హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని, నియంత పాలన ఆపేసి రాజ్యాంగ బద్దంగా పని చేయాలని మాజీ మంత్రి సాకె శైలజానాథ స్పష్టం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సాకె శైలజానాథ్ చురకలంటించారు. సాకె శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: సుప్రీం తీర్పు టీడీపీ కూటమికి చెంపదెబ్బ: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వం ముఖం మీద సుత్తితో కొట్టినట్టుగా ఉంది. రెడ్ బుక్ పేరుతో కక్ష సాధింపులకు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టులాంటిది. చంద్రబాబు గడిచిన ఏడాది పాలనంతా చూస్తే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన రోజులే గుర్తుకొస్తున్నాయి. వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ మీద చెప్పులు, రాళ్లు విసిరిన చంద్రబాబే గుర్తొస్తున్నాడు. ఆరోజుల్లో అసెంబ్లీలో నోరెత్తనీయకుండా ఎన్టీఆర్‌ని మెడ పట్టి గెంటినంత పని చేశారు. ఇప్పుడు కూడా దాదాపు ఏడాది కాలంగా రాష్ట్రంలో అదే నియంత పాలన సాగుతోంది. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ రాజ్యాంగ విరుద్ధంగా నియంత పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం సుప్రీం తీర్పుతోనైనా బుద్ధితెచ్చుకుంటే మంచిది. కొమ్మినేని అరెస్ట్ విషయంలో కనీసం తెలంగాణ పోలీసులను కూడా సంప్రదించలేదని సమాచారం. అందుకే అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఒక నిమిషం ఆలోచించి తమ విధులను, చట్టాలను గుర్తుకు తెచ్చుకోవాలి. భయంతోనే చంద్రబాబు..: 70 ఏళ్ల వయసుపైబడి ఉన్న వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సబబేనా? అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అరెస్టుకు ముందు తన భార్యతో మాట్లాడటానికి కూడా కొమ్మినేనిని పోలీసులు అనుమతించలేదు. ఆయనతో మాట్లాడటానికి లాయర్లను కూడా వెళ్లనీయలేదు. కొమ్మినేని మీద వ్యక్తిగత కక్షతోనే ఇదంతా చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలు, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షిలో కొమ్మినేనిగారు నిజాలు మాట్లాడిస్తుంటే చంద్రబాబు భయపడిపోతున్నాడు. అందుకే ఆయనపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయించారు. అధికారం చేతిలో ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందనే భ్రమల్లో నుంచి ఇకనైనా బయటకు రావాలి. అంతిమంగా న్యాయమే విజయం సాధిస్తుందని, నిజమే గెలుస్తుందని చెప్పడానికి కొమ్మినేని కేసు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రంలో నవ్వకూడదనే ఆంక్షలున్నాయా?: కొమ్మినేని అరెస్ట్ అంశాన్ని కూడా చంద్రబాబు అత్యంత జుగుప్సాకంగా మాట్లాడి హేళన చేశాడు. డిబేట్‌కు వచ్చిన గెస్ట్ మాట్లాడిన విషయాలను హోస్ట్‌కి ఆపాదించడం ఎంతవరకు సమంజసం? పైగా నవ్వాడనే కారణంతో 70 ఏళ్ల వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా సమర్థించడం లేదు. ‘కేసు విచారణ సందర్భంగా తమకు కూడా నవ్వొస్తుందని.. అలా అని తమపైనా కేసు పెడతారా’? అని సుప్రీంకోర్డు న్యాయమూర్తులు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో నవ్వడంపై కూడా నిషేధం ఉందేమో చంద్రబాబు చెప్పాలి. సాక్షిపై దాడులు అత్యంత హేయం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని సాక్షి మీడియా వెలుగులోకి తెస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయడం కోసం జర్నలిస్ట్ కృష్టంరాజు వ్యాఖ్యలను సాకుగా చూపించాడు. రాజధాని మహిళల ముసుగులో పార్టీ మహిళలు, టీడీపీ నాయకులను సాక్షి కార్యాలయాల మీదకు పంపించి ధ్వంసానికి తెగబడ్డాడు. మహిళలను అడ్డం పెట్టుకుని క్షుద్ర రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలి. సాక్షి మీడియా గొంతు నొక్కడమే చంద్రబాబు లక్ష్యం. అందుకే రాష్ట్రంలో సాక్షి ప్రసారాలను రాకుండా అడ్డుకుంటున్నాడు. పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు: వైయస్సార్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి వచ్చిన స్పందన చూస్తే చంద్రబాబుకి మతి భ్రమించింది. దాన్ని డైవర్ట్ చేసేందుకు కొమ్మినేని మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి వేధించాడు. పైగా ఆయన మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే దాన్ని కూడా కోర్టు ఆక్షేపించింది. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు చేస్తున్న దారుణాలను కోర్టులు వరుసగా హెచ్చరిస్తున్నా ఇప్పటికీ కనువిప్పు కలగడం లేదు. వైయస్సార్సీపీ హయాంలో గొప్పగా పనిచేసి దేశంలోనే మంచిపేరు తెచ్చుకున్న పోలీస్ వ్యవస్థను, తన ఏడాది పాలనతోనే చంద్రబాబు భ్రష్టు పట్టించాడు. చంద్రబాబుకే నాలుక మందం: సూపర్ సిక్స్ అమలు చేశానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. పైగా సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వారికి నాలుక మందం అంటున్నాడు. నిట్టనిలువుగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకే నాలుక మందం. అబద్ధాలు, మోసాలతోనే ఏడాది పాలన పూర్తయింది. చంద్రబాబుకి అమరావతి తప్ప వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ కనిపించడం లేదు. అమరావతి గురించి ఎవరైనా వాస్తవాలు మాట్లాడుతుంటే చంద్రబాబుకి మొహం కోపంతో ఎర్రబడిపోతోంది. వేసవిలో కృష్ణా నదిలో నీళ్లు ఎండిపోయినా అమరావతి గుంతల్లో నీళ్లు తోడుతున్నారని ఉత్తరాంధ్ర, రాయలసీమలో జోకులేస్తున్నారు. కూటమి ఏడాది పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి.