌పోక‌డ‌ల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చాడు. టీడీపీ గూండాల‌తో మా నాయకుల ఇళ్ల‌పై క‌ర్ర‌లు, రాడ్లు, పెట్రోల్ బాంబుల‌తో దాడులు చేయించి తిరిగి మాపైనే కేసులు పెడుతున్న జుగుప్సాక‌ర వాతావ‌ర‌ణం తీసుకొచ్చాడు. కూటమి పార్టీల్లో ఉండే మ‌హిళ‌ల‌కే మ‌నోభావాలు ఉంటాయా?  ప్ర‌తిప‌క్ష వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల ఇళ్ల‌లో మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ క‌ల్పించే బాధ్య‌త ప్ర‌భుత్వానిది కాదా?  మా పార్టీ మ‌హిళ‌లను తిడుతూ, దాడులు చేసి వేధిస్తుంటే చంద్ర‌బాబుకి క‌నిపించ‌డం లేదా? రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాల‌న తీసుకొచ్చారు. శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడాల్సిన అధికార పార్టీ నాయ‌కులే విఘాతం క‌లిగిస్తున్నారు. ఇంత దారుణ‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు స్పందించ‌డం లేదు?  గడిచిన వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో ఇలాంటి పాల‌న చేసుంటే కూట‌మి నాయ‌కులు రోడ్ల మీద తిరిగేవారేనా? దాడులు, కేసుల‌తో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను భ‌య‌పెట్టలేరు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తూనే ఉంటాం. చంద్ర‌బాబు ఏదైనా ఉంటే రాజ‌కీయంగా తేల్చుకోవాలే కానీ దాడుల‌తో ఏం సాధించ‌లేర‌ని గుర్తుంచుకోవాలి. చంద్ర‌బాబు తీసుకొచ్చిన ఈ సంస్కృతికి రాబోయే రోజుల్లో వారు ఖ‌చ్చితంగా మూల్యం చెల్లించుకోక‌ త‌ప్ప‌దు. ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతిని మానుకుంటే మంచిది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై నిర‌స‌న తెలియ‌జేసే హ‌క్కును కాల‌రాయాల‌నుకోవ‌డం పిరికిపందలు చేసే చ‌ర్యేనని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Back to Top