ల‌క్ష కోట్లు కాదు.. ల‌క్ష అబ‌ద్ధాల‌తో చంద్ర‌బాబు పాల‌న 

 రైతుకు భ‌రోసా క‌ల్పించే కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ఒక్క‌టీ లేదు

 గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్ 

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా రాయ‌చోటిలోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి

 రాయ‌ల‌సీమ‌లో హార్టీ క‌ల్చర్ అభివృద్ధి వైఎస్సార్ ఘ‌న‌త‌

 ఉద్యాన తోట‌ల గురించి మాట్లాడే అర్హ‌త చంద్ర‌బాబుకి లేదు 

 వాట‌ర్ మ్యాన్ అని త‌న‌కు తానే చంద్ర‌బాబు సెల్ఫ్ డబ్బా 

కానీ ప‌ల్లెల్లో ప్ర‌జ‌లంతా ఆయ‌న్ను డ్రాట్ మ్యాన్ అంటున్నారు 

 తాను ప్రార్థించ‌గానే విశాఖ‌ప‌ట్నంలో భారీ వ‌ర్షం కురిసింద‌ని చంద్రబాబు చెప్పాడు 

 ఆయ‌న పుట్టిన రాయ‌ల‌సీమ తీవ్ర‌మైన కరువులో ఉంటే ఎందుకు ప్రార్థించ‌డు? 

 ఆర్భాట‌పు ప్ర‌క‌ట‌న‌లు, ప‌బ్లిసిటీ స్టంట్లు ఆపి క‌రువు ప్ర‌ణాళిక ప్ర‌క‌టించాలి

 గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్  

రాయ‌చోటి: అన్నమయ్య జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, రైతులు కళ్లముందే పంటలు, ఉద్యాన తోటలు ఎండిపోతూ అల్లాడుతున్నా ల‌క్ష కోట్లతో హార్టీక‌ల్చ‌ర్ హ‌బ్ అని ఆర్భాటపు మాటలతో చంద్ర‌బాబు కాలక్షేపం చేస్తున్నాడ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాయ‌చోటిలోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆర్భాట‌పు ప్రచారం చాలించి మొక్కలు ఎండిపోకుండా కాపాడుకునేలా రైతుకు భరోసా కల్పించే కార్యాచరణ ఏదైనా ఉంటే చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇది ల‌క్ష అబ‌ద్ధాల‌తో న‌డుస్తున్న ప్ర‌భుత్వ‌మ‌ని ఎద్దేవా చేశారు. అన్నమయ్య జిల్లాలో 78.7 శాతం వర్షపాతం లోటు ఉంటే రైతుల పరిస్థితి ఏమిటో ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలోకి వచ్చి చూడాలని అన్నారు. 800 అడుగుల లోతుకు బోర్ వేసినా నీరు పడక, అప్పులపాలై మూడో బోర్ వేసే స్థోమ‌త లేని దారుణమైన పరిస్థితిలో అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం మదనపల్లెలో బస్సు యాత్రలు, హెలికాప్టర్ల టూర్ల కోసం వందల కోట్లు ఖర్చు పెడుతూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని.. అలాంటి రైతుకు మీరు ఇచ్చిన భరోసా ఏమిటి? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఖరీఫ్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రతి ఎకరాకు రూ.25 వేలు, సాగు కాని భూములకు రూ.15 వేల నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని వైయస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామ‌ని గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

రాయ‌ల‌సీమ‌కు చంద్ర‌బాబు వ‌ల్ల ఒరిగిందేమీ లేదు: 
రాయలసీమలో 78.7 శాతం వర్షపాతం లోటు ఉంది. రైతులు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటపు మాటలు చెప్పడం తప్ప రైతుకు భరోసా ఇచ్చే కార్యాచరణ ఏమి లేదు. తాను ప్రార్థించగానే విశాఖలో వర్షం కురిసిందని చెప్పుకొంటున్న చంద్రబాబు.. తాను పుట్టిన రాయలసీమలో కరువు తాండవిస్తుంటే ఇక్కడ కూడా వర్షం కురవాలని ఎందుకు ప్రార్థించలేదో చెప్పాలి. రాయ‌ల‌సీమ‌లో 800 అడుగుల వరకు బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు.. రెండో బోరు, మూడో బోరు వేస్తూ రైతులు అప్పుల పాలవుతున్నారు. ఎండిపోతున్న మామిడి, చీనీ, బత్తాయి తోటలను కాపాడేందుకు ప్రభుత్వం ఏం చేసింది? ఏం ఒరగబెట్టారు మా ప్రాంతానికి? లక్ష కోట్లు కాదు.. లక్ష అబద్ధాలతో నడుస్తున్న ప్రభుత్వం ఇది. మూడు సంవత్సరాలుగా ఆర్భాటపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. అమరావతికి ఎయిర్‌బస్ వస్తుంది, హైపర్‌లూప్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది అని చెప్పినట్టే ఇప్పుడు కూడా లక్షల కోట్ల పెట్టుబడులంటూ మాయ మాటలు చెబుతున్నారు. రైతుకు కావాల్సింది ఆర్భాటాలు కాదు.. ఎండిపోతున్న మొక్కకు భరోసా, నష్టపోయిన రైతుకు పరిహారం. టమాటా రైతు 15 కిలోల బాక్స్‌ను రూ.30–40కే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మిర్చి క్వింటాల్ ధర రూ.29 వేల నుంచి రూ.7,500కు పడిపోయింది. ఉల్లి, అరటి, బత్తాయి, మామిడి రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పంట రైతు చేతిలో ఉన్నప్పుడు ధర లేకుండా చేసి, పంట అయిపోయిన తర్వాత ధర పెరిగితే రైతుకు ప్రయోజనం ఏమిటి?

వాట‌ర్ మ్యాన్ కాదు.. డ్రాట్ మ్యాన్‌:  
చంద్రబాబు తనను తాను వాటర్ మ్యాన్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఆయ‌న వాటర్ మ్యాన్ కాదు.. చంద్ర‌బాబుని కరువు మ్యాన్.. డ్రాట్ మ్యాన్ అని అందరూ అంటున్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులకు మీ హయాంలో ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి. హార్టీకల్చర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఆయ‌న హార్టికల్చర్‌కు బ్రాండ్ అంబాసిడర్ కాదు. హార్టికల్చర్ ఇంతగా అభివృద్ధి చెందిందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఇన్‌పుట్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ వంటి కార్యక్రమాలతో వైఎస్సార్ రైతులకు అండగా నిలిచారు. ఇప్పుడు కళ్లముందే తోటలు చనిపోతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుంది. జూలై, ఆగస్టులోనే కరువు పరిస్థితులను గుర్తించి ముందస్తు కార్యాచరణ చేపట్టాలి. ఎవరో రాసిన స్క్రిప్ట్‌తో మాట్లాడటం కాదు.. గుండెల్లో బాధ తెలియాలి.. గ్రౌండ్ లెవెల్లో చూడాలి. రైతు పడుతున్న కష్టానికి సమాధానం చెప్పకుండా ఆర్భాటాలు ఎందుకు? పదవులు ఎందుకు?

ప్రతి ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి: 
రాయచోటికి మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వంటి సంస్థలు తీసుకురావాలి. భూములు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? మా ప్రాంతానికి ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పాలి. రైతు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం భారీ ఆర్భాటాలు, సమావేశాలు, హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల మీద దృష్టి పెట్టడం ఎందుకు? రైతు సమస్యలకు పరిష్కారం చూపాలి. ఖరీఫ్ పూర్తిగా దెబ్బతిన్న రైతులకు ప్రతి ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి. సాగు చేసుకునే పరిస్థితి లేని రైతులకు ఎకరాకు రూ.15 వేలకు తగ్గకుండా ఆర్థిక సహాయం చేయాలి. మామిడి, చీనీ, బత్తాయి వంటి శాశ్వత ఉద్యాన పంటలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. కరువు మండలాలను వెంటనే ప్రకటించి పశుగ్రాసం, విత్తనాలు, పంట నష్టపరిహారం అందించాలి. తాను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారనే భ్ర‌మ‌ల్లోనే ఇంకా చంద్ర‌బాబు బ‌తుకుతున్నాడు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని గ్ర‌హించాలి. రాయలసీమలో కరువు తాండవిస్తుంటే రైతుల కన్నీళ్లు తుడవకుండా పాలన సాగిస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. రైతు కోసం, రాయలసీమ కోసం, బీసీల హక్కుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top