అనంతపురం: ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుపడేలా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికను నిర్వహించారని మాజీ మంత్రి, సింగమల నియోజకవర్గ సమన్వయకర్త సాకె శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. పోలీసులే టీడీపీ గూండాలతో దొంగ ఓట్లు వేయించడం ద్వారా చట్టవిరుద్దంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలను రద్దు చేసి, నిస్పక్షపాతంగా, పారదర్శకంగా మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... టీడీపీ గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేశారు: నా రాజకీయ జీవితంలో ఎన్నికలు ఇంత అనైతికంగా ఎప్పుడూ జరగడం చూడలేదు. అసలు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు. వైయస్ఆర్‌సీపీ గెలుపును అడ్డుకోవడానికి సీఎం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. వాడని వ్యవస్థ లేదు. చేయని తప్పు లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దిగజారి వ్యవహరించారు. పోలింగ్ బూత్‌లను ఒక ఊరి నుంచి మరో ఊరికి మార్చడం, మా పార్టీకి చెందిన బూత్ ఏజెంట్లను బూత్‌ల నుంచి తరిమేసి బూత్ క్యాప్చరింగ్‌లకు పాల్పడటం, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను బైండోవర్ చేయడం, నాయకులను హౌస్ అరెస్టులు చేయడం, పోలింగ్ బూత్ ల వద్దకు మా ఓటర్లు రాకుండా కర్రలతో కొడతామని బెదిరించి అడ్డుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను పిలిపించుకుని తీసుకొచ్చి అడ్డగోలుగా వ్యవహరించారు. ఓటర్లు ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ గూండాలు అడ్డుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది మొదలు మారణాయుధాలతో టీడీపీ నాయకులు అరాచక శక్తులుగా మారి పల్లెల మీద పడి రౌడీయిజం చేస్తున్నారు. వారి రౌడీయిజంపై ఎన్నికల కమిషన్‌కి ఎన్నోసార్లు మా నాయకులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కళ్లుండీ చూడలేదు. చెవులుండీ వినలేదన్నట్టు వ్యవహరించింది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు అణచివేస్తుంటే కాపాడాల్సిన పోలీసులు, ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ కూర్చుంది. కూటమి పాలనతో ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సన్నగిల్లుతోంది. ఎప్పుడూ లేనిది రాష్ట్ర ప్రజలు భయాందోళనతో బతుకుతున్నారు. పోలీసులే రౌడీలకు వంతపాడుతున్నారు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం ప్రజాస్వామ్యాన్ని గెలిపించేలా ఓటింగ్ శాతం పెరిగేలా చూడకుండా అసాంఘిక శక్తులకు వంతపాడేలా వ్యవహరించడం దురదృష్టకరం. చంద్రబాబు తీసుకొస్తున్న ఈ విష సాంప్రదాయం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్ధితులకు దారితీస్తుందో వారే ఆలోచించుకోవాలి. పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఉప ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ, డీజీపీ, ఎన్నికల కమిషన్, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రెండు స్థానాల్లో ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్లీ నిర్వహించాలి. చనిపోయిన సభ్యులతో వచ్చిన ఎన్నిక. ఏడాది పదవీ కాలం కూడా లేదు. ఈ రెండు జెడ్పీటీసీలతో ప్రభుత్వాలు తలకిందులయ్యే పరిస్థితి లేదు. కానీ ఎప్పుడో అంతరించిపోయిన ఫ్యాక్షన్ వాతావరణానికి చంద్రబాబు తిరిగి ప్రాణం పోస్తున్నాడు. తన సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చని పల్లెల్లో రక్తం పారించాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇది రాష్ట్ర యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందన్న విషయం అందరూ గ్రహించాలి. కూటమి నాయకులు చట్టాన్నిఅపహాస్యం చేస్తున్నారు. ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రెచ్చిపోవచ్చు. కానీ ఎల్లకాలం ఇదే విధానాలే నడుస్తాయని అనుకోవడం అవివేకమే అవుతుంది.