ఓటు హక్కు వినియోగించుకున్న డాక్ట‌ర్ గురుమూర్తి

ప్ర‌శాంతంగా తిరుప‌తి ఉప ఎన్నిక పోలింగ్‌

తిరుప‌తి: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలున్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అనుమతిస్తారు. గతంలో ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఉండగా క్యూలైన్లలో ఒత్తిడిని తగ్గించడానికి ఇప్పుడు ప్రతి 1,000 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న 28 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17,11,195 మంది ఓటర్లు తేల్చనున్నారు. మన్నసముద్రంలో వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి డాక్ట‌ర్ గురుమూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం ఓటు వేశారు.  నెల్లూరు జిల్లా  పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పక్రియ జరుగుతోందన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల పరిధిలో సర్వేపల్లి  నియోజకవర్గం నుంచి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఓట‌ర్లు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు. 

Back to Top