తాడేపల్లి: మైనారిటీల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై పార్టీ బలోపేతం, ప్రజల తరఫున చేయాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అధ్యక్షులతో పాటు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్ధాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యం. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే. మన నాయకుడు వైయస్ జగన్ గారి శక్తి కూడా కార్యకర్తలే. పార్టీ తన ప్రస్ధానంలో అనేక రికార్డులు సృష్టించింది. వైయస్ జగన్ గారు తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏవేవి చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్ధం చెప్పిన పాలన మనది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అడ్డుకుంటూ.. అరాచకం: వైయస్ జగన్‌కు ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో వైయస్ జగన్‌గారి పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే, సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పొలీసులను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రశ్నించే గొంతులు నొక్కుతోంది. ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణితో పని చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఆ కేసులు ఎదుర్కొనే సత్తా మన నాయకుడికి ఉంది. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక్క పథకం కూడా అమలు చేయకున్నా, లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే మైనారిటీ సంక్షేమం: ఎన్నికలు ఎప్పుడొచ్చినా, మనం ధీటుగా ఎదుర్కోగలం. మనం సంస్ధాగతంగా ఇంకా బలపడాలి. పార్టీ నెట్‌వర్క్ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్ధాయి వరకు వెళ్ళాలి. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలం. అలాగే మన పార్టీపై అదేపనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా ఎదుర్కోగలగుతాం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఏనాడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగింది. మన పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా మన వెంటే ఉండేలా, మీరంతా కృషి చేయాలి. చొరవ చూపాలి. వైయస్ఆర్‌సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సజ్జల రామకృష్నారెడ్డి, పార్టీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోరుకుంటుందని స్పష్టం చేశారు.