ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడ్డాయని వైయస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరింపులకు దిగడం, నామినేషన్ కేంద్రాల వద్ద భయానక వాతావరణం సృష్టించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి పోలీసులు తలొగ్గి, ప్రతిపక్ష అభ్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. దర్శిలో గూండాల మోహరింపు.. పోలీసుల లాఠీచార్జి దర్శి పట్టణాన్ని దిగ్బంధించేందుకు నరసరావుపేట నుంచి భారీగా గూండాలు, రౌడీలను తీసుకొచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి అనుచరుల దౌర్జన్యాలతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వైయస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైయస్ఆర్సీపీ అభ్యర్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారని, దీనిపై ప్రశ్నించిన వారిపై పలుమార్లు లాఠీచార్జి చేశారని ఆరోపించాయి. మధ్యాహ్నం నామినేషన్లు వేయడానికి అనుమతిస్తామని పోలీసులు హామీ ఇచ్చినా, నిర్ణీత సమయానికి అభ్యర్థులను అనుమతించలేదని విమర్శించాయి. దీంతో నామినేషన్ పత్రాలను చేతబట్టి వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నిరసనకు దిగారు. నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ మూకలు కత్తులు, రాడ్లు, రాళ్లతో మోహరించినా పోలీసులు వారిని అడ్డుకోలేదని ఆరోపించాయి. దర్శిలో 25 వార్డుల్లో నామినేషన్లకు అడ్డంకులు దర్శి మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా, చైర్మన్ అభ్యర్థితో సహా 25 వార్డుల్లో వైయస్ఆర్సీపీ నామినేషన్లు దాఖలు కాకుండా అడ్డుకున్నారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పోటీదారులను ఎన్నికల బరిలోకి దిగనీయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దర్శి చరిత్రలో ఇలాంటి దారుణాలు చూడలేదంటూ స్థానికులు చర్చించుకున్నారని పేర్కొన్నాయి. కనిగిరిలో 8 వార్డుల్లో అడ్డంకులు కనిగిరి మున్సిపాలిటీలో ఎనిమిది వార్డుల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా చేసిన అనంతరం కూటమి నేతలు విజయోత్సవాలు చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. దర్శిలో చైర్మన్ ఎంపికపై వివాదం దర్శిలో టీడీపీకి చెందిన వ్యక్తికి అప్పటికప్పుడు జనసేన కండువా కప్పి చైర్మన్ పదవిని దక్కించుకునేలా అడ్డదారులు తొక్కారని వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి అభ్యర్థి హక్కు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడడం, నామినేషన్ కేంద్రాల వద్ద హింసాత్మక వాతావరణం సృష్టించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దర్శి, కనిగిరిలో జరిగిన ఘటనలపై నిష్పక్షపాత విచారణ జరిపి, అభ్యర్థుల హక్కులను కాపాడాలని, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని వైయస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.