కోడుమూరు: రాష్ట్రంలో రెండేళ్లుగా కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు వైయస్ఆర్సీపీ చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా కోడుమూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మండల కన్వీనర్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించగా, వైయస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాల్గొన్నారు. మాజీ చైర్మన్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండేళ్లుగా దుర్మార్గ, అరాచక, మాఫియా పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ పథకాలను నిలిపివేయడమే కాకుండా, వాటిని అమలు చేసినట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రెండేళ్ల పాలనలో జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు కేవలం సమావేశాలు, ప్రెస్మీట్లు సరిపోవని, అందుకే గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్, పోస్టర్లను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని, వాటిని చదివి వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలను కూడా స్వీకరిస్తామని చెప్పారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, జూన్ 8, 9 తేదీల్లో టౌన్‌హాల్ సమావేశాలు, జూన్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య అమలు చేసిన సంక్షేమ పాలనను ప్రస్తుత పాలనతో పోల్చి ప్రజలకు వివరించనున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేశామని చెబుతున్న సూపర్ సిక్స్ హామీలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు, మేథావులు, యువత ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలని డాక్టర్ ఆదిమూలపు సతీష్ పిలుపునిచ్చారు.