ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ఎల్.వి. ఫంక్షన్ హాల్‌లో శ్రీశైలం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆత్మకూరు పట్టణం, మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ భవిష్యత్ కార్యాచరణ, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వామ్యం చేయడంపై శిల్పా చక్రపాణిరెడ్డి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుపై శిల్పా చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కమిటీ సభ్యులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రత్యర్థుల ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారులు చట్టపరమైన పరిధిని దాటి వ్యవహరిస్తే న్యాయపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు. సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.