డీఎస్సీ స్కాంపై పెనుకొండలో టౌన్‌హాల్ సమావేశం

సీబీఐ విచారణ జరిపించాలి: ఉషశ్రీ చరణ్ డిమాండ్

పెనుకొండ: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పెనుకొండ వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.

డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలి

డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న లీకేజీలు, అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని ఉషశ్రీ చరణ్ కోరారు. డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయడంతో పాటు, ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. ఆగస్టు 6 నుంచి 9 వరకు పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న డీఎస్సీ బాధితులకు మద్దతుగా, లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో యువత, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని డీఎస్సీ అక్రమాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Back to Top