ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణం విడుదల చేయాలి

‘ఆశ’ ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు పిలవాలి 

డాక్టర్‌ సీదిరి అప్పలరాజు డిమాండ్‌

శ్రీకాకుళంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు

వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నా పట్టని ప్రభుత్వం

కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ చరిత్రలో చీకటి అధ్యాయం 

రెండేళ్లలో రెండుసార్లు ఆగిపోయినా సీఎం తీరు మారలేదు

కమీషన్ల కోసమే ఆరోగ్యశ్రీని కాదని ఇన్సూరెన్స్‌ మోడల్‌ 

ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్  వైయ‌స్ఆర్‌సీపీ

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశ) ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి డిమాండ్లు నెరవేర్చడంతో పాటు, ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లులను తక్షణం విడుదల చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారం రోజులుగా ఎమర్జెన్సీ సేవలతోసహా అన్ని ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీకి చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని, 22 నెలల్లో రెండుసార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని తెలిపారు. నిబంధనల ప్రకారం 45 రోజుల్లో బిల్లులు చెల్లించాల్సి ఉన్నా 450 రోజులైనా బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3200 కోట్లకు చేరాయని చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఇంకా ఏం మాట్లాడారంటే..:

అన్నీ వదిలి అమరావతి భజన:
    ఆరోగ్యశ్రీ ఆగిపోయి రోగులు ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కార దిశలో ప్రభుత్వం కనీసం చొరవ చూపడం లేదు. చివరకు అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే దేవతల రాజధాని అంటూ చంద్రబాబు అమరావతి భజన మొదలుపెట్టాడు. చంద్రబాబు చెప్పే అమరావతికి, దేవతల రాజధానిగా పురాణాల్లో చెప్పిన అమరావతికి పొంతన లేదు. అలాగే అమర లింగేశ్వరస్వామి గుడి ఉన్న అమరావతి వేరు. నిజానికి ఇక్కడ ఉన్నది అదే అమరావతి. కానీ, మొత్తం ప్రాంతానికి అమరావతి అన్న పేరు పెట్టి, లక్షల కోట్ల అప్పులతో రాజధానిని కడతానని చెప్పడం అవివేకం. 

స్క్రుటినీ పేరుతో ప్రభుత్వం బెదిరింపు:
    బిల్లులు అడుగుతున్న ‘ఆశ’ ప్రతినిధులను స్క్రుటినీ పేరుతో సెటిల్‌మెంట్‌ చేసుకోవాలి ప్రభుత్వం బెదిరిస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ నాకేంటి అంటున్నాడు. ఆరోగ్యశ్రీ సేవల ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. బిల్లుల చెల్లింపునకు ఒక నిర్దిష్టమైన విధానం రూపొందించాలని కోరుతున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఆరోగ్యశ్రీని ట్రస్టు మోడల్‌ నుంచి ఇన్సూరెన్స్‌ మోడల్‌లోకి మార్చుతామని చెబుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీహయాంలో ఆరోగ్యశ్రీ కోసం ఐదేళ్లలో రూ.13,700 కోట్లు ఖర్చు చేయగా, 1.42 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందాయి. 

ఇన్సూరెన్స్‌ మోడల్‌లో అన్ని సేవలు సాధ్యమా?:
    ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న యూనివర్సల్‌ హెల్స్‌ స్కీమ్‌ కింద ఇన్సూరెన్స్‌ మోడల్‌ ప్రకారం ఒక్కో కుటుంబానికి ఏడాది ప్రీమియం రూ.2500 చొప్పున ఇప్పటి వరకు పథకంలో ఉన్న కుటుంబాలకు కలిపి ఏడాదికి రూ.3550 కోట్ల ప్రీమియమ్‌ అవుతుంది. కాగా, ప్రభుత్వం 1.62 కోట్ల మందికి వర్తింపజేస్తామని చెబుతోంది. అంటే అందుకు రూ.4050 కోట్లు అవసరం. ఇదివైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఒక ఏడాది చేసిన ఖర్చు కన్నా రూ.1500 కోట్లు ఎక్కువ. మరి ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఆరోగ్యశ్రీలో మాదిరిగా బాధ్యత తీసుకుని రోగులకు సేవలందిస్తాయని హామీ ఇవ్వగలరా?  క్లెయిమ్‌లు రిజెక్ట్‌ అయితే వాళ్లు ఎవరికి చెప్పుకోవాలి?.
    వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 2 వేల నుంచి 3257కి పెంచడం జరిగింది. ఈ మొత్తం ప్రొసీజర్లు ఇన్సూరెన్స్‌ మోడల్‌లో ఉంటాయని ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పైగా అదనంగా కేటాయిస్తున్న బడ్జెట్‌ చూస్తే బినామీ కంపెనీలకు ఇన్సూరెన్స్‌ కాంట్రాక్టులు కట్టబెట్టి జేబులు నింపుకోవాలన్న తపన తేటతెల్లమవుతోంది. . 

మావిగన్‌ కారిడార్‌ రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌:
    శివరామకృష్ణన్‌ కమిటీ సూచనలకు భిన్నంగా చంద్రబాబు రాజధాని ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. లక్ష ఎకరాల్లో కనీస సదుపాయాలకు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కావాలి. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ మాయమాటలతో ప్రజలకు భ్రమ కల్పిస్తున్నాడు. చంద్రబాబు చెప్పే అమరావతి మోడల్‌ కి వందేళ్లు పడుతుందని వారే చెబుతున్నారు. జీతాలకే డబ్బులు లేవని చెబుతూ అమరావతికి లక్షల కోట్లు ఎలా వెచ్చిస్తారో చెప్పడంలేదు.
    అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ సిటీ అని చెప్పకోవడం తప్పించి ఒక్క ఎకరా అయినా అమ్మింది లేదు. అమరావతి నిర్మాణంలో అడుగడుగునా ప్రతికూలతలే ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా వైయస్‌ జగన్‌ గారు సూచించిన మావిగన్‌ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌ అవుతుంది. చంద్రబాబు చెప్పేదానిలో కేవలం పది శాతం ఖర్చు చేసి ప్రపంచ స్థాయి వసతులతో వేగంగా రాజధాని నిర్మించుకోవచ్చు. అందుకే వైయస్‌ జగన్‌ గారు సూచించిన మావిగన్‌పై ప్రజల్లో మంచి స్పందన వస్తోంది.  

వంశధార ట్రిబ్యునల్‌ డ్రాఫ్టులో టీడీపీ పాత్ర లేదు:
    వంశధార నీటి వివాదానికి సంబంధించి 2021లోనే ట్రిబ్యునల్‌ ఫైనల్‌ డ్రాఫ్టు రిపోర్టు ఇచ్చింది. దానిపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో మూడు ఎస్‌ఎల్‌పీలు వేస్తే దానిపై ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి కూడా నేరడి బ్యారేజీ కోసం ప్రయత్నించడం లేదు. 2010లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వేసిన ట్రిబ్యునల్‌ ని తన ఘనతగా తెలుగుదేశం నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒడిశా ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీలు వెనక్కి తీసుకోకపోతే నేరడి బ్యారేజీ ఎలా సాధ్యమని ఆలోచించడం లేదు. అలా కాకుండా తమ పాత్ర ఏమీ లేకపోయినా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు.

Back to Top