తాడేపల్లి: మామిడి మద్దతు ధర విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రకటనలు రైతులను మభ్యపెట్టేలా, బాధపెట్టేలా ఉన్నాయని వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ఆక్షేపించారు. సీజన్ ముగిసిన తరువాత నిన్న కేంద్రం నుంచి లేఖ తెప్పించుకొని రైతులను ఏదో లబ్ధి చేకూర్చినట్లు మాట్లాడటం బాధాకరమన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంవీఎస్ నాగిరెడ్డి ఏమన్నారంటే.. రాష్ట్ర రైతుల గోడు సరి అయిన సమయం లో పట్టని మీరు కేంద్రమంత్రులుగా, మంత్రులుగా ఉండటం లోని అవుచిత్యం ఏమిటి? మామిడి రైతులకు ఏదో మేలు చేసేస్తున్నట్టుగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటనలు రైతులను బాధ పెట్టేలా, మభ్యపెట్టేలా ఉన్నాయి. ఈ ఏడాది మే 10 నుంచి మామిడి రైతుల సమస్య కొనసాగుతోంది. అప్పటినుంచి ధరలేక రైతులు ఆవేదన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం రైతులను ఆదుకోలేకపోయారు. పక్క రాష్ట్రం కర్ణాటక రూ.16ల చొప్పున కొనుగోలు చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించి, జూన్ 21నే లేఖ తెప్పించుకుని కాస్తైనా ఆ రాష్ట్ర రైతుల్ని ఆదుకునే ప్రయత్నంచేసింది. కాని, చంద్రబాబునాయుడు, ఆయన పార్టీకి చెందిన కేంద్రమంత్రులు ఈ విషయంలో ఏ మాత్రం శ్రద్ద చూపలేదు. రైతుల వద్ద మామిడి పంట అయిపోయిన తర్వాత, సీజన్ ముగిసిన తర్వాత నిన్న అంటే, జులై 21న లేఖ తెప్పించుకుని మీరేదో రైతులకు లబ్ది చేసినట్టుగా చెప్పుకోవడం బాధాకరంగా లేదా.? పైగా గత ఏడాది కిలో రూ. 25-29 మధ్య రైతులు విక్రయిస్తే, ఇప్పుడు మద్దతు ధర కిలో రూ.14.9గా చెప్పడం, అందులోనూ మార్కెట్ రేటుకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరకు వ్యత్యాసం కిలో రూ.3.7 లేనని చెప్పడం, ఇందులో కేంద్రం+రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 1.84 చొప్పున మాత్రమే ఇస్తామనడం ఇదంతా రైతులను మభ్యపెట్టడం కాక మరేమిటి. పైగా రైతుల వద్ద ఇప్పుడు పంటకూడాలేదు. పంటలేనప్పుడు ఈ అరకొర సాయం ఎవరికి చేస్తారు? అలాంటప్పుడు మీరు చేస్తున్న ప్రకటనలు కేవలం రాజకీయ లబ్ధికోసం, రైతులను అన్యాయం చేయడం కోసమే కాదంటారా.? గతంలో కూడా మిర్చి రైతుల విషయంలో ఇలాగే జరిగింది. క్వింటాలుకు రూ.11,731లు ప్రకటించినా వొక్క రైతునుంచి కిలో మిర్చి కూడా కొనుగోలు చేయలేదు. మిర్చి రైతుల విషయంలో ఎలా అన్యాయం చేశారో, ఇప్పుడు మామిడి రైతుల విషయంలో కూడా అలాగే అన్యాయం చేస్తున్నారు. అదికూడా రాష్ట్రంలో 6.5 లక్షల టన్నులు పంట ఉంటే, అందులో కేవలం 1.62 లక్షల టన్నులు మాత్రమే కొంటామనడం, అదీ తాము లేఖ రాసిన జులై 21 తర్వాత మాత్రమే జరిగే అమ్మకాలకు మాత్రమే వర్తిస్తాయని కేంద్రం చెప్పడం, అదీకూడా రైతుల పంట మార్కెట్ కు వెళ్లిపోయిన సమయంలో ఈ లేఖరావడం అన్యాయం కాక మరేమిటి.? మే 10న తెరవాల్సిన జ్యూస్ ఫ్యాక్టరీలను, జూన్ 10 వరకూ తెరవకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ధరలు పడిపోయినా పట్టించుకోలేదు. చివరకు రూ.12 ధర ప్రకటించినా ఏ ఫ్యాక్టరీ కూడా కొనుగోలు చేయలేదు. మీరిస్తానన్న రూ.4ల కిలో చొప్పున ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇన్ని అన్యాయాలు చేసి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన లేఖపై నానా హడావిడిచేస్తూ, దాన్ని వక్రీకరించి ప్రచారం చేసుకుంటూ రైతులకు ఇంకా అన్యాయం చేస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గం.