అమరావతిలో ఖర్చుపై టీడీపీవి కాకిలెక్కలు

సీఆర్‌డీఏ భవనం ఎస్‌ఎఫ్‌టీకి రూ.8,816

దాన్ని దాచి పెట్టి అవాస్తవాలతో ప్రజెంటేషన్‌

అలా ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం

వంగవీటి నరేంద్ర ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర.

అమరావతిలో నిర్మాణానికి దారుణంగా వ్యయం

అక్కడ ఎస్‌ఎఫ్‌టీ ఖర్చు రూ.7 వేలు పచ్చి అబద్ధం

టెండర్ల విలువను ఇష్టానుసారం అడ్డగోలుగా పెంచారు

చదరపు అడుగులు పెంచి సగం రేట్లు చూపిస్తున్నారు.

ఎవరిని మభ్య పెట్టడానికి ఈ డ్రామాలు?

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధానికి కేంద్రం నిధులెందుకు?

ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన వంగవీటి నరేంద్ర

తాడేపల్లి: అమరావతి రాజధానిపై ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అధారాలు లేని లెక్కలతో టీడీపీ నేతల తాజా ప్రజంటేషన్లు అందుకు నిదర్శమని వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర వెల్లడించారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.7 వేలు మాత్రమే ఖర్చు పెడుతున్నట్లు టీడీపీ చెబుతున్న లెక్కలన్నీ అబద్ధాలేనని, టెండర్ల విలువ దారుణంగా పెంచి, ఒక్కో ఎస్‌ఎఫ్‌టీకి రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు చేస్తున్నారని ఆయన తెలిపారు. అమరావతిలో నిర్మాణాలపై సమాచార హక్కు చట్టం కింద కూడా వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని, రాజధానిపై అంత గోప్యత ఎందుకని ప్రశ్నించారు. ఇంకా చదరపు అడుగులు పెంచి, వ్యయాన్ని సగం చేసి చూపుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంగవీటి నరేంద్ర ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో వంగవీటి నరేంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..:

అమరావతిపై ప్రభుత్వం కాకిలెక్కలు:
    రాజధానికి సంబంధించి ప్లాన్‌–బి కింద జగన్‌గారు ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు.. మావిగన్‌ను మేధావి వర్గంతో పాటు, పలువురు స్వాగతిస్తున్నా, ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్దంగా పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్స్‌ చేయిస్తోంది. మరోవైపు అమరావతిలో నిర్మాణ వ్యయంపై కూడా ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతూ, ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ దిశలోనే టీడీపీ నాయకుడొకరు తనకు నచ్చిన రేట్లు వేసి, ప్రెస్‌మీట్‌లో ప్రజెంట్‌ చేశారు. కానీ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, టెండర్ల వివరాలు సహా, ఏ ఆధారాలు చూపలేదు. 
    2017లో సీఆర్డీయే భవనానికి జీ ప్లస్‌ 1 కోసం ప్రభుత్వం పిలిచిన టెండర్ల విలువ దాదాపు రూ.40 కోట్లు. ఆ తర్వాత దాన్ని జీ ప్లస్‌ 7గా మార్చి 2018లో రూ.85 కోట్లకు టెండర్లు పిలిచారు. మళ్లీ ఇవాళ అదే సీఆర్డీయే భవనం జీ ప్లస్‌ 1కు ప్రభుత్వం పిలిచిన టెండర్ల విలువ రూ.73 కోట్లు. ఏసీలు, లిఫ్ట్‌లు, జీఎస్టీ ఛార్జీలు దీనికి అదనం. కాగా, కాంట్రాక్టర్లకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా రీయింబర్స్‌ చేస్తోంది. అవన్నీ ఒక్క సీఆర్‌డీఏ భవనం నిర్మాణ వ్యయం ఏకంగా రూ.335 కోట్లు. ఆ ప్రకారం ఒక్కో చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) నిర్మాణ వ్యయం అక్షరాలా రూ.8,816. మరి దీన్ని ఎందుకు దాచిపెట్టారు?.

రాజధానిలో ఎస్‌ఎఫ్‌టీ ఖర్చు రూ.7 వేలు పచ్చి అబద్ధం:
    రాజధానిలో కడుతున్న భవనాల్లో ఎస్‌ఎఫ్‌టీకి రూ.7 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు చెప్తున్నారు. కానీ టెండర్లను పరిశీలిస్తే.. సీఎంవో, హెచ్‌ఓడీ కార్యాలయాలు ఒకటైతే, సచివాలయం 1,2,3,4 టవర్స్‌ బేస్‌ మెంట్, గ్రౌండ్‌ ప్లస్‌ 39 అంతస్తులు. వీటి మొత్తం కాంట్రాక్టు విలువ 2017లో రూ.2,200 కోట్లు కాగా, ఇప్పుడు సవరించిన అంచనాల ప్రకారం రూ.3,500 కోట్లు. దానికి అదనంగా ఎన్‌ఏసీ, జీఎస్టీ, లిఫ్ట్‌లు, ఫైర్‌ ఫైటింగ్‌ అన్నీ కలిపితే మొత్తం ఖర్చు రూ.4,400 కోట్లు అవుతోంది. మళ్లీ ఆ భవనాలకు లైటింగ్, విద్యుత్, ప్లంబింగ్‌ కోసం రూ.2,316 కోట్లు కేటాయించారు. అవే కాకుండా ఇతర సదుపాయాల పేరుతో మరో రూ.1,053 కోట్లు కూడా కేటాయించారు. అవన్నీ కలిపితే ఆ భవనాల మొత్తం నిర్మాణ వ్యయం అంచనా ఇప్పుడు ఏకంగా రూ.7,724 కోట్లకు చేరింది. ఆ లెక్కన చూస్తే ఒక్కో ఎస్‌ఎఫ్‌టీకి రూ.12,779 నుంచి రూ.14 వేల వరకు అవుతుంది. 

విస్తీర్ణం పెంచి చూపి, రేటు సగం చెబుతున్నారు:
    మరోవైపు టీడీపీ నాయకులు మాత్రం ఆ భవనాల కోసం రూ.4,890 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. టెండర్‌ ప్రకటన ప్రకారం చూస్తే ఆ భవనాల విస్తీర్ణం 52,20,496 చదరపు అడుగులు. అందులోనే పార్కింగ్‌ ఏరియా, చుట్టు పక్కల అభివృద్ధి ఉన్నా, వాటిని అదనంగా చూపి భవనాల విస్తీర్ణం 70 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా చూపుతున్నారు. అలా విస్తీర్ణం పెంచి, రేటు సగం తగ్గినట్లు చెబుతున్నారు. ఇదంతా ఎవరిని మభ్యపెట్టడానికి?.

తప్పు చేయకపోతే ఆ గోప్యత ఎందుకు?:
    సీఆర్డీయే పరిధిలోకి వచ్చే నిర్మాణాలపై సమాచార హక్కు  చట్టం (ఆర్టీఐ) ప్రకారం వివరాలు ఇవ్వబోమని జీవో విడుదల చేశారు. 
రాజధానిలో ఎలాంటి తప్పులు చేయకపోతే, ఆ వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?. అక్కడ నిర్మాణాలకు ఎస్‌ఎఫ్‌టీకి దాదాపు రూ.14 వేలు ఖర్చు చేస్తున్నా, రూ.7 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు అబద్దం చెబుతూ, అందరినీ మభ్య పెట్టాలని చూస్తున్నారు. అందుకే నిజాలు మాట్లాడుతున్న జగన్‌గారిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
    రాజధానిలో అన్ని నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? అక్కడ ఎవరు వచ్చి స్దిరపడతారు? అన్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. ఎప్పుడు అడిగినా ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి దాటవేస్తున్నారు. ఇప్పుడు నాలుగు టవర్లు కడతాం. అసెంబ్లీ భవనం కడతామని మాత్రమే చెబుతున్నారు. నాడు మీరు ఆర్భాటంగా ప్రకటించిన నవ నగరాలు ఏమయ్యాయి? 

లక్ష జనాభాకు రెండు లక్షల కోట్ల ఖర్చా!:
    గతంలో సింగపూర్, జపాన్‌ కంపెనీలకు కన్సల్టెన్సీల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్లీ డిజైన్ల పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తూ దోచుకుంటున్నారు. ఇంకెన్ని డిజైన్లు కావాలి? డిజైన్ల పేరుతో దోచుకుంటాం. మళ్లీ వర్షాలు పడతాయి. అది క్లియర్‌ అయ్యే లోపు పిచ్చి మొక్కలు పెరుగుతాయి. వాటిని తీయించడానికి మళ్లీ కోట్ల ఖర్చు. ఇదే మీ నిరంతర ప్రక్రియ. అసలు జన సంచారం లేని చోట రాజధాని కడతారా?
    అందుకే ప్లాన్‌–బి కింద జగన్‌గారు మావిగన్‌ సూచించారు. అమరావతిలో కనీసం మౌలిక వసతుల కోసం చేసే ఖర్చులో కేవలం 10 శాతం, అంటే రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరుతో కలిపి రాజధాని ‘మావిగన్‌’  ఏర్పాటవుతుంది. ఈ వాస్తవాలన్నీ మర్చి, 29 గ్రామాల అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ కూడా రాజధాని పేరుతో మోసం చేస్తున్నారు. ఆ పనుల పేరుతో అంచనాలు పెంచి, దారుణంగా దోచుకుంటున్నారు.

అదే నిజమైతే కేంద్ర నిధులు అవసరమా?:
    అమరావతిని చంద్రబాబు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధానిగా చెప్పుకుంటున్నారు. అటువంటప్పుడు కేంద్రాన్ని నిధుల కోసం అడుక్కోవడం ఎందుకు? మిమ్మల్ని చూసి ప్రజలు గెలిపించింది నిజమైతే అమరావతికి పెట్టుబడులు కూడా భారీగా రావాలి. కానీ కేంద్రాన్ని అడుక్కోవాల్సిన దుస్దితి ఎందుకొచ్చింది?. కాబట్టి ఇది అమరావతి కాదు భ్రమరావతి మాత్రమే. రేణుకా చౌదరి అయితే కమ్మరావతి అంటున్నారు. అంటే రాజధానిని కేవలం ఒక వర్గానికే పరిమితం చేసి, ఇతరులు రావొద్దని, అలా రావాలంటే టికెట్‌ పెట్టాలనుకుంటున్నారా? అని వంగవీటి నరేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Back to Top