మరో విషప్రచారానికి టీడీపీ తెర

నాలుగు రోజుల్లో ఐటీదాడులంటూ వైయస్‌ జగన్‌పై నెట్టే ప్రయత్నం

20 రోజుల్లో చంద్రబాబు ఇంకా దిగజారిపోయే అవకాశం ఉంది

బాబులాంటి వ్యక్తి సీఎంగా ఉంటే రాష్ట్రం వందేళ్లు వెనకెళ్తుంది

వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై అనుమానాలున్నాయి

డేటాచోరీ చేసి ఓటర్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్న బాబు

వాటి ఆధారాలు కూడా సేకరిస్తున్నాం

బాబు దుశ్చర్యలతో బాధితులైన సకల వర్గాలు ఆలోచించి ఓటేయాలి

వైయస్‌ జగన్‌ రాజకీయ సలహాలదారు సజ్జల రామకృష్ణారెడ్డి

హైదరాబాద్‌: చంద్రబాబు ఇంకా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా.. రాష్ట్రం వందేళ్లకు కూడా కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలు మరో 20 రోజులు ఉన్నాయని, ఈ 20 రోజుల్లో చంద్రబాబు ఇంకా దిగజారిపోయే అవకాశం ఉందన్నారు. నాలుగు రోజుల్లో ఐటీ దాడులంటూ పుకార్లు పుట్టిస్తున్నారని, మోడీ, వైయస్‌ జగన్‌ కలిసి చేయిస్తున్నారనే విషప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు పరిపాలించాలని ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు మేలు చేయకుండా కుర్చీపై ఒన్న మోజుతో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర చేశాడని, ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ చంద్రబాబు ఇన్నాళ్లూ గడిపాడన్నారు. రాష్ట్రానికి బాబు చేసిన పని ఒక్కటి కూడా లేదన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని సజ్జల అన్నారు. చంద్రబాబు వెకిలి మాటలతో కేసును పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై నిస్పక్షపాత దర్యాప్తు జరగాలని, చంద్రబాబు ప్రమేయం లేని సంస్థలతో విచారణ జరిపితే దోషులు బయటకు వస్తారన్నారు. 

చంద్రబాబు పథకం ప్రకారమే అన్నీ చేస్తున్నాడని, వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం, డేటా చోరీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఇవన్నీ ఒక పథకం ప్రకారమే చేశాడన్నారు. ఇవి కాకుండా కొత్తగా మరో నాలుగు రోజుల్లో ఐటీ దాడులు జరుగబోతున్నాయంటూ.. దాన్ని వైయస్‌ జగన్‌పై నెట్టేందుకు దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన మోడీ, చంద్రబాబు మధ్యలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని, ఏదో జరగబోతుందని చంద్రబాబుకు ఢిల్లీలో తన కోటరీ ద్వారా లీకులు వచ్చినట్లుగా ఉంటుందన్నారు. 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన సమయంలో నటుడు శివాజీ చెప్పినట్లుగానే జరిగిందని చంద్రబాబు రీకాల్‌ చేయడంతో అనుమానం బలపడిందని సజ్జల అన్నారు. ఆపరేషన్‌ గరుడ అనే కుట్ర వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతం చేయడానికి జరిగిందని, ఈ పథకం ఎప్పటి నుంచో తయారైనట్లుగా తెలుస్తుందన్నారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే సానుభూతి తెలపాల్సిన ముఖ్యమంత్రి చిన్నదిగా చేసి మాట్లాడినప్పుడే దీని వెనుక బాబు హస్తం ఉందని అనుమానం వచ్చిందన్నారు. 

మళ్లీ ఐటీ దాడుల గురించి వైయస్‌ జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేసే అవకాశాలు వచ్చే రోజులు దగ్గర ఉన్నాయని సజ్జల అన్నారు. ఐదేళ్ల పాటు అవకాశం ఇచ్చిన ప్రజలకు మంచి చేశాం, ఓట్లు వేసి ఇంకోసారి అధికారం ఇవ్వండి అని చెప్పే ధైర్యం లేక పొద్దున లేచిన నాటి నుంచి వైయస్‌ జగన్‌ పేరు తలుచుకుంటూ ప్రతిపక్షమే ప్రభుత్వం నడుపుతున్నట్లుగా చంద్రబాబు దాడి చేస్తున్నారన్నారు. మొదట ప్రతిపక్షం ఉండకూడదు అని ఫిరాయింపులను ప్రోత్సహించి, అప్పటి నుంచి కుట్రలు చేస్తూ వస్తున్నారు. డేటా చోరీ చేసి ఓట్లను తీయించడం, దొంగ ఓట్లను చేర్చడం వంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. డేటాచోరీ చేసి ఓటర్ల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తున్నారని, ఆ ఆధారాలు కూడా వెలికి తీస్తున్నామన్నారు. ఓట్లను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారన్నారు. 

చంద్రబాబు దుశ్చర్యలతో బాధితులైన సకల వర్గాల ప్రజలు ఒకటి ఆలోచించాలని, ఈ ప్రభుత్వం ఒక్క రోజు ఉన్నా కూడా రాష్ట్రం వందేళ్లకు కోలుకోలేనట్లుగా దెబ్బతింటుందన్నారు. ఎండిపోయిన ఆవు నుంచి రక్తం కూడా పిండేసి కళేబరం చేసేలాంటి వ్యక్తి చంద్రబాబు అన్నారు. పర్మనెంట్‌గా కుర్చీలో కూర్చోవాలని చూస్తున్న చంద్రబాబు కుట్రలను విఫలయం చేయాలంటే కచ్చితంగా ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేస్తే బాగుంటందో ఆలోచించుకోవాలని ఓటర్లకు సూచించారు. 
 
 

Back to Top