స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి

నామినేషన్లకు ముందే అభ్యర్థులు, ప్రత్యామ్నాయ అభ్యర్థులను గుర్తించాలి

కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పుడే సిద్ధం చేసుకోవాలి

జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వార్‌రూమ్‌లు.. గ్రామస్థాయి వరకు లీగల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలి

ప్రతి ఉల్లంఘనను వీడియో, డాక్యుమెంటరీ ఆధారాలతో రికార్డు చేయాలి

వైఎస్సార్‌సీపీ నేతల టెలికాన్ఫరెన్స్‌లో స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూర్తి అప్రమత్తతతో, ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, “వచ్చాక చూద్దాం” అనే ధోరణికి అవకాశం లేదని, ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక నుంచి న్యాయపరమైన ఏర్పాట్ల వరకు ప్రతి అంశాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు–కోఆర్డినేషన్, రాష్ట్ర కార్యదర్శులు–కోఆర్డినేషన్, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  
  
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అతి తక్కువ వ్యవధిలో ప్రకటించే అవకాశం ఉందని వస్తున్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ యంత్రాంగం ముందుగానే సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ముందే ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని, కొత్త ఓటర్ల జాబితా అమలులోకి రాకుండా పాత జాబితాలతో ఎన్నికలకు వెళ్లే అంశాన్ని న్యాయపరంగా కూడా పరిశీలించాలని చెప్పారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు వరుసగా వచ్చే అవకాశం ఉందని, అందువల్ల వచ్చే నెలరోజుల పాటు పార్టీ నాయకత్వం పూర్తిగా ఎన్నికల ప్రక్రియపైనే దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

అభ్యర్థుల ఎంపికలో ప్రత్యామ్నాయాలు కూడా సిద్ధంగా ఉండాలి

రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే నామినేషన్లకు చాలా తక్కువ సమయం ఉండే అవకాశం ఉన్నందున ప్రతి వార్డు, డివిజన్, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి ముందుగానే బలమైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయాలని సజ్జల సూచించారు. ఒక్క అభ్యర్థిపైనే ఆధారపడకుండా, ప్రతి స్థానానికి ఇద్దరు, ముగ్గురు లేదా అవసరమైతే మరికొందరు ఆశావహులను గుర్తించి వారి పత్రాలను కూడా సిద్ధంగా ఉంచాలని అన్నారు. చివరి నిమిషంలో సర్టిఫికెట్లు రాకపోవడం లేదా ఇతర సాంకేతిక సమస్యల వల్ల పార్టీ పోటీ చేయలేని పరిస్థితి ఎక్కడా రాకూడదని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో వ్యక్తిగత గ్రూపులు, వర్గాలు, అభిప్రాయభేదాలను పక్కనపెట్టి గెలిచే సామర్థ్యం, ప్రజల్లో బలం ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బలమైన నాయకులను పక్కనపెట్టి వ్యక్తిగత అనుకూలతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయవద్దని, అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పారు.

కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లపై అత్యంత అప్రమత్తత

ఎన్నికల ప్రక్రియలో మొదటి అడ్డంకి కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్ల విషయంలో వచ్చే అవకాశం ఉందని సజ్జల హెచ్చరించారు. సర్వర్లు పనిచేయడం లేదని, అధికారులు అందుబాటులో లేరని, ప్రాసెస్ జరుగుతోందని చెప్పి రెండు మూడు రోజుల ఆలస్యం చేసినా నామినేషన్ గడువు ముగిసిపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల పోటీ చేసే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరితో కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు తదితర అవసరమైన పత్రాలకు వెంటనే దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగితే దరఖాస్తు చేసిన తేదీ, రసీదులు, అధికారుల స్పందన తదితర ఆధారాలను వెంటనే జిల్లా పార్టీ కార్యాలయానికి, కేంద్ర కార్యాలయానికి పంపించాలని చెప్పారు. అవసరమైతే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని లేదా హైకోర్టును ఆశ్రయించేలా లీగల్ టీమ్ సిద్ధంగా ఉండాలని సూచించారు.

ప్రతి గ్రామానికీ లీగల్ సపోర్ట్ ఉండాలి

ఇటీవల జరిగిన లీగల్ సెల్ సమావేశంలో నిర్ణయించిన విధంగా, గ్రామస్థాయి వరకు న్యాయ సహాయ వ్యవస్థను మ్యాపింగ్ చేయాలని సజ్జల చెప్పారు. రెండు మూడు పంచాయతీలకు ఒక న్యాయవాదిని నియమించడం, మండల–నియోజకవర్గ స్థాయిలో వారి ఫోన్ నంబర్లు, బాధ్యతలను నమోదు చేయడం, ఆ సమాచారం గ్రామ పార్టీ అధ్యక్షుడు నుంచి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త, కేంద్ర కార్యాలయం వరకు అందుబాటులో ఉండేలా కంప్యూటరైజ్ చేయాలని సూచించారు. ఏ గ్రామం కూడా లీగల్ కనెక్టివిటీ లేకుండా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. నామినేషన్ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు ఎక్కడ చిన్న సమస్య వచ్చినా వెంటనే సంబంధిత న్యాయవాది అందుబాటులో ఉండే వ్యవస్థ ఏర్పాటుచేయాలని చెప్పారు.

జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వార్‌రూమ్‌లు

ప్రతి జిల్లా పార్టీ కార్యాలయం, నియోజకవర్గ కార్యాలయంలో ప్రత్యేక ఎన్నికల సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సజ్జల సూచించారు. లీగల్, మీడియా, డిజిటల్, ఎన్నికల సమన్వయం, అధికారులతో సంప్రదింపులు వంటి బాధ్యతలకు ప్రత్యేక వ్యక్తులను నియమించాలని చెప్పారు. నాయకుడు అందుబాటులో లేకపోయినా వ్యవస్థ పనిచేసేలా ఇద్దరు, ముగ్గురు బాధ్యులతో శాశ్వత కనెక్టివిటీ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేస్తామని, అక్కడి నుంచి అవసరమైన సమస్యలను సంబంధిత లీగల్ టీమ్, సీనియర్ నాయకులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, కోర్టుల దృష్టికి వెంటనే తీసుకెళ్లే వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు.

సెన్సిటివ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి

గత ఎన్నికల్లో సమస్యలు జరిగిన ప్రాంతాలు, వివాదాస్పద అధికారులు పనిచేస్తున్న ప్రాంతాలు, నామినేషన్ల సమయంలో ఆటంకాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. అలాంటి ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాలను ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని అవసరమైతే కలెక్టర్, రిటర్నింగ్ అధికారులకు ముందుగానే వినతులు ఇవ్వాలని చెప్పారు. ఆ ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సమర్పిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు తరలించే ప్రదేశాలు, స్ట్రాంగ్ రూమ్‌ల విషయంలో కూడా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ముందుగానే తెలియజేయాలని సూచించారు.

ప్రతి ఘటనకు వీడియో ఆధారం ఉండాలి

ఎన్నికల సందర్భంగా జరిగే ప్రతి నిబంధనల ఉల్లంఘన, అధికారుల నిరాకరణ, పోలీసుల జోక్యం లేదా ఇతర వివాదాస్పద ఘటనలను వీడియో రూపంలో రికార్డు చేయాలని సజ్జల సూచించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో నాలుగైదుగురు సభ్యులతో ప్రత్యేక మీడియా/డిజిటల్ టీమ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పెద్ద కెమెరాలు అవసరం లేదని, మొబైల్ ఫోన్‌తోనే ఘటనను రికార్డు చేసి వెంటనే సంబంధిత గ్రూపులకు, జిల్లా కార్యాలయానికి, కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ వీడియోలు సోషల్ మీడియా, ప్రధాన మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడానికి, అవసరమైతే కోర్టుల్లో ఆధారాలుగా ఉపయోగపడతాయని చెప్పారు.

అభ్యర్థులపై పోలీసు వేధింపులను రికార్డు చేయాలి

పోటీ చేసే అవకాశం ఉన్న నాయకులను బైండ్ ఓవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం వస్తోందని సజ్జల పేర్కొన్నారు. అలాంటి ప్రతి ఘటనను జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైతే వీడియో ఆధారాలు కూడా సేకరించాలని చెప్పారు. ఎన్నికలకు ముందే అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని చట్టబద్ధంగా, రాజకీయంగా, మీడియా ద్వారా ఎదుర్కోవాలని సూచించారు.

రిజర్వేషన్ల రోస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి

మున్సిపాలిటీలు, వార్డులు, డివిజన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలకు ప్రకటించే రిజర్వేషన్లను పాత రోస్టర్ ప్రకారం సక్రమంగా అమలు చేశారా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని సజ్జల సూచించారు. ప్రతి జిల్లా కార్యాలయంలో ఎన్నికల అనుభవం ఉన్న రిటైర్డ్ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు లేదా నిపుణుల సహాయం తీసుకుని రిజర్వేషన్లను పరిశీలించాలని చెప్పారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ఉందని భావిస్తే వెంటనే లీగల్ సెల్, కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపాలని, అవసరమైతే న్యాయపరంగా సవాలు చేయాలని సూచించారు.

మూడు మార్గాల్లో సమాంతర పోరాటం

ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను మూడు స్థాయిల్లో ఎదుర్కోవాలని సజ్జల వివరించారు. 
ఒకటి – రాజకీయంగా పార్టీ శక్తితో ఎదుర్కోవడం,
రెండు – ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారిక ఫిర్యాదులు ఇవ్వడం,
మూడు – అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపరంగా పోరాడడం.
వీటన్నింటితో పాటు ప్రతి అంశానికి డాక్యుమెంటరీ, వీడియో ఆధారాలు సిద్దం చేయడం అత్యంత కీలకమని చెప్పారు.

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్పందించడానికి సమయం ఉండదని, అందువల్ల దానికి తగ్గట్టుగా ఆర్గనైజ్డ్, కోఆర్డినేటెడ్, సిస్టమాటిక్ వ్యవస్థను ఇప్పుడే ఏర్పాటు చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు సూచించారు.

Back to Top