రాజమహేంద్రవరం: బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వారిని రాజకీయంగా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తూర్పుగోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 34 శాతం రిజర్వేషన్ల నుంచి బీసీ సంక్షేమ నిధుల వరకు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కోసం పనిచేయాలనే ఆలోచన చేయకుండా, అధికారం తన కోసం, తన కుటుంబం కోసం, తన అనుయాయుల కోసం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి, ఇప్పుడు ఆ అంశాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఏమన్నారంటే.. 34 శాతం రిజర్వేషన్లు నేనే ఇచ్చాననడం అబద్ధం “బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు నేనే ఇచ్చానని చంద్రబాబు నాయుడు చెప్పడం పచ్చి అబద్ధం. రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందో, ఏ ప్రభుత్వ హయాంలో ఏ చర్యలు జరిగాయో బీసీ సమాజానికి తెలుసు. న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో జరిగిన పరిణామాలను తన ఖాతాలో వేసుకుని తానే ఇచ్చానని చెప్పడం బీసీలను తప్పుదోవ పట్టించడమే.” జీవో 105, 1065పై సమాధానం చెప్పాలి “34 శాతం రిజర్వేషన్ల కోసం జీవో నంబర్ 105, 1065 తీసుకొచ్చారు. ఆ జీవోల పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. న్యాయస్థానాల తీర్పుల తర్వాత మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి, మళ్లీ సుప్రీంకోర్టుకే వెళ్తాననడం బీసీలను మోసం చేయడం కాదా?” చంద్రబాబుకు నా సూటి సవాల్ “34 శాతం రిజర్వేషన్ల జీవో తానే ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. ఆ జీవో ఎక్కడ ఉందో ప్రజల ముందు పెట్టాలి. తాను ఇచ్చిన జీవో ఇదేనని నిరూపించాలి. నేను చంద్రబాబు నాయుడిని సూటిగా సవాల్ చేస్తున్నాను. 34 శాతం రిజర్వేషన్లు తానే ఇచ్చానని నిరూపించగలరా? నిరూపించలేకపోతే బీసీ సమాజానికి సమాధానం చెప్పాలి.” 2014లో 100 సీట్ల హామీ ఏమైంది? “2014 ఎన్నికలకు ముందు బీసీలకు 100 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ 100 సీట్లు ఏమయ్యాయి? బీసీలకు 100 సీట్లు ఎక్కడ ఇచ్చారు? ఎన్నికల సమయంలో బీసీలను ఆకట్టుకోవడానికి ఒక మాట చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పక్కన పెట్టడం ఏంటి? బీసీలకు ఇచ్చిన ఈ హామీపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.” బీసీ సంక్షేమ నిధులు ఎక్కడ? “బీసీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. మొదటి బడ్జెట్‌లో ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు? రెండో బడ్జెట్‌లో ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు? మూడో బడ్జెట్‌లో ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు? కేటాయింపులు చూపించి నిధులు ఖర్చు చేయకపోతే అది బీసీలకు మోసం కాదా?” మూడు లక్షల దరఖాస్తుల పరిస్థితి ఏమిటి? “బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం ఇస్తామని హడావుడిగా దరఖాస్తులు తీసుకున్నారు. మూడు లక్షల దరఖాస్తులు ఎండీ కార్యాలయాల్లో కట్టలుగా ఉన్నాయి. ఆ దరఖాస్తుల్లో ఎంతమందికి రుణాలు ఇచ్చారు? ఎంతమందికి ఆర్థిక సహాయం చేశారు? దరఖాస్తులు తీసుకోవడం మాత్రమే చేసి సహాయం చేయకపోతే బీసీలను మోసం చేసినట్టే కదా?” 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు ఎక్కడ? “బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పగా చెబుతున్నారు. కానీ వాటికి కార్యాలయాలు ఉన్నాయా? సిబ్బంది ఉన్నారా? నిధులు ఉన్నాయా? కనీసం కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయా? పేరుకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని పనిచేయకుండా చేయడం వల్ల బీసీలకు ఏం ప్రయోజనం?” బీసీలు ఇక ప్రశ్నించాలి “బీసీలను ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలకు ఇక ముగింపు పలకాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీసీలు గుర్తు చేసుకోవాలి. 100 సీట్ల హామీ నుంచి 34 శాతం రిజర్వేషన్ల వరకు చంద్రబాబు చెప్పిన ప్రతి మాటకు లెక్క అడగాలి. బీసీలు అమాయకులు కాదు. వారికి అన్ని విషయాలు తెలుసు. సోషల్ మీడియా కాలంలో నిజాలను దాచిపెట్టడం ఎవరి వల్లా కాదు.” బీసీల హక్కుల కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం “బీసీలకు అన్యాయం జరిగితే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రజల తరఫున పోరాటం చేస్తాం. బీసీ సమాజం మొత్తం ఒక్కటై చంద్రబాబు ఇచ్చిన హామీలను, చేసిన పనులను లెక్కించాలి. బీసీలను మోసం చేసే రాజకీయాలకు బీసీలే గట్టిగా సమాధానం చెప్పాలి. బీసీల హక్కుల కోసం జరిగే పోరాటంలో ప్రతి బీసీ భాగస్వామి కావాలి.”