కూటమి ప్రభుత్వ మరో వంచన బట్టబయలు

‘ఆడబిడ్డ నిధి’ అమలు చేయలేమన్న సంకేతాలు

మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు అర్థం అదే 

పుత్తా శివశంకర్‌ రెడ్డి ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌.

పథకాలు అమలు చేయకుండా రకరకాల సాకులు

రాష్ట్ర ప్రజలను మెంటల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు

పుత్తా శివశంకర్‌ రెడ్డి ఆక్షేపణ

ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీలపై విస్తృత ప్రచారం

వాటి అమలుకు తమ వద్ద రోడ్‌ మ్యాప్‌ ఉందన్నారు.

సంపద సృష్టించి మరీ హామీలు అమలు చేస్తామన్నారు.

ఏడాది పాలన తర్వాత రాష్ట్రాన్ని అమ్మాలని చెబుతున్నారు.

ఇప్పటికే సగం రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్‌ బినామీలకు అమ్మేశారు.

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌ రెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి: టీడీపీ కూటమి ప్రభుత్వ మరో నయవంచన బట్టబయలైందని, ఎన్నికల ముందు ఆర్భాటంగా చెప్పిన సూపర్‌ సిక్స్‌ లోని ఆడబిడ్డ నిధి అమలు చేయలేమన్న సంకేతాలను ప్రభుత్వం ఇచ్చిందనివైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ రెడ్డి ఆక్షేపించారు. ఈ పథకంపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు అర్థం అదే అని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చెప్పారు.

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే:
 
చెప్పకనే చెప్పారు:
    
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలను నమ్మి ఓటేసిన మహిళలు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. పథకాలు అమలు చేయకుండా మాయమాటలతో ఇప్పటికే ఏడాది గడిపేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఆ పథకాలను పూర్తిగా ఎత్తేసేందుకు కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని చెబుతూ.. ఈ పథకాన్ని అమలు చేయలేమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

హామీల అమలు లేదు. అంతా వంచన:

సూపర్‌ సిక్స్‌లో భాగంగా ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 13 నెలలు గడిచినా ఈ హామీని అమలు చేయకుండా వదిలేశారు. ఈ ఒక్క పథకం ద్వారానే కూటమి ప్రభుత్వం ఏకంగా 2 కోట్ల మంది మహిళలను దారుణంగా మోసం చేసింది. పైగా అన్ని హామీలను అమలు చేశామని, ఈ ఒక్క హామీ మాత్రమే మిగిలిపోయిందని పచ్చి అబద్ధం చెప్పడం సిగ్గుచేటు. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్‌లో ఆర్భాటంగా ప్రచారం చేసిన రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏడాది గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదు. మూడు గ్యాస్‌ సిలిండర్ల హామీని ఒక్క సిలిండర్‌కే పరిమితం చేశారు. ఇంకా మ్యానిఫెస్టోలో ప్రకటించిన 143 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు.

దోపిడి అరికడితే పథకాలు అమలు చేయొచ్చు:

అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రజలతో తమకిక పని లేదన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. డొల్ల కంపెనీలు సృష్టించి వేల కోట్ల విలువైన భూములను ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు తన వారికి కట్టబెట్టేస్తున్నారు. మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, దేవాలయ భూములు, వక్ఫ్‌ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో రెండో విడత భూసేకరణ పేరిట మరో 44 వేల ఎకరాలకు తండ్రీ కొడుకులు స్కెచ్‌ వేశారు. చంద్రబాబు, లోకేష్‌.. తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఇప్పటికే సగం రాష్ట్రాన్ని అమ్మేశారు. ఏడాదిలోనే రూ.1.80 లక్షల కోట్ల అప్పు చేసినా, ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదు. చంద్రబాబుకు నిజంగా ఆ హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే.. ఇసుక, లిక్కర్, మట్టి, క్వార్ట్జ్, మైనింగ్‌ దోపిడిని అరికడితే సరిపోతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిన కూటమి నాయకులు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పి అధికారం నుంచి తప్పుకోవాలి. 

రోజాకు ఎమ్మెల్యే బొలిశెట్టి క్షమాపణలు చెప్పాలి:

మాజీ మంత్రి ఆర్‌కె రోజా మీద జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌నాయుడు ఆర్‌కె రోజా గురించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడితే, తోటి ప్రజా ప్రతినిధిగా ఖండించాల్సింది పోయి.. బొలిశెట్టి కూడా రెచ్చిపోవడం కూటమి పార్టీల నేతల వైఖరి చూపుతోంది. ఇప్పటికైనా మాజీ మంత్రి ఆర్‌కె రోజాపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని పుత్తా శివశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top