రాయలసీమలో లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ కాదు... 

లక్ష అబద్ధాల కూటమి ప్రభుత్వం:

చంద్రబాబుది కేవలం ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ మాత్రమే : 

తేల్చి చెప్పిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. 

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు.

అన్నదాత కన్నీళ్లపై ‘రైజింగ్ రాయలసీమ’ ప్రచార సంబరాలా?...

తీవ్ర కరువులో ఉన్న రైతులను గాలికొదిలిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం

ప్రచార ఆర్బాటాలతో ప్రజలను మభ్యపెడతారా?:

కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన కురసాల కన్నబాబు 

గాల్లో కలిసిపోయిన అమరావతి హైపర్‌లూప్, బుల్లెట్ ట్రైన్, సీ ప్లేన్ హామీలు

అదే తరహాలోనే హార్టికల్చర్ హబ్ కూడా ఓ బూటకం: 

ఎల్లో మీడియాతో కలిసి బాబు మోసపు ప్రచారాలు: 

ధ్వజమెత్తిన మాజీ మంత్రి కన్నబాబు.

రాయలసీమ జిల్లాలన్నీ తీవ్ర దుర్భిక్షంలో కూరుకుపోయి రైతాంగం అల్లాడుతుంటే వారిని ఆదుకునే ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించకుండా సీఎం చంద్రబాబు 'రైజింగ్ రాయలసీమ - లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్' పేరిట సరికొత్త ఈవెంట్ మేనేజ్‌మెంట్ విన్యాసాలు మొదలుపెట్టారని.. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర నిబంధనల ప్రకారం ఆగస్టులోనే చేయాల్సిన కరువు ప్రకటనను అక్టోబర్ వరకు తొక్కిపెట్టి, గతంలో గాల్లో కలిసిపోయిన లాక్‌‌హీడ్, బుల్లెట్ ట్రైన్, హైపర్‌లూప్ లాంటి అబద్ధాల తరహాలోనే ఇప్పుడు మదనపల్లెలో 'రైజింగ్ రాయలసీమ - లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్' పేరిట చంద్రబాబు సరికొత్త ఈవెంట్ మేనేజ్‌మెంట్ విన్యాసాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. కేవలం అనుకూల ఎల్లో మీడియా భుజానెత్తుకునే ప్రచార బలంతో ప్రజలను ఏమార్చుతూ.. బాబు రైజింగ్ సీమ కాదని పాలింగ్ సీమ అని స్పష్టం చేశారు. పాలనను ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో మొత్తం ఉద్యాన శాఖకు కేవలం రూ. 1,123 కోట్లు కేటాయించగా, అందులో ఈ హబ్‌కు పెట్టింది కేవలం రూ. 200 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు.  అసలు భాగస్వామ్య కంపెనీలెవరో, ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయో కనీస స్పష్టత లేకుండా లక్ష కోట్ల ప్రాజెక్టు అంటూ అన్నదాతలను నిలువునా మోసం చేస్తూ... తాగడానికి గంజి నీళ్లు లేని పరిస్థితి ఉంటే, ఎప్పుడో బిర్యానీ పెడతానని పండగలు చేసుకోవడం దుర్మార్గమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... 

మొదలుకాని సినిమాకు విజయోత్సవ సభలు..

చంద్రబాబు నాయుడు మదనపల్లెలో నిర్వహించిన సభను చూస్తే మొదలుకాని సినిమాకే విజయోత్సవ సభ జరిపినట్లుగా ఉంది. తెల్లారితే అబద్ధాలు, అభూత కల్పనలు, కట్టుకథలతో కాలం గడపడం, ప్రచారం తప్ప పని చేయకుండా తనకు తానే డబ్బా కొట్టుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. మదనపల్లెలో ప్రకటించింది లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ కాదు... లక్ష అబద్ధాల ప్రభుత్వం. పంటలు, తోటలు ఎండిపోయి మామిడి, అరటి, బత్తాయి, చీనీ రైతులు అల్లాడుతుంటే వ్యవసాయాన్ని గబ్బు పట్టించి, ఇప్పుడు హబ్‌లంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.

గాల్లో తేలిన పాత కథలే మళ్లీ తెరపైకి..

గతంలో 2014-19 మధ్య చంద్రబాబు చెప్పిన పిట్టల దొర కథలన్నీ ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. అమరావతికి హైపర్‌లూప్, ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ ట్రైన్, విశాఖకు మెట్రో, కృష్ణా నదిపై సీ-ప్లేన్ అంటూ సొంత పత్రికలు, ఛానళ్లలో బ్యానర్ కథనాలు రాయింపజేశారు. 2016 దావోస్ పర్యటనలో లాక్‌హీడ్ రక్షణ ప్లాంట్ వస్తోందని చెప్పారు. 2017లో హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, హైబ్రిడ్ క్లౌడ్, సౌదీ అరాంకో, కర్నూలులో అయోవా వర్సిటీ, ఎయిర్‌బస్, అలీబాబా డేటా సెంటర్ అని ఊదరగొట్టారు. ఇప్పుడు ఆ అలీబాబా కథల మాదిరిగానే ఈ లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ కూడా ప్రజలను మోసం చేయడానికే తీసుకొచ్చారు.

లక్ష కోట్ల హబ్‌కు బడ్జెట్‌లో పెట్టింది రూ. 200 కోట్లా?

హార్టికల్చర్ హబ్ కథేంటో చూద్దామని 2026-27 బడ్జెట్ తీసి పరిశీలిస్తే... మొత్తం ఉద్యాన శాఖకు కేటాయించింది కేవలం రూ. 1,123 కోట్లు. అందులో ఈ హబ్‌కు పెట్టింది కేవలం రూ. 200 కోట్లు మాత్రమే. ప్రాజెక్టులో 40 శాతం ప్రభుత్వం పెడుతుందని, రూ. 60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని ఊదరగొడుతున్నారు. అసలు ఆ ప్రైవేట్ పార్ట్‌నర్లు ఎవరో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? వరల్డ్ బ్యాంక్ నుంచి రూ. 20 వేల కోట్లు తెస్తామంటే కేంద్ర ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) నిబంధనలు అంగీకరిస్తాయా? లేక కేంద్రం ఏమైనా గ్రాంట్లు ఇస్తుందా? వివరాలు లేకుండా కేవలం ఈవెంట్లు చేసి చంద్రబాబు తనకు తాను భుజకీర్తులు తగిలించుకుంటున్నారు.

ఇది రైజింగ్ సీమ కాదు... బాబు తెచ్చిన ఫాలింగ్ సీమ..

రాయలసీమలో రైతులు పొలాలను కన్నీళ్లతో తడుపుతుంటే చంద్రబాబు ‘రైజింగ్ రాయలసీమ’ అని పేరెట్టారు. ఇది రైజింగ్ సీమ కాదు, కూటమి పాలనలో ‘ఫాలింగ్ సీమ’. ప్రభుత్వం ప్రకటించిన 388 కరువు మండలాల్లో 186 మండలాలు రాయలసీమలోనే ఉన్నాయి. తీవ్ర కరువు మండలాలు 283 ఉంటే, అందులో 159 ఒక్క రాయలసీమలోనే ఉన్నాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అన్నమయ్య జిల్లాలో 63.1 శాతం, సత్యసాయి జిల్లాలో 56.6 శాతం, చిత్తూరులో 47.3 శాతం, వైఎస్సార్ కడపలో 46 శాతం, కర్నూలులో 42 శాతం, నంద్యాలలో 42.2 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆగస్టు నాటికి రాయలసీమలో 7 లక్షల బోర్లు వట్టిపోయాయి. అన్నమయ్య జిల్లాలో 800 అడుగులు లోతు వేసినా నీరు పడటం లేదు. చిత్తూరులో వేల ఎకరాల మామిడి తోటలు ఎండిపోయాయి. చీనీ, బత్తాయి తోటలను బతికించుకోవడానికి రైతులు ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నారు. తాగడానికి గంజి నీళ్లు లేకపోతే ఎప్పుడో బిర్యానీ పెడతానని పండగలు చేసుకోవడం దుర్మార్గం.

ప్రకృతి వైపరీత్యానికి బాబు పూజల ప్రచారమా?

నిన్న పెన్షన్ల పంపిణీకి వెళ్లి ‘నేను దేవుణ్ణి మొక్కుకున్నాను కాబట్టే 24 గంటల్లో 27 సెంటీమీటర్ల వర్షం పడింది’ అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. మీ ప్రార్థనలకే వర్షాలు పడితే గత నాలుగు నెలల దుర్భిక్షంలో రాష్ట్రాన్ని ఎందుకు వదిలేశారు? రోజూ ఒక సెంటీమీటర్ వర్షం కురిపించమని ఎందుకు కోరలేదు? బంగాళాఖాతంలో సైక్లోన్ రావడం వల్ల వర్షాలు కురిశాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే, తన పూజల వల్లే పడ్డాయని ప్రచారం చేసుకోవడం ప్రజలను మభ్యపెట్టడమే. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక బాబును ‘వాటర్ మ్యాన్’ అని రాసిందట... ఆ పెద్దలంతా రాయలసీమకొచ్చి రైతుల కన్నీళ్లు చూసి బాబుకు ఏ బిరుదు ఇవ్వాలో నిర్ణయించాలి.

ఆగస్టులో ప్రకటించాల్సిన కరువును అక్టోబర్ వరకు ఎందుకు తొక్కిపెట్టారు?

కేంద్ర ప్రభుత్వ 'మాన్యువల్ ఫర్ డ్రాట్ మేనేజ్‌మెంట్' నిబంధనల ప్రకారం ఆగస్టు నెలలోనే కరువు డిక్లరేషన్ చేయవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కరువు తీవ్రతను కప్పిపుచ్చేందుకు అక్టోబర్ వరకు కాలయాపన చేసింది. జూన్ నుంచే వర్షపాత లోటు ఉన్నా సెప్టెంబర్ వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించలేదు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. 388 మండలాల్లోనే కాకుండా ఇంకా అనేక మండలాల్లో తీవ్ర కరువు ఉంది. తుఫాను వర్షాలను సాకుగా చూపి తప్పించిన బాధిత మండలాలను మళ్లీ రీ-ఎస్టిమేట్ చేసి తక్షణమే కరువు జాబితాలో చేర్చాలి. రైతు రుణాలను రీషెడ్యూల్ చేసి, ఎకరాకు నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి.

రైతులకు దక్కని గిట్టుబాటు ధర – ఉచిత పంటల బీమాకు ఎగనామం.

కూటమి పాలనలో ఉల్లి ధర పతనమై రైతులు చేలు దున్నేశారు. టమాటాలు కోత కూలీలు రాక రోడ్లపాలు చేశారు. చిత్తూరులో తోతాపూరి మామిడి కేజీ రూ. 2 నుంచి రూ. 3కి తెగనమ్ముకున్నారు. అరటి టన్ను జగన్ గారి హయాంలో రూ. 14,000 నుంచి రూ. 20,000 పలికితే, నిరుడు నవంబర్‌లో రూ. 1,000కి పడిపోయింది. గతంలో వైఎస్ జగన్ ఒక్క రూపాయి భారం లేకుండా ప్రతి రైతుకూ ఉచిత పంటల బీమా అమలు చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం రైతులతో ప్రీమియం కట్టించడమే కాక, ప్రభుత్వం తన వాటా ప్రీమియం కట్టకుండా వేలాది మంది రైతులకు పరిహారం అందకుండా చేసింది.

జగన్ మంచి చేస్తే బురద... బాబు ఈవెంట్లు చేస్తే భుజకీర్తులా?

వైయస్. జగన్ మోహన్ రెడ్డి ఎంత మంచి చేసినా దాంట్లో రంధ్రాలు వెతకడమే ఎల్లో మీడియా పని అని కన్నబాబు మండిపడ్డారు. నాడు కరోనా కష్టకాలంలో కూడా మార్కెట్లన్నీ మూతపడినా రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశామన్న ఆయన... అనంతపురం, కడప రైతుల కోసం ప్రత్యేక కిసాన్ రైళ్లు వేసి అరటిని ఢిల్లీకి తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులను 90 నుంచి 100 శాతం సబ్సిడీతో అందించి రాయలసీమను సస్యశ్యామలం చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారేనని.. కానీ  ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్‌లు పూర్తిగా మూతపడ్డాయని ఆక్షేపించారు. మరోవైపు చంద్రబాబు రోడ్డు డాక్టర్ అంటున్నారని... రోడ్లకు కాదు, ముందు ఈ దుర్భిక్షాన్ని నివారించడానికి ‘కరువు డాక్టర్’ని తీసుకురావాలని, పాలనను ఈవెంట్‌గా మార్చడం ఆపి, తక్షణమే రాయలసీమ కరువు రైతులను ఆదుకునే కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Back to Top