శ్రీ సత్యసాయి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సందర్శిస్తారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ప్రచార ఆర్భాటానికే పరిమితమైన బాబు.. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో కరువు జిల్లా అయిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను నెలకొల్పనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.పాలసముద్రం సమీపంలో 502 ఎకరాల్లో నాసిన్ సంస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014లో ఒకసారి, 2015 ఏప్రిల్ 15న మరోసారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత మిన్నకుండి పోయారు. 2015 నుంచి 2019 వరకు నాసిన్ సంస్థ కోసం సేకరించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరిగింది లేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచిన వెంటనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి విభజన హామీలు సత్వరం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే 2022 మార్చి 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ పాలసముద్రం సమీపంలో నాసిన్ సంస్థ ఏర్పాటుకు సేకరించిన భూముల్లో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. రూ. 749 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. పనులు ప్రాంభమైనప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాసిన్ పనుల పురోగతిపై అధికారులతో అనేక సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో పనులు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్రమోదీ నాసిన్‌ను సందర్శిస్తున్నారు. 74,75 వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. పాలసముద్రానికి ప్రత్యేక గుర్తింపు... నాసిన్ సంస్థ ఏర్పాటుతో పాలసముద్రం గ్రామం దేశంలోనే కాకుండా ప్రపంచ పటంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకోనుంది. ముస్సోరీ, హైదరా బాద్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చినట్లుగానే, పాలసముద్రం నాసిన్‌లో ఐఆర్‌ఎస్ పోస్టులకు ఎంపికై న వారికి శిక్షణ ఇస్తారు. అలాగే, దక్షిణాసియా దేశాలకు చెందిన ఐఆర్‌ఎస్ అధికారులు కూడా ఇక్కడ శిక్షణ పొందనున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన జేసీ ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో ఆదివారం నాసిన్‌ను జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ సందర్శించారు. ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లేపాక్షి వీరభద్ర స్వామిని దర్శించుకోనున్న ప్రధాని ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 16న లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రానున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ లేపాక్షిలో పర్యటించారు. నంది విగ్రహం సమీపంలో 3 హెలిప్యాడ్‌ల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. వీరభద్ర స్వామి ఆలయాన్ని పరిశీలించి, చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఏపీ టూరిజం కార్యాలయంలో అధికారులతో సమావేశమై, దిశా నిర్దేశం చేశారు. ప్రధాని పర్యటన ఇలా 16న మధ్యాహ్నం ప్రధాని మోదీ పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లోని యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్‌ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్‌ను సందర్శిస్తారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎక్స్– రే, బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు. వారితో గ్రూప్ ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. తదుపరి పబ్లిక్ ఫంక్షన్‌లో ‘ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు.