తాడేపల్లి: సింగపూర్ పర్యటనపై మంత్రి నారా లోకేష్ పిట్టకథలు చెబుతున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పాత లావాదేవీలను సెటిల్ చేసుకునేందుకే చంద్రబాబు, లోకేష్‌లు సింగపూర్‌కు వెళ్ళారని అన్నారు. ఇప్పటి వరకు 58 సార్లు సింగపూర్ వెళ్ళిన చంద్రబాబు ఒక్క రూపాయి అయినా పెట్టుబడి తీసుకువచ్చారా అని నిలదీశారు. అవినీతి కేసులో సింగపూర్‌లో జైలుకు వెళ్ళి, ఇటీవల బయటకు వచ్చిన ఈశ్వరన్‌ను కలిసేందుకే సింగపూర్‌కు వెళ్ళారా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చారు. తన పర్యటనలో ఏం సాధించారంటే శూన్యం. పాత లావాదేవీలు సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా లేక గతంలో సింగపూర్ మంత్రిగా ఉండి జైలుపాలైన ఈశ్వరన్ ఇటీవలే విడుదలైన నేపథ్యంలో ఆయనను కలిసేందుకు వెళ్ళారా.? ఎందుకు సింగపూర్ వెళ్ళారో చెప్పాలి. వైయస్ఆర్‌సీపీ సింగపూర్ కంపెనీలను రాష్ట్రం నుంచి గెంటేసిందని లోకేష్ పిట్టకథలు చెబుతున్నాడు. కానీ చంద్రబాబు అవినీతిని చూసి సింగపూర్ ప్రభుత్వమే మేం రాము అంటూ తేల్చి చెప్పారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు మంత్రి నారా లోకేష్ నానా తంటాలు పడుతున్నాడు. సింగపూర్‌కు ఈ మెయిల్స్ రాసింది మీ పార్టీ వ్యక్తే: సింగపూర్ కంపెనీలను ఏపీకి రావద్దంటూ వైయస్ఆర్‌సీపీ ఈ మెయిల్స్ పంపుతోందని మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేసే వారితో పరిచయం ఉన్న మురళీకృష్ణ అనే వ్యక్తి నుంచి ఈ మెయిల్స్ పంపారని లోకేష్ ఆరోపించారు. వాస్తవం ఏమిటీ అంటే చిలకలూరురి పేటకు చెందిన మురళీకృష్ణ చౌదరి అనే ఆయన యూఎస్ లో ఉంటారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వీరాభిమాని. చిలుకలూరిపేటలో ఆయన ఆస్తులను కాజేసేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేనే ప్రయత్నించడంతో ఆయన ఇటీవలే ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారట. పార్టీ అభిమానినైన నా ఆస్తులనే టీడీపీ ఎమ్మెల్యే కాజేస్తున్నారు, టీడీపీ పాలన కంటే వైయస్ జగన్ పాలనే వెయ్యి రెట్లు నయం అంటూ ఆయన ఈ మెయిల్స్ పెడుతున్నాడు. ఆయన రాసిన ఒక ఈ మెయిల్‌లో 'రాత్రి నాలుగు పెగ్గులు వేసి, నాలుగు ఈ మెయిల్స్ పంపాను, ఎవరికి పంపానో నాకు గుర్తు లేదు' అంటూ దానిలో పేర్కొన్నాడు. దానికి మంత్రి నారా లోకేష్ వక్రీకరిస్తూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారి కంపెనీలో పనిచేసే వారితో సంబంధం ఉన్న వ్యక్తి అంటూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాడు. ఈ మురళీ కృష్ణ చౌదరి ఎవరు..? ఆయనకు పెద్దిరెడ్డి గారికి ఏం సంబంధం..? 'పెద్దిరెడ్డి' కుటుంబంపై చంద్రబాబు కక్ష: పెద్దిరెడ్డి గారి మీద చంద్రబాబు చాలా కక్షతో ఉన్నారు. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లో ఏదో ఘర్షణ జరిగితే చంద్రబాబును పెద్దిరెడ్డి గారు చెప్పుతో కొట్టారనే అంశం కూడా ప్రచారంలో ఉంది. 2021లో ఆదాన్ అనే కంపెనీ పెద్దిరెడ్డి గారికి చెందిన సంస్థలకు రూ.5 కోట్లు నిధులు సమకూర్చిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. కానీ ఆదాన్ కంపెనీ నుంచి పెద్దిరెడ్డి గారికి చెందిన పీఎల్ఆర్‌కు ఒక్క పైసా కూడా సొమ్ము జమ కాలేదు. లిక్కర్ స్కాం అనే కేసుతో లేని అంశాలను సృష్టించి బురదచల్లే ప్రయత్నం కాదా ఇది. పీఎల్ఆర్ కంపెనీకి వ్యాపార సంబంధాల నేపథ్యంలో వేరే కంపెనీ నుంచి సొమ్ము రావడం, తిరిగి వాటిని చెల్లించడం జరిగితే దానికి, లిక్కర్ స్కాంకు ఎలా ముడిపెడతారు. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం ట్రస్ట్, హెరిటేజ్ సంస్థలకు కూడా పలు సంస్థల నుంచి సొమ్ము వ్యాపార లావాదేవీల్లో భాగంగా వస్తుంటుంది. దీనిని కూడా అవినీతి కేసులతో ముడిపెడతారా? నెల్లూరు పర్యటనలో ఒక యుద్ద వాతావరణం: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై పద్నాలుగు కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేధిస్తోంది. రిమాండ్‌లో ఉన్న కాకాణితో పాటు కోవూరులో టీడీపీ గుండాల దాష్టికానికి గురైన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వైయస్ జగన్ వెళితే కూటమి సర్కార్ కుట్రపూరితంగా ఇబ్బందులు సృష్టించింది. రోడ్డుపై గోతులు తవ్వించింది, ముళ్ళకంచెలు వేశారు, లాఠీచార్జీతో ఒక యుద్ద వాతావరణాన్ని సృష్టించింది. తన పార్టీ నాయకులను పరామర్శించేందుకు ఒక మాజీ సీఎం వెళితే ఎంత హంగామా సృష్టించారో ప్రజలంతా చూశారు. అడుగుడునా వైయస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించారు. వైయస్ జగన్‌కు ఉన్న ప్రజాధరణను ఎవరు ఆపలేరు. వైయస్ జగన్ పరామర్శకు వెళితేనే అవి బహిరంగసభల్లా ప్రజలతో మారిపోతున్నాయి. జనంను మేం ఎక్కడా తీసుకురావడం లేదు. స్వచ్ఛందంగా వచ్చే ప్రజలను ఎలా తప్పుపడతారు. ఒక ఐజీ స్థాయి అధికారి నెల్లూరులో కూర్చుని వైయస్ జగన్ ను జనం కలవకూడదంటూ బందోబస్త్‌ను పర్యవేక్షించారు. వైయస్ జగన్‌ను అడ్డుకునేందుకు సిగ్గులేకుండా మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని చంద్రబాబు, లోకేష్‌లు వినియోగిస్తున్నారు. 164 సీట్లు గెలిచి, చివరికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పర్యటనలను అడ్డుకోవడానికే మొత్తం శక్తి యుక్తులను వినియోగించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. పదకొండు మంది ఎమ్మెల్యేలు, పులివెందుల ఎమ్మెల్యే అని చలకనగా మాట్లాడే ఈ ప్రభుత్వం ఎందుకు వైయస్ జగన్‌ను చూసి భయపడుతున్నారు. చిట్టినాయుడు లోకేష్ దెబ్బకు చంద్రబాబు బుర్ర పాడైంది. వైయస్ఆర్‌సీపీ నేతలపై ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి అణిచివేయాలనుకుంటే, అంతకంటే ఎక్కువ బలంతో వైయస్ జగన్ ఎదుగుతున్నారు. అసమర్థ హోంమంత్రి అనిత: రాష్ట్రంలో హోంశాఖ వ్యవహారాలన్నీ నారా లోకేషే చూస్తున్నాడు. హోమంత్రిగా అనిత శాంతిభద్రతలను చూడటం మానేసి వైయస్ జగన్, ఆయన కుటుంబం గురించి చిలువలు పలువలుగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో హోంశాఖ సరిగ్గా పనిచేయడం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ మధ్య బహిరంగంగానే మండిపడ్డారు. అప్పటి నుంచి తన శాఖను తీసేస్తారని అనితకు భయం పట్టుకుంది. అందుకే రోజూ వైయస్ జగన్ ను తిట్టే కార్యక్రమం చేస్తోంది. దీనితో పాటు ఆయన కుటుంబం గురించి, ఎన్సీఎల్టీ గురించిన విషయాలపైన కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. అనిత కుటుంబ సమస్యల గురించి మేం కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది.? వాటి గురించి మాకు తెలియదా.? చెక్‌బౌన్స్ కేసు గురించి మాట్లాడలేమా.? వైయస్ జగన్‌కు కుటుంబపరమైన సమస్యలు ఉంటే వాటిని చట్టపరంగా పరిష్కరించుకునేందుకు న్యాయస్థానం ద్వారా ప్రయత్నిస్తున్నారు. న్యాయస్థానం కూడా ఆయనకే వ్యాపార వాటాల బదిలీపై అనుకులంగా తీర్పు ఇచ్చింది. దీనిపైన అనిత పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలి: రాష్ట్రంలో ఒక చెడు సంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వైయస్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపుతున్నారు. చివరికి ఐపీఎస్ అధికారులను కూడా వదిలిపెట్డడం లేదు. అంటే ప్రభుత్వం చేతిలో ఉంటే ఎటువంటి ఐపీఎస్ అధికారినైనా సరే కేసుల్లో ఇరికించి, జైళ్ళకు పంపడం పెద్ద విషయం కాదని నిరూపించారు. ఎవరైతే చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగి, చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారులు దీనిని గుర్తుంచుకోవాలి. రేపు వచ్చే ప్రభుత్వం కూడా తప్పులు చేసే అధికారులను కూడా ఇలాగే చేస్తుందని తెలుసుకోవాలి. లోకేష్ కాస్తా నేడు హైక్యాష్ గా మారారు. చంద్రబాబు, లోకేష్, అనితలతో పాటు పోలీస్ అధికారులంతా హద్దు మీరి ప్రవర్తిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.