సుప్రీంకోర్టు ‘సిట్‌’ రిపోర్ట్‌పై ప్రభుత్వ విచారణా?

భూమన కరుణాకర్‌రెడ్డి ఫైర్‌

ప్రభుత్వానికి చేతనైతే మళ్లీ సుప్రీంకోర్టుకే వెళ్లాలి

‘సిట్‌’ రిపోర్ట్‌ తప్పు అని సుప్రీంకోర్టుకు చెప్పాలి

ఆ విషయాన్ని పక్కాగా రుజువు చేయాలి

భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్‌

తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి.

నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని సిట్‌ తేల్చేసింది

దీంతో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు

తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు మళ్లీ కొత్త డ్రామా

చంద్రబాబు నీచ రాజకీయాన్ని ఎండగట్టిన భూమా

2018లోనే నెయ్యిలో ఫ్లేవర్‌ కలిపారు

టీటీడీ తీర్మానమే ఇందుకు నిదర్శనం

నాణ్యత లేకే నెయ్యిలో ఫ్లేవర్‌ కలిపారు

ఇలా మొత్తం 87 వేల కేజీల నెయ్యి కొనుగోళ్లు

భోలే బాబా వెనక ఉన్న ఆలీబాబా చంద్రబాబే

2018లో హర్ష్‌ డెయిరీగా ఉండగా అనుమతి

మా హయాంలో నిబంధనల్ని సడలించలేదు

అవే డెయిరీలు, అధికారుల్ని కొనసాగించాం

భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడి

అప్పటి టీటీడీ తీర్మానంపై సమాధానం చెప్పండి

సీబీఐ రిపోర్ట్‌ పై విచారించే అధికారం మీకులేదు

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన భూమన కరుణాకర్‌రెడ్డి 

తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతుకొవ్వు, పంది కొవ్వు, చేపనూనె కలిపిన నెయ్యి వాడారని పచ్చి గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్న సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌తో అడ్డంగా దొరికిపోయి, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. 
    దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్, నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని చెప్పినా, మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి చేతనైతే సిట్‌ రిపోర్ట్‌ తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి, అక్కడ రుజువు చేయాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్‌ చేశారు.
ప్రెస్‌ మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

సిట్‌ రిపోర్ట్‌పై క్యాబినెట్‌ నిర్ణయమా!:
    సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ అధికారుల్ని సీఎం చంద్రబాబు పిలిపించుకోవడం అసాధారణ విషయం. వారి దగ్గరి నుంచి 11 పేజీల నివేదిక తీసుకుని సుదీర్ఘమైన చర్చ చేశామని కేబినెట్‌ భేటీ నుంచి బయటికి వచ్చిన మంత్రులు చెప్పారు. చంద్రబాబును కాపాడటానికి, ఆయన చెప్పిన అబద్ధాల్ని కప్పిపుచ్చడానికే వీళ్ల ప్రయాస. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2024 సెప్టెంబర్‌ 20వ తేదీన కూటమి సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారని ప్రకటించడంతో, వాస్తవాలు నిగ్గు తేల్చాలని వైవీ సుబ్బారెడ్డిగారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఏ విషయమూ నిర్థారణ కాకుండా మాట్లాడొద్దంటూ సూచించిన సుప్రీకోర్టు, ఈ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు చేసింది. అందులో సీబీఐ అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు.
    సిట్‌ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్‌ అదనపు ఛార్జిషీట్‌లో కానీ, ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసినట్లు ఎక్కడా చెప్పలేదు. అయినా చంద్రబాబు ఈ ఛార్జిషీట్‌పై సంతృప్తి చెందకుండా ఇవాళ కేబినెట్‌ సమావేశంలో నెయ్యి విషయంలో ప్రత్యేక విచారణ చేపడుతున్నట్లు మంత్రులతో బయట ప్రకటన చేయించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ రిపోర్టు కాకుండా, మళ్లీ విచారణ చేయించాలన్న నిర్ణయం పూర్తిగా తప్పు.

‘భోలేబాబా డెయిరీ’ వెనుక ఉన్న ‘ఆలీ బాబా’ చంద్రబాబే:
    ఒక మంత్రి భోలే బాబాను తెచ్చిన అలీ బాబా ఎవరని ప్రశ్నించారు. ఈ భోలే బాబాను తెచ్చిన చంద్రబాబే. 2018లోనే భోలే బాబా రంగ ప్రవేశం చేశాడు. దాదాపు 87 వేల టిన్నులకు పైగా నెయ్యి ఈ కంపెనీ సరఫరా చేసింది. అది చాలా స్పష్టంగా సీబీఐ నివేదికలోనే ఉంది. కానీ దాన్ని వదిలేసి మా హయాంలోనే నెయ్యి సరఫరా చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భోలే బాబాకు ముందున్న పేరు హర్‌‡్ష –వర్‌‡్ష డెయిరీకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. బీజేపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కు ఇప్పుడు భోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలిసిందని అనుకుంటున్నాం.

ఆ నెయ్యిపైనా విచారణ జరిపించాలి:
    నెయ్యిలో కల్తీ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సిట్‌ విచారణ 2019–24 మధ్య కాలానికి వేశారు. ఇందులో నిందితులుగా తేలిన ప్రీమియర్‌ డెయిరీ 2013 నుంచి 2024 వరకూ నెయ్యిని అనేకసార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు నిజంగా తిరుమల శ్రీవారి మీద భక్తి ఉంటే, మీ గత ప్రభుత్వంలో సరఫరా అయిన నెయ్యిపైనా విచారణ చేయించాలి. ఆ రోజు 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేసిన డెయిరీయే మా హయాంలోనూ సరఫరా చేసిందన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం. 

2018లో టీటీడీ తీర్మానంతోనే నెయ్యి కల్తీకి బీజం:
    విభజిత రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018, ఆగస్టు 27న టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం 87 వేల కేజీల నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్‌ను కలిపిన నెయ్యిని రోజుకు 975 కేజీల చొప్పున కొనుగోలు చేశారు. ఆ రోజున మీరు వాడిన నెయ్యి కల్తీ నెయ్యి కాబట్టే వాసన రాలేదు. అందుకే ఏకంగా రూ.3.75 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫ్లేవర్‌ కలిపారు. 
    అప్పటి జేఈవో అధ్యక్షతన పని చేసిన ఈ కొనుగోలు కమిటీలో విజయ్‌భాస్కర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌ వంటి సాంకేతిక నిపుణుల్ని నియమించారు. వారే ఆ తర్వాత మా హయాంలోనూ కొనసాగారు. ఇప్పుడు సిట్‌ రిపోర్ట్‌ నిందితుల్లోనూ ఉన్నారు. అలాగే ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం కూడా టీడీపీ హయాంలో ఉన్న వ్యక్తే ఇప్పుడు జైల్లో ఉన్నారు. అలాగే టెంపుల్‌ అఫైర్స్‌ ఏవో, ఎస్వీ గోశాల డైరెక్టర్‌ కూడా మొన్నటి వరకూ ఉన్నారు. వీళ్లంతా నెయ్యిని కొనాలని నిర్ణయించి, పలమనేరుకు చెందిన పరాగ్‌ మిల్క్‌ ప్రొడక్ట్స్‌ నుంచి నుంచి కేజీ నెయ్యి రూ.385 చొప్పున కొనుగోలు చేశారు.
    అప్పటికే రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేసే కాలంలోనే ప్రతి రోజూ 975 కేజీల నెయ్యికి ఫ్లేవర్‌ అద్దడానికి వీళ్లు చేసిన దుర్మార్గం ఇది. 2018, ఆగస్టు 28న చేసిన టీటీడీ తీర్మానం 374 ఇందుకు నిదర్శనం. 

దమ్ముంటే 2014 నుంచీ నెయ్యి కల్తీపై విచారణ జరపండి:
    2014 నుంచి ఇదే సీబీఐ దర్యాప్తు వేయించే ధైర్యం మీకు ఉందా? టీటీడీని రాజకీయ పావుగా వాడుకోకపోతే మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసిన వాళ్లు, కొనుగోళ్లు చేసిన వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడు అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ దోషి అంటున్నారు. సిట్‌ ఏర్పాటు చేశాక జంతుకొవ్వు విమర్శలు చేసిన మీరు ఆయన్ను రెండోసారి ఎందుకు ఈవోగా నియమించారు? నెయ్యి పేరుతో అనిల్‌ సింఘాల్‌ను టార్గెట్‌ చేసే ప్రయత్నం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి. 
    చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పదే పదే నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేప నూనె వాడారని దుష్ప్రచారం చేశారు. మీరు ఆరోపించినట్టు ఆ నెయ్యిలో అవేవీ లేవని తేలిపోయింది. అయినా మీరు ఇంకా ఎదురుదాడి చేస్తూ, గత మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తిరుమల శ్రీవారిపై భక్తి ఉంటే, ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకపోతే.. మీ హయాం నుంచే జరుగుతున్న నెయ్యి కల్తీపై విచారణ చేయించమని కోరుతున్నాం.

మేము ఏ నిబoధనలూ సడలించలేదు:
    అలాగే మీ హయాంలో నుంచే ఉన్న అధికారుల్ని మేం నియమించినట్లు చెప్పడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మేం నిబంధనల్ని సడలించడం వల్ల నెయ్యి కల్తీ జరిగిందనేది అబద్ధం. ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి స్టార్టప్‌ కంపెనీలను ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపొందించినవి. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. మీరు తెచ్చిన నిబంధనల్ని మేం సడలించి తెచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదు. భోలేబాబా వంటి కంపెనీలు మీ హయాంలోనే టెండర్లు వేసిన విషయం గుర్తుంచుకోండి. ఏఆర్‌ డెయిరీ, మాల్‌ గంగా వంటి సంస్థలు మేం నిబంధనలు కఠినతరం చేసిన తర్వాతే టెండర్లలో పాల్గొన్నాయి. అర్హతలు ఉన్నాయి కాబట్టే ఈ కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. 

దోషులెవరో సిట్‌ చెప్పినా మాకు అంటగట్టే యత్నం:
    చంద్రబాబు జంతుకొవ్వు, ఆవు  కొవ్వు కలిపారని చెప్పిన నాలుగు ట్యాంకర్లను తిరిగి శ్యామలరావు ఈవోగా, మీరు సీఎంగా ఉండగానే లడ్డూల్లో వాడారని సీబీఐ తన నివేదికలో చెప్పింది. ఇప్పడు చెప్పండి దొంగలెవరో? దోషులెవరో?. మా హయాంలో నాణ్యత లేని 18 నెయ్యి ట్యాంకర్లను మేం వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా 14సార్లు కూడా ఇలాంటి నాణ్యత లేని నెయ్యిని వెనక్కి పంపింది. సీఎస్‌ఆర్టీఐ రిపోర్టులు వచ్చాక ఛైర్మన్‌కు అందిస్తే ఆయన కళ్లు మూసుకున్నారని ఎలా చెప్తారు? టీటీడీ పాలక మండలి తనకున్న అధికారాల్ని ఈవోకు బదలాయించిన విషయం మీకు నిజంగా తెలియదా? అధికారులు ఈవోను కలవకుండా ఛైర్మన్‌ను ఎలా కలిశారు?.
    వాస్తవాలన్నీ ఇలా ఉంటే, కేవలం దురుద్దేశంతో టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా విచారణ చేయిస్తాం అంటున్నారు. మీ దృష్టిలో మేము (గత వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వం) నేరస్తులమని, శ్రీ వెంకటేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా విచారణ జరిపిస్తామని కబుర్లు చెబుతున్నారు. నిజంగా నేరస్తులు అయితే శిక్షించమనే కదా మేం ముందు నుంచే అడుగుతున్నాం. సీబీఐ వంటి సంస్థే మేం నిర్దోషులమని నిర్దారించాక కొద్ది మంది అధికారులు, సరఫరా దారులు, టెక్నికల్‌ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారని రిపోర్ట్‌ ఇస్తే మా వాళ్లను దోషులుగా చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు?. 

మేము తప్పు చేయలేదు. అందుకే గట్టిగా నిలబడ్డాం:
    పవన్‌కళ్యాణ్‌ తమ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నెయ్యిలో ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసిందని, అది అబద్దమని మా పార్టీ చేస్తున్న వాదనను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నామని, ఏం నిద్రపోతున్నారా అని కాకినాడ ఎంపీతో పాటు, తన సోదరుడిని కూడా ప్రశ్నించారు. నెయ్యిలో నిజంగా జంతుకొవ్వు కలిసినా, అది బయట పెడితే, ఎక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయోనని, సిట్‌ ఛార్జ్‌షీట్‌లో రాయలేదని చెబుతున్నారు.
    ఒకవేళ నిజంగా సీబీఐ ఆ పని చేసి ఉంటే, సనాతని, హైందవ ధర్మ పరిరక్షకుడదని చెప్పుకునే పవన్, అప్పుడు, ఇప్పుడు పదే పదే అదే మాట ఎందుకు చెబుతున్నారు. తిరుమలలో వాడిన నెయ్యిలో పందికొవ్వు, జంతుకొవ్వు, చేపనూనె కలిసిందని ఎలా ఆరోపిస్తున్నారు? సనాతనిగా ఉన్న మీరు భక్తుల మనోభావాల్ని ఎలా దెబ్బ తీస్తున్నారు?. తప్పు చేయలేదు కాబట్టే మేం ఛాలెంజ్‌గా మాట్లాడుతున్నాం. మీరు అబద్దాలు చెప్పారు కాబట్టే దాన్ని సమర్థించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అటు టీడీపీలో కూడా ముప్పు తిప్పలు పడుతున్నారు. 

సీబీఐ రిపోర్ట్‌ పై విచారించే అధికారం మీకు లేదు:
    సీబీఐ నివేదిక మీద విచారణ చేసే అధికారం మీది కాదు కోర్టుది. కానీ నేరస్తుల్ని మేమే గుర్తించామంటూ విచారణలకు సిద్దమవుతున్నారు. ఇలాంటి తీర్పులు ఇచ్చే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. చంద్రబాబుకు ధైర్యం ఉంటే, నెయ్యిలో ఫ్లేవర్‌ కలపాలన్న నాటి టీటీడీ బోర్డు నిర్ణయానికి సమాధానం చెప్పాలి. మళ్లీ చెబుతున్నాం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ నివేదికపై, మరో విచారణ జరిపించే అధికారం మీకు లేదు.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
    అనిల్‌ సింఘాల్‌ విషయంలో సీఎం పేషీనే పెద్ద నాటక వేదిక. ఆయన ఏ సిఫార్సుతో వచ్చారో మాకు తెలియదు కానీ, ఆయన్ను వచ్చిన రోజు నుంచే బదిలీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. సీబీఐ నివేదికను అడ్డు పెట్టుకుని ఇప్పుడు బదిలీ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం సరైన విచారణ చేయలేదని కేబినెట్‌ తీర్మానం చేస్తే అప్పుడు మళ్లీ మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి చెప్పుకోవాలి. చంద్రబాబు మిమ్మల్ని పట్టించడం అంటే దొంగ పోలీసును పట్టించినట్లుంది. కాబట్టి నెయ్యి మీద మీరు విచారణలు చేయడం కాదు మళ్లీ సుప్రీంకోర్టుతోనే ఆ పని జరిగేలా చూడాలని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top