రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కరవు..

యథేచ్ఛగా వారిపై పెచ్చుమీరుతున్న దాడులు..

నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి ఆక్షేపణ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎంప్లాయిస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి.

ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్న కూటమి నేతలు..

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ తీరు ఆక్షేపణీయం..

ఏకంగా ఏఎస్పీనే బెదిరించడం అత్యంత దారుణం.. 

జేసీ ప్రభాకర్‌ రెడ్డి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి..

ప్రెస్‌మీట్‌లో నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి డిమాండ్‌

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అడుగడుగునా అరాచకం పెచ్చు మీరుతోందని.. ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయిస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆయన తెలిపారు. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ తీరు ఆక్షేపణీయమన్న ఆయన, జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఏకంగా ఏఎస్పీనే బెదిరించడం అత్యంత దారుణమని అన్నారు. అందుకు తక్షణమే జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.
నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఉద్యోగులు మీ జీతగాళ్లు కాదు:

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నానాటికీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విచక్షణ మర్చిపోయి తీవ్రంగా దుర్భాషలాడుతున్నారు. మొన్నటికి మొన్న జిల్లా పంచాయితీ అధికారి నాగరాజనాయుడుని దుర్భాషలాడిన విషయం మరువక మందే మరోసారి  ఆలిండియా లెవెల్‌ అధికారి, తాడిపత్రి అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి మీద ఆయన నోరు పారేసుకున్నారు. తాను చెప్పినట్లు వినడం లేదన్న అక్కసుతో ఇటీవలే జిల్లా స్ధాయి అధికారిని దూషించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇప్పుడు ఏకంగా జిల్లా స్దాయి అధికారిని ఒరేయ్‌ అని సంభోధించం అత్యంత దుర్మార్గం. ఉద్యోగులు మీ కాళ్ల దగ్గర పని చేసే జీతగాళ్లు కాదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పని చేసే అధికారులు రాజ్యంగం ప్రకారం నియమ నిబంధనలను అనుసరించి పని చేస్తారు తప్ప, మీకు నచ్చినట్లు మీ సొంత రాజ్యాంగం ప్రకారం పని చేయరన్న విషయం గుర్తుంచుకోవాలి. 

తాడిపత్రిలో ప్రత్యేక రాజ్యాంగం:

తాడిపత్రిలో ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.  ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల మీ వైఖరిని మార్చుకోవాలి. రాష్ట్రంలో ఉద్యోగ వర్గం దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. అడిషనల్‌ ఎస్పీతోనే ఏకంగా.. ‘నీ సంగతి చూస్తాను. నీకు ఎంత ముట్టింది?. నీ ఆఫీసు ముందే ధర్నా చేస్తాను’ అని బెదిరిస్తుంటే, ఇక కిందిస్థాయి ఉద్యోగులకు ఏం రక్షణ ఉంటుంది.? తిరిగి ఆ అధికారి మీదే కేసు పెడతానని బెదిరించడం చూస్తుంటే, రాష్ట్రంలో కూటమి నేతలు అకృత్యాలు ఏ రకంగా పెచ్చుమీరుతున్నాయో అర్ధం అవుతుంది. ఎన్నికలకు ముందు అనేక హామీలివ్వడంతో పాటు ఉద్యోగుల గౌరవాన్ని కాపాడతానని చంద్రబాబు ఇచ్చిన మాట ఏమైంది.? కచ్చితంగా జేసీ ప్రభాకరరెడ్డి మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలి. 

అడుగడుగునా కూటమి నేతల అరాచకాలు:

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ఓ ఒంటరి మహిళ తన కుమార్తెను కేజీబీవీలో చేర్పించేందుకు వెళితే, అధికార టీడీపీకి చెందిన ఓ నేత సాయం చేస్తానని నమ్మించి ఫోన్‌ నెంబరు తీసుకుని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. 
శ్రీసత్యసాయి జిల్లాలో బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్‌ వర్కర్‌గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించి, మరలా ఉద్యోగం కావాలంటే కమిట్‌మెంట్‌ కావాలంటూ శానిటేషన్‌ కాంట్రాక్టరుగా వ్యవహరిస్తున్న స్థానిక టీడీపీ నేత వేధించడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం మొత్తం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ దగ్గరకు చేరడంతో విషయం కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అందుకే వారిపైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి కోరారు.

Back to Top