సీఎంను ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్నారు

చంద్రగిరి, కుప్పంలో చంద్రబాబుకు గట్టి గుణపాఠం 

మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్‌ సీపీదే విజయం

వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

చంద్రగిరి: సొంత నియోజకవర్గం చంద్రగిరి, వలస నియోజకవర్గం కుప్పంలో ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంక్షేమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. చంద్రగిరి నియోజకవర్గం తనపల్లి క్రాస్‌ వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరిలో గత పదేళ్లుగా వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులను టీడీపీ నేతలు అనేక కష్టాలు పెట్టారన్నారు. ఆ కసి అంతా మనసులో పెట్టుకొని పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. కుప్పం నియోజకవర్గంలోనూ చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆశీస్సులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి నాయకత్వంలో మీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోండి అని సర్పంచ్‌లకు సూచించారు.  

చిత్తూరు జిల్లాలో 1369 పంచాయతీలకు ఎన్నికలకు గానూ, 1174 పంచాయతీలు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీపై చిత్తూరు జిల్లాలో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి పంచాయతీ ఫలితాలే నిదర్శనమన్నారు. టీడీపీకి డిపాజిట్లు రాకుండా చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకొని అనేక ఆటంకాలు సృష్టించిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు గెలుపు ఖాయమన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించారని, కరోనా కష్టాకాలంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆదుకున్నారని చెప్పారు. 

Back to Top