తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో కుట్రపూరితంగా తన పేరును చేర్చారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేయగా.. ఇవాళ అది విచారణకు రానుంది.
జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతిచెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
పిటిషన్‌లో ఏముందంటే..
- మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్‌ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు.
- మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు.
- ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్‌పై విడుదల చేశారు.
- కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు.
- నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు.
- ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది.
- పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి
- మరోవైపు ఇదే వ్యవహారంపై తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్లు వేశారు. మరోవైపు.. మాజీ మంత్రులు పేర్ని నాని , విడదల రజిని హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు అన్నీ ఇవాళే విచారణకు రానున్నాయి.