అమరావతి: అడ్డంగా దొరికిన దోపిడీ దొంగల ముఠాకు ఎల్లో సపోర్ట్ చేస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎల్లో మీడియాకు వాస్తవాలతో సంబంధం లేదని, జనం నమ్మక చస్తారా అనేదే ఎల్లో మీడియా ఆలోచన అంటూ దుయ్యబట్టారు. వీరంతా తోడు దొంగలే.. ఇంతకంటే పెద్ద పదం లేదు. లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం దోచుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ. ముఠా నాయకుడు చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. స్కాం దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం లేదు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ 20 రోజుల్లో లోకేశ్ ముఠా నానా యాగీ చేసింది. ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైందని సజ్జల పేర్కొన్నారు. సాక్ష్యాధారాలతో దొరికితే కోర్టు రిమాండ్‌కు పంపింది. జరిగిన స్కామ్‌పై వీరంతా మాట్లాడటం లేదు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు. మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అడ్డంగా దొరికినా..: అవినీతితో అడ్డంగా, నిలువుగా దొరికిన దోపిడి దొంగలు.. రాష్ట్రంలో, దేశ రాజధానిలో ఏదో జరిగిపోతోందని అందరూ అనుకోవాలన్న ఉద్దేశంతో గత 20 రోజులుగా.. ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దోపిడి దొంగలు ఏం కూసినా.. ఏం వాగినా.. వాటన్నింటినీ రాతల్లో చూపిస్తూ, టీవీల్లో వినిపించేందుకు వారి అనుకూల మీడియా శక్తివంచన లేకుండా పని చేస్తోంది. వారికి నిజాలతో సంబంధం లేదు. పూర్తిగా అవాస్తవాలు, అబద్దాలైనా సరే నోళ్లన్నీ పెద్దవి చేసుకుని అరుస్తుంటే అవి ఆ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. జనం నమ్మక చస్తారా అనేదే ఆ పచ్చ మీడియా నమ్మకం. ఈ దొంగలందరూ కలిస్తే దానిపేరు తోడు దొంగల పార్టీ అని నామకరణం కూడా చేయవచ్చు. లక్ష మంది గోబెల్స్ కలిస్తే..: ఎదురుగా ఉండగానే నిలబెట్టి బట్టలన్నీ నిలువుదోపిడీ చేసే పిండారీలు వాళ్లు. అలా చేసి కూడా సమర్ధించుకోగలిగిన సత్తా, సామర్ధ్యం ఉన్న గోబెల్స్. ఈ కొత్త గోబెల్స్‌ని చూస్తే ఈయన కాళ్ల కింద దూరి సాష్టాంగ నమస్కారం చేస్తాడేమో..? లక్ష గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబునాయుడు అవుతాడు. అలాంటి చంద్రబాబుతో రామోజీ, రాధాకృష్ణ వంటి వారు కలిస్తే లక్ష మందికి «థీటెన గోబెల్స్ ముఠా అవుతుంది. అదే పనిగా అవాస్తవాల ప్రచారం: ఆరోజు గోబెల్స్ నాజీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లడంలో ఉపయోగపడితే.. వీళ్లు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించే వద్ద నుంచీ అన్నీ అవాస్తవాలు ప్రచారం చేశారు. తాము చేసేది ప్రజాస్వామ్యానికి, దేశానికి అవసరం అని సమర్ధించుకునే వద్ద నుంచి చంద్రబాబు చారిత్రిక అవసరం అని చెప్పడంలో వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉంటే ఆ ఐదేళ్లు అధికారాన్ని అడ్డు పెట్టుకుని కింది వరకూ అడ్డంగా దోచుకునే వరకు వాళ్లది అందెవేసిన చేయి. చంద్రబాబు ఏది చేసిన అది బ్రహ్మాండం, అత్యవసరం, ప్రజలకు అవసరమైనదని ఆ మీడియా ప్రజలకు చెబుతుంది. ఇదంతా ఈ 20 రోజుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు జైళ్లోకి వెళ్లిన వద్ద నుంచి వారి అబద్దాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. దేశానికి అరిష్టం అన్నట్లుగా..: చంద్రబాబును అరెస్ట్ చేయడం దేశానికే ఒక అరిష్టం అన్నట్లుంది వారి తీరు. జరిగిందేంటి?. రిమాండ్‌కు ఎవరు పంపారనేది? కూడా అవసరం లేకుండా విడుదల చేయండంటూ, అక్రమ కేసులంటూ రాష్ట్రపతి వరకూ వెళుతున్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఎలా సంపాదించుకుంటారో కూడా తెలియదు. న్యాయవ్యవస్థ కూడా రాజ్యాంగ వ్యవస్థల్లో అతి ముఖ్యమైంది. అది రాష్ట్రపతి కిందనే పని చేస్తుంది. అలాంటి న్యాయవ్యవస్థ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆమె వద్దకు వెళ్లి అక్రమం అని చెప్పగల సత్తా ఉన్నవాళ్లు. ఇందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది ఏమీలేదు. కేవలం విచారణ చేసి వివరాలను కోర్టు ముందు పెట్టింది. కోర్టు ముందు పెట్టిన తర్వాత అది కోర్టు పరిధి. వాదిస్తే కోర్టు ముందు వాదించుకోవాలి. ప్రజా కోర్టులో నువ్వేదన్నా చెప్పుకోవాలనుకుంటే రాజకీయ పద్దతి ఉంటుంది. ఆయనకు దోమలు కుట్టడం నుంచి ఉక్కపెడుతోందని..ఇలా ఎన్నెన్నో చెప్పుకొచ్చారు. ఇవన్నీ భారతదేశ ప్రజాస్వామ్యానికే ఒక చేటు అన్నట్లు, అసలు స్వాతంత్య్రం ఉందా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. బాబును అరెస్ట్ చేయడం దేశానికే ఒక అరిష్టం పట్టిందన్నట్లు మాట్లాడుతున్నారు. సింపతీ కోసం ప్రయత్నం: ఏదన్నా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తే ఒక అర్ధం ఉంటుంది. ఇక్కడ ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ అయిందని పక్కా ఆధారాలతో అరెస్టు చేసిన అంశం. దీనికి మీరు ఎగిరితే.. అరిస్తే ఎలా? కోర్టు కూడా దానిలో ప్రాథమిక ఆధారాలున్నాయి అని భావించిన తర్వాత మీరు ఎక్కడ ఫైట్ చేయాలి? అసలు ఆ నిరసన ప్రదర్శనలు ఏంటి? మోకాళ్లపై కూర్చోవడాలు, పాకడాలు ఏంటి? ఐటీ వాళ్లు రావాలని ప్రయత్నం చేయడం ఏంటి..? స్కాం అనేది పక్కకు పోయి టీడీపీని వేధిస్తున్నారని జనం నమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లు చేసిన దోపిడీ గురించి జనం తలకు ఎక్కకూడదు. వీలైతే దీని నుంచి సింపతీ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు దొంగతనం చేసిన వాడు సింపతీ అడగడం ఏంటనేది ప్రజలు ఆలోచించాలి. రేపు మర్డర్ చేసిన వాడు కూడా ఇలానే మాట్లాడతాడు. దీనికి మేధావులు అనుకునే వారితో కూడా స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు. అతనెవరో సీబీఐ మాజీ డైరెక్టర్ కూడా మాట్లాడుతున్నాడు. సీబీఐ కూడా ఇలా కాకుండా వేరే రకంగా విచారణ సాగిస్తుందా? సీబీఐ ఇంతవరకు పెట్టిన కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లో లేని పేర్లు తర్వాత చేర్చలేదా? స్ట్రీట్ లెవెల్స్ రాజకీయ నాయకులు మాట్లాడినట్లు బ్యూరోకాట్స్‌గా పని చేసిన వారు కూడా మాట్లాడుతున్నారు. మొన్నెవరో మణిపూర్ మహిళతో కూడా స్టేట్‌మెంట్ ఇప్పించగలిగారు. రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లి కూడా ఇవ్వగల సమర్ధులు. ప్రతి కేసులో వారి పాత్ర సుస్పష్టం: అసలు విషయం స్కాం. ఇప్పటికే నాలుగు స్కాంలు చర్చలో ఉన్నాయి. ఏ స్కాంలోనైనా నేరుగా వారి పాత్ర ఉన్న కేసులే. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు గురించి మేం స్పష్టంగా చెప్పాం. అయినా సరే వాళ్లు అరుస్తూనే ఉంటారు. నిన్నా మొన్న నెల్లూరు వెళ్లి ల్యాప్‌ట్యాప్‌లు పట్టుకున్నారు. ఎన్ని ల్యాప్‌ట్యాప్‌లు కలిస్తే రూ.3 వేల కోట్లు అవుతాయి..? ఆ వచ్చిన సామాగ్రికి ఇన్వాయిస్‌లు లేవు. సీమెన్స్ మాకు డబ్బు రాలేదు అంటోంది. జీవోలో రూ.3,300 కోట్లు ఉంటుంది. ఒప్పందంలో రూ.371 కోట్లకు చేసుకుంటారు. దాంట్లో సంతకం వేరే వారి పేరుతో ఉంటుంది. డేట్ ఉండదు.. ఆ సమయంలో కొవ్వొత్తి కాంతిలో ఒప్పందం చేసుకున్నారట..మరి చంద్రబాబు కనిపెట్టిన సెల్ ఫోన్ కూడా లేదా..? డొల్ల కంపెనీలు అప్పటికప్పుడు ఏర్పడతాయి..డబ్బు చేరగానే అవి మూతపడ్డాయి. వీటికి తోడు గంటా సుబ్బారావు అనే వ్యక్తిని తెచ్చుకుని నాలుగు పదవులు ఇచ్చి, తన సెక్రటరీగా కూడా పెట్టుకున్నాడు. ఆయన అర్జంట్‌గా నిధులు విడుదల చేయమన్నాడంటూ ఫైనాన్స్ వాళ్లు నోట్ ఫైల్‌లో రాస్తారు. ఈయనకు తెలియకుండా జరిగి ఉంటుంది అనుకుందామన్నా 2018లోనే జీఎస్టీ ఇంటిలిజెన్స్ ఎలెర్ట్ చేసింది. దాన్ని ఆ ఫైల్స్ అన్నీ మాయం చేయడానికి ఉపయోగించుకున్నాడు. ఒరిజినల్ సీమెన్స్ వారు మాకు 90 శాతం ఇచ్చే పాలసీనే లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. పేదల కడుపుకొట్టి..: ఫైబర్ గ్రిడ్‌లోనూ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. తనే రికమెండ్ చేస్తాడు.. తనే సెలక్షన్ చేస్తాడు. నాసిరకంగా చేశారనే దానికి ఆధారాలు దొరికాయి. దానికంటే ముఖ్యంగా అసలు లేని షెల్ కంపెనీ ద్వారా రూ.114 కోట్లు నేరుగా కొట్టేశారు. ఇన్నర్ రింగ్, అసెన్డ్ లాండ్స్ విషయంలోనూ చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉంది. దీనిలో కూడా లింగమనేని గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు నివాసం ఉంటున్నాడు. లబ్ధి పొందిన వారిలో హెరిటేజ్ వాళ్లు కూడా ఉన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో మరీ ఘోరంగా వ్యవహరించారు. 1954కు ముందు ఉన్న అసైన్డ్ భూములు అమ్ముకోవచ్చు అన్న అంశాన్ని తీసుకుని అక్కడి 900 ఎకరాల భూమిని కంప్లీట్‌గా మింగేశారు. అసైన్డ్ ల్యాండ్ టచ్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉంటే ఒక జీవోతో కొట్టేశారు. దాంట్లో అధికారులు అభ్యంతరం చెప్తే చంద్రబాబే వత్తిడి చేసి మరీ చేయించాడు. నారాయణ పేదల కడుపుకొట్టి అసైన్డ్ ల్యాండ్స్ కొట్టేశాడు. వారెందుకు అమ్ముడుపోయారో!: వాస్తవాలేమిటో కూడా చూడటం లేదంటే కమ్యూనిస్టులు ఎంతకు అమ్ముడుపోయారో? ఇంత జరిగినా ఇప్పుడు కక్షపూరితంగా కేసు పెట్టామంటూ మాట్లాడుతారు. చివరికి కమ్యూనిస్టు పార్టీలు కూడా అదే మాట మాట్లాడుతున్నాయి. జరిగిందేంటి అనేది కూడా చూసే పరిస్థితి లేదంటే వారు ఎంతకు అమ్ముడు పోయారో? ఎందుకు తాబేదార్ల మాదిరిగా చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తుతున్నారో.. బాబు ఆలోచనలను వీరు ఎందుకు చిలకపలుకులు పలుకుతున్నారో వారే ఆలోచించుకోవాలి. నిజంగా మాకే కక్ష ఉంటే..: నిజంగా మాకు వారిపై కక్ష ఉంటే.. ఏదైనా కక్షపూరితంగా చేయాలి అనుకుంటే మేం అధికారంలోకి రాగానే చేసే వాళ్లం. మాకు ఏ కక్షా లేదు కాబట్టే, మేము ఆ దిశలో ఆలోచించలేదు. వ్యక్తిగతమైన కక్ష లేదు కాబట్టే విచారణ పద్దతి ప్రకారం ఇన్నాళ్లు జరిగింది. 5 కోట్ల మంది ప్రజలకైతే వారు పచ్చ కళ్లద్దాలు పెట్టాలని చూస్తున్నారో వారినే అప్రమత్తం చేసేందుకు మేం ప్రయత్నం చేస్తున్నాం. వారి పరారీలో బాబు పాత్ర లేదా?: ఏ స్కాం అయినా మొన్న ఆగస్టులో ఇన్‌కం ట్యాక్స్ ఇచ్చిన నోటీసులతో స్పష్టంగా బయటకు వచ్చాయి. దాన్ని విచారిద్దామని అనుకునే లోపే పెండ్యాల శ్రీనివాస్ జంప్ అవుతాడు. సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి హడావుడిగా అమెరికా ఎలా జంప్ అయ్యాడు. దాంట్లో చంద్రబాబు పాత్ర లేదా? మరో నిందితుడు యోగేష్ గుప్తా అనే వ్యక్తి దుబాయ్ పారిపోతాడు. ఆయా కంపెనీల నుంచి సొమ్ము చంద్రబాబుకు ఎలా చేరాయో అతనికే తెలుసు. అన్నీ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసు నుంచి బయటపడాలంటే ఒక పద్దతి ఉంటుంది. కోర్టులున్నాయి.. కోర్టుల్లో తమ వాదనను వినిపించడవద్దు. లోకేశ్ ఢిల్లీలో ఎందుకు కూర్చున్నాడు? ఇక్కడుండి పార్టీని చూసుకోవచ్చు కదా? ఆ రాజకీయ పార్టీని నడిపే బాధ్యత కూడా ప్రజలదే అన్నట్లు తోడుదొంగ పార్టీ వాళ్లు చెప్తున్నారు. ఆ భయంతోనే అసెంబ్లీ నుంచి కూడా..: చర్చకు మేం సిద్ధం అంటారు. కానీ సభలో అందుకు ముందుకు రారు. మళ్లీ బయటకు వెళ్లి మాక్ అసెంబ్లీ అంటారు. అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమని మా మంత్రులు, స్పీకర్ కూడా చెప్పారు. వారు సెషన్‌కే రామని చెప్పిన రోజున చర్చ ఎజెండాలో ఉంది. ఎజెండాలో ఉన్నాక నీకు మాక్ అసెంబ్లీ ఎందుకు? అసలు అసెంబ్లీలో చర్చకు ఎందుకు వెనుకాడారు? మా వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడలేదా? సభలో చర్చించి మీ వాదన బలం రాలేదు అనుకుంటే బయటకు వచ్చి ప్రజలకు చెప్పుకోవచ్చు. 11 గంటలకు చర్చ జరగుతుందంటే అర్జంట్‌గా గెంటేయించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజులు కూడా సభ జరిగింది. చర్చకు రావచ్చు..కానీ మొత్తం సెషన్ బాయ్‌కాట్ అన్నారు. ఇదంతా డ్రామా కాక మరేమిటి? అంటే నీ వద్ద సరుకు లేదు..మాట్లాడే సత్తా లేదు. అడ్డంగా బుక్కై దొరికిపోతామనే భయంతోనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. మన వాయిస్ వినిపించడానికి అసెంబ్లీకి మించిన పెద్ద ప్లాట్‌ఫాం ఏముంటుంది? సీఐడీ కేసులో పాయింట్స్, స్కాం జరిగిన తీరు మొత్తం కూడా క్లియర్‌గా ఉన్నాయి. మీకు చేతనైతే సభలోనే మాకు సమాధానం చెప్పే వారు. జీవోలో రూ.3300 కోట్లని.. ఎంవోయూలో రూ.371 కోట్లు అన్నదానికి ఏం సమాధానం చెప్పగలరు? అసెంబ్లీలో డాక్యుమెంట్లు తీస్తాం కాబట్టే బయటకు వెళ్లి మాక్ అసెంబ్లీ పెట్టుకుని వారి వారి చానళ్లు, పేపర్లలో రాయించుకున్నారు. అంతటి సమర్థులు వారు: ఐఆర్‌ఆర్ అనేదే లేనప్పుడు దాంట్లో స్కాం ఎక్కడా అంటూ ఆ పత్రికలు రాస్తున్నారు. అసలు ఏమీ లేని దాంట్లో నుంచే స్కాం చేయగలిగావు.. లేని దాంట్లోంచి సొమ్ము తీసి నేరుగా బయటకు పంపించారు. ఐఆర్‌ఆర్ కాదు.. అసలు అమరావతే లేదు.. అదొక మిథ్య. దాంట్లో రైతుల్ని, రియల్ ఎస్టేట్ వాళ్లను ముంచి వేల కోట్లు సంపాదించారు. అమరావతి అనే మహా కుంభకోణంలో ఈ రింగ్ రోడ్డు, అసైన్డ్ ల్యాండ్స్ అనేవి చిన్న చిన్నవి. లేకుండానే మొత్తం మింగారు..దానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. దాన్ని బుకాయించడానికి, దబాయించడానికి వాళ్ల పేపర్లలో వాళ్లు అనుకున్నవి రాసుకుంటూ వెళ్తున్నారు. స్కాం జరిగింది సత్యం.. చంద్రబాబే సూత్రదారి.. స్క్రిప్ట్ ఆయనదే. దానిలో నారాయణ, గంటా సుబ్బారావు, వేమూరి హరికృష్ణ లాంటి వారు సహకరించారు. ఆయనకు తెలిసి చెప్పే చేస్తున్నాం అని రాతల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఆధారాలున్నాయి. ఆ ఆధారాలు కేంద్ర ఎజెన్సీల నుంచే వస్తున్నాయి. దీంట్లో జీఎస్టీ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇంత జరిగినా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక జగన్ చేస్తున్నాడు అంటే వారిని ఏమనాలి..? వాళ్లను మద్దతు పలికేవారిని ఇక ఏమనాలి..? జనాన్ని నమ్మించవచ్చని వారు చేసే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దని మా మనవి. చెప్పుకోడానికి ఏమీ లేక..: టీడీపీ నిజంగా ఒక రాజకీయ పార్టీ అయితే చట్టపరంగా కేసులపై పోరాడుతూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ప్రజలకు ఏం చెప్పాలో తెలియక తప్పించుకునేందుకు దీన్ని వాడుకుంటున్నారు. 2014–19 మధ్య ఏం చేశారో చెప్పమంటే చెప్పే పరిస్థితి వారికి లేదు. దొంగతనం బయట పడితే దాన్ని కూడా తాము బాధితులం అని చెప్పుకునే ప్రయత్నం ఒక ఘోరం. చెప్పడానికి ఏమీ లేక ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టడం, అసభ్యంగా మాట్లాడం చేస్తున్నారు. మొన్న రూ.3 లక్షల కోట్ల ఆస్తులంటూ ఆరోపిస్తున్నారు. పది లక్షల కోట్లని ఎందుకు అనలేదో..? వేరే విధంగా ఎదుర్కోలేక నోటికొచ్చినట్లు తిట్టుకుంటూ ఇదొక సంఘటనను అడ్డం పెట్టుకుంటున్నారు. ఇదంతా మాకు కూడా ఇబ్బంది కూడా ఉన్నాయి. మేం చేసినవి చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ వీళ్లు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పనులు చేశాం. ధైర్యంగా వెళ్లగలం: మాకు ఇంత పాజిటివ్ వేవ్ ఉన్నప్పుడు చెప్పుకోకుండా ఎలా ఉంటాం?. ఈ నాలుగేళ్లలో జగన్మోహన్‌రెడ్డిగారు తీసుకొచ్చిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయి. ఏడాదిన్నరగా మేమంతా ప్రతి గడపకూ వెళుతున్నాం. గడప గడప దాదాపు పూర్తి కావచ్చింది. జగనన్న సురక్ష ద్వారా 90 లక్షలకు పైగా సమస్యలను పరిష్కరించాం. ఇప్పుడు రాష్ట్రం అంతా జల్లెడ పట్టి హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి కింది స్థాయిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టాం. ఇంత నిర్మాణాత్మకంగా మేం ప్రజల్లోకి, డోర్ స్టెప్‌కు వెళ్తున్నాం. కీలకమైన విద్య, వైద్య రంగాల్లో పూర్తిగా ప్రజలకు అండగా నిలిచాం. అధికారం అంటే ఎంజాయ్ చేయడానికి అనే సగటు రాజకీయ నాయకుడి లక్షణాన్ని మారుస్తూ మేం ముందుకు వెళ్తున్నాం. ఘోరమైన తప్పు చేసి కూడా విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు. కోర్టులు ప్రశ్నించినా మేం సహించం అనే స్థాయికి వాళ్లు తెగించారు. ప్రజలు ఎక్కడికక్కడ వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని కోరుతున్నాం. చంద్రబాబు కేసులో రాజకీయ కక్ష లేదు: కేసులు చట్ట ప్రకారం విచారణ జరుగుతాయి. అందుకే ఇన్నాళ్లు పట్టింది. దానిలో ముఖ్యమంత్రి, రాజకీయ జోక్యం ఏమీ లేదు. కేసుల ఆలస్యానికి కారణం మాత్రం రాజకీయం కాదు. ఎన్నికల ముందు ఇలా చేస్తే మాకూ నష్టమే. కానీ చట్ట ప్రకారం జరిగే వాటిని ఆపలేం కదా. ఇప్పుడు అరెస్ట్ చేయడం లోనే ముఖ్యమంత్రి గారి పాత్ర దీంట్లో లేదనడానికి ఒక ఆధారం. ఇది కక్షసాధింపు చర్య కాదనడానికి నిదర్శనం. అంతా అవినీతిమయమే: హెరిటేజ్‌లో 2 శాతానికి రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అన్నారు. రెండెకరాల ఆసామీ చంద్రబాబు.. ఆ ఆసామికి ఇలా 2 శాతానికి 400 కోట్లు అంటే ఆలోచించాలి. ఈ కేసు ఒక చిన్నది. ఆధారాలతో సహా దొరికింది. ఇవి కాక ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కలిపితే లక్షల కోట్లు దాటుతుంది. ఆయన రాజకీయ పుట్టుక అంతా అవినీతిపైనే జరిగింది. చివరికి భువనేశ్వరి కార్బైట్స్ నుంచి ఇలానే జరిగింది. తాను ముఖ్యమంత్రి కాగానే హెరిటేజ్ ఎలా పుట్టిందో ఆనాటి డైరెక్టర్లును అడిగితే తెలుస్తుంది. ఆనాడు ఆ డైరెక్టర్ల డబ్బుతో పెట్టి.. వారిని బయటకు తరిమేసిన తీరు అందరికీ తెలుసు. ప్రజల సొమ్మునే పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. ఆయన రాజకీయ పుట్టుక, కంపెనీ పుట్టుక అంతా అవినీతిపైనే. అవినీతి తప్ప వేరేది తెలియని వాడు..ఇంకా ఎలా సంపాదించాలో ఆలోచిస్తాడు తప్ప ఇంతటితో ఆగడు. ఆయన లక్షణం..అలాంటి వారినే ఆ పార్టీలో ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు. దబాయిస్తే తప్పు ఒప్పవుతుందా?: హెరిటేజ్ వాళ్లు అక్కడ ల్యాండ్ తీసుకోవడం నిజం. అలైన్ మెంట్ మారింది నిజం. దానికి సమాధానం వాళ్లు చెప్పాలి..తిరిగి మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి? అధికారాన్ని తమ సొంత కంపెనీ కోసం వినియోగించుకున్నారు అనేది నిజం. కాదు అనేది వాళ్లు నిరూపించుకోవాలి. అంతేకానీ దబాయిస్తే ఎలా కుదురుతుంది? ఎవరో నాయకులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే దానికి విలువ ఏముంటుంది? ఆ పని ఢిల్లీలోనైనా చేస్తారు: దీనికి సంబంధించిన కేసులు ఉంటాయి.. ఇంకా కొత్తవి కూడా రావచ్చు. ఆయన ఢిల్లీ నుంచి అందుకే రావడం లేదు అంటున్నారు. ఆయన్ను అరెస్టు చేయాలంటే ఢిల్లీ నుంచైనా తీసుకొస్తారు. అన్నిటికీ నేను అడిగేది ఒక్కటే..స్కాం జరిగిందా లేదా అనేది ప్రజలు గమనించాలి. వారికి అది కడుపు మంట: ఉద్యోగులకు ఎక్కడా అన్యాయం జరగడం లేదు. ఒక్క ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో తప్ప. సీఎం గారు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఎలా చేయాలో అదే చేస్తున్నారు. సీపీఎస్ అయితే ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కనీస అవసరాలు కూడా తీర్చే పరిస్థితి లేదు. ఓపీఎస్‌కు వెళితే దాన్ని భరించే పరిస్థితి ఎలాంటి బలమైన ఆర్థిక వ్యవస్థకు లేదు. అందుకే ఖర్చు ఎక్కువైనా.. మినిమమ్ గ్యారెంటీ ఉండేలా జీపీఎస్ తీసుకొచ్చాం. ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఉన్నదానికంటే బెటర్ కాదని రాతలు రాస్తుంటే ఏం చెప్తాం. ఉద్యోగుల సంక్షేమంతో పాటు భవిష్యత్తు తరాలను కూడా చూడాలనే బాధ్యతతో వ్యవహరించాం. చేసిన దాన్ని అర్ధం చేసుకంటే స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ విమర్శలు చేయాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న రాతల్లానే ఉంటాయి. ఉద్యోగులు అందరూ సహదయంతో అర్ధం చేసుకున్నారు. వారు చిన్న చిన్న సమస్యలు అడుగుతున్నారు. వాటిని తీర్చేదిశగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో ఈ పత్రికల కడుపుమంట మాత్రమే కన్పిస్తోంది. అర్జంట్‌గా ఉద్యోగులు తిరుగుబాటు చేయాలి.. చంద్రబాబుకు ఉపయోగపడాలి అని ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు మీద కలుస్తారా?: అదానీని రహస్యంగా కాకుండా రోడ్డు మీద కలుస్తారా? చంద్రబాబుతో చెట్టుకింద కూర్చుని పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపాడా? ఒక స్టేట్ హెడ్‌ను ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కలిస్తే కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు. వీటన్నిటికీ కారణం అర్జంటుగా చంద్రబాబును తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టాలి. ఆయన దోపిడీ బయటపడితే ఇంకా పెద్ద ప్రమోషన్ ఇవ్వాలి. వారు కోరుకుంటున్నది జరిగితేనే ప్రపంచమంతా పసుపు పచ్చగా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజు ఇదే అదానీ, అంబానీలు చంద్రబాబును కలిసినా రాష్ట్రం ఎక్కడికో వెళ్లిపోతుందని రాతలు రాస్తారని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.