శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత.. సిఫార్సు లేఖలకు అనుమతి లేదు

తిరుపతిలో 9 కౌంటర్ల ఏర్పాటు.. ఉచితంగా బుకింగ్‌ చేసుకోవచ్చు

ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదం

జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కల్పించడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, మఠాధిపతులు, పీఠాధిపతుల సూచనలు, సలహా మేరకు పది రోజుల పాటు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం గతేడాది ప్రారంభించడం జరిగిందన్నారు. అదే సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా పాటిస్తున్నామని చెప్పారు. 

సామాన్య భక్తులు ఎక్కువ మందికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక్కæవిన్నపం చేస్తున్నామని, క్యూ లైన్‌లో ఎక్కువ గంటల పాటు భక్తులు వేచి ఉండకుండా తిరుపతి పట్టణంలో సుమారు 9 టోకెన్లు ఇచ్చే కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా కౌంటర్లలో ఉచితంగా స్వామివారి దర్శనం టికెట్‌ బుక్‌ చేసుకుంటే మూడు, నాలుగు గంటల్లో దర్శనం చేసుకొని కిందకు వెళ్లిపోవచ్చన్నారు. తిరుమల కొండపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధన పెట్టడం జరిగిందని, దయచేసి ఈ నిబంధనను గమనించి పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

అదే విధంగా వీఐపీలందరికీ విజ్ఞప్తి చేశామని, వైకుంఠ ద్వార దర్శనం జరిగే ఈ పదిరోజులు వీఐపీలు, వారి కుటుంబ సభ్యులు స్వతహాగా దర్శనానికి వస్తే.. నియమావళి ప్రకారం దర్శనానికి ఏర్పాట్లు చేస్తామని, సిఫార్సు లేఖలు తీసుకొని మాత్రం ఎవరూ ఈ పదిరోజులు దర్శనానికి రావొద్దని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద కేంద్రాల్లోనే కాకుండా నిర్దేశించిన ప్రాంతాల్లో నిత్యం అన్నప్రసాదం అందజేయడం జరుగుతుందన్నారు. స్వామివారి దర్శనం చేసుకునే భక్తులకు యధావిధిగానే ఉచిత లడ్డూ అందించడం జరుగుతుందన్నారు.  

 

Back to Top