శ్రీ సత్యసాయి జిల్లా: చంద్రబాబు పాలన రెండేళ్ల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై చర్చించేందుకు పుట్టపర్తి వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, గత రెండేళ్ల పాలనలో ప్రభుత్వ పనితీరుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలుకాలేదని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి చర్చలు అవసరమని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.