విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించడం ద్వారా కూటమి ప్రభుత్వం అభాసు పాలైందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆక్షేపించారు. విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఎన్ని కుట్రలు చేసినా, ఎంత నిర్బంధం విధించినా జనం నుంచి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వేరు చేయలేరని ఆమె స్పష్టం చేశారు. బారికేడ్లు, ఇనుపకంచెలు, రోడ్ల పై గుంతలు తవ్వి... పోలీసుల ద్వారా ప్రజాభిమానాన్ని అణిచివేయాలనకున్న ప్రభుత్వ కుట్రలు నెరవేరలేదని తేల్చి చెప్పారు. జనస్పందన చూసిన హోంమంత్రి, అధికార పార్టీ నేతలు సహనం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడ్డంపై వరుదు కల్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఓ అసమర్థ, అట్టర్ ప్లాప్ మంత్రి అని.. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైనందుకు ఆమె, అ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ప్రజా స్పందన చూసి మైండ్ బ్లాకైన కూటమి నేతలు: సింహగిరి ప్రజల సింహగర్జనను, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాభిమానాన్ని చూసి కూటమి నేతల కళ్లు బైర్లు కమ్మి మైండ్ బ్లాంక్ అయింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారెని చూడ్డానికి వస్తున్న జనాలను రాకుండా ఆపడానికి మూడువేల మంది పోలీసులను పెట్టిన ప్రభుత్వం... ఆయన రక్షణ కోసం మాత్రం పదిమంది పోలీసులన్నే పెట్టింది. వందమందికి మించి రాకూడదని, అక్రమ కేసులు పెడతామని కూడా పోలీసుల ద్వారా బెదిరించారు. అయినా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తమ గుండెల్లో దేవుడిగా కొలుస్తున్న నెల్లూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేశారు. తామెన్ని చేసినా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు జనాలు వెల్లువలా తరలిరావడంతో అసూయతో రగిలిపోతున్న అధికార పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ముఖ్యమంగా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి పచ్చి అబద్దాలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. దమ్ముంటే మీ ఆరోపణలు నిరూపించగలరా..? వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజలు రాకుండా చేయడానికి ఇనుపకంచెలు పెట్టినా, బారికేడ్లు ఏర్పాటు చేసినా, చివరికి రోడ్లు అడ్డంగా గోతులు తవ్వినా ప్రజలను మాత్రం ఆపలేకపోయారు. నెల్లూరు నగరం జనసంద్రమైంది. దీంతో తట్టుకోలేని అధికారపార్టీ నేతలు తప్పుడు ప్రచారానికి తెరతీశారు. నెల్లూరు పర్యటనలో జనాలే లేరని దీంతో సాక్షి మీడియాలో గతంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు జనాలు వచ్చిన విజువల్స్ ప్రసారం చేసారంటూ హోంమంత్రి కొత్త రాగం అందుకున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు దమ్ముంటే తాను చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేస్తున్నాను. సాక్షి టీవీలో బంగారుపాళ్యం విజువల్స్ ఎక్కడ చూపించారో నిరూపించండి. అలా చేయలేని పక్షంలో మీ హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తారా..? బాధ్యతాయుతమైన హోంమంత్రి పదవిలో ఉండి మీరు మీ పదవిని ఏరోజైనా సక్రమంగా నిర్వర్తించారా..? మీ సంస్కార హీనానికి ప్రజల బుద్ధి చెప్పడం ఖాయం: నిత్యం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే మీ పని. మీరు అధికారంలోకి వచ్చిన 13 నెలలు పూర్తి కావస్తుంది. 13 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు మీద, ఆడపిల్లల మీద విపరీతమైన అఘాయిత్యాలు జరిగాయి. మీరు ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు..? అండగా ఎందుకు నిలబడలేదు.? వారికి ఎందుకు ధైర్యం చెప్పలేదు.? బాధితులకు అండగా నిలబడలేదు సరికదా.. ప్రతి సందర్బంలోనూ దౌర్జన్యాలకు చేసిన వారికే అండగా నిలబడ్డారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై నోరుపారేసుకుంటూ సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను, పరువును మీరు దిగజార్చుతున్నారు. సమయం, సందర్బం లేకుండా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నిందించడానికే మీకు హోం మంత్రి పదవి ఇచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రతిసారి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తున్న మీకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయన కాలి గూటికి కూడా మీరు సరిపోరు. ఓ మాజీ ముఖ్యమంత్రి, దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిని అలా సంబోధించడానికి ఏకవచనంతో సంబోధించడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా పాయకరావు పేట ఎమ్మెల్యే గారూ.? కేవలం మీ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, మీ పదవిని నిలబెట్టుకోవడానికే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు మీ ప్రతిమాటను గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం. మీ మాటలు మతిస్థిమితం లేని వ్యక్తిని తలపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబే క్షమాణపలు చెప్పాలి: గతంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో మహిళల రక్షణకు అత్యంత ప్రతిష్టాత్మకంగా దిశ యాప్ ను తీసుకువచ్చారు. యాప్ ను వినియోగించే ఆడపడుచులు యాప్ ను ఓపెన్ చేసి.. ప్రమాదసమయంలో మూడుసార్లు పోన్ ను షేక్ చేస్తే పోలీసులకు సమాచారం అందుతుందని వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. దాని మీద నమ్మకంతో 1.30 కోట్ల మంది మహిళలు ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ రోజు ఇదే అనిత దిశ యాప్ గురించి చులకనగా హేళన చేస్తూ మాట్లాడారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశ యాప్ నే పేరు శక్తి యాప్ గా పేరు మార్చి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు శక్తి యాప్ ద్వారా మూడుసార్లు ఫోన్ షేక్ చేస్తే పోలీసులకు సమాచారం అందుతుందని చెప్పారు. అంటే ఆ రోజు మీరు చేసిన వ్యాఖ్యలు మీ ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తాయి కదా.? మరోవైపు వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబసభ్యులపైనా విమర్శలు చేస్తున్నారు. గతంలో సరస్వతి పవర్స్ షేర్లు విషయంలో ఎన్ సీ ఎల్ టీని ఆశ్రయిస్తే.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తల్లికి, చెల్లికి ఆస్తిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఎన్ సీ ఎలీ టీ లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారెకి అనుకూలంగా తీర్పు వస్తే... చంకలు గుద్దుకున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఆ విషయం గురించి మాట్లాడారా.? హోంమంత్రి స్ధాయిలో ఉండి మీరే మాత్రం దిగజారి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ ఉదంతం వెనుక చంద్రబాబునాయుడు కుట్రను గమనించే వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. హోంమంత్రి అనిత గారు ప్రతి ప్రెస్ మీట్ లోనూ మీరు ప్రజాప్రతినిధుల భాష సంస్కారం గురించి నీతులు చెబుతుంటారు. మీరు మాత్రం ప్రతి సందర్బంలోనూ వైయస్ఆర్‌సీపీ మీద, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద మీ నోటికి ఏది వస్తే అది సంస్కారహీనంగా మాట్లాడతారు. అంటే నీతులు ఎదుటవారికి చెప్పడానికే తప్ప మీరు మాత్రం వాటిని అనుసరించరా.? కుటుంబసమస్యలను, వ్యక్తిగత అంశాలను ఎందుకు పబ్లిక్ లో మాట్లాడుతున్నారు.? మీ కుటుంబంలో సమస్యలు లేవా.? వాటి గురించి మేం ఏరోజైనా మాట్లాడామా.? మరి మీరు ఎందుకు నోరు అదుపులో ఉంచుకోవడం లేదు.? రాజకీయాలతో సంబంధం లేని వైయస్.భారతమ్మ మీద కూడా మీరు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. సాటి మహిళగా ఎదుటవారిని గౌరవించకుండా... రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారి మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని విమర్శలు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా అబద్దాన్ని నిజం చేయలేరు. ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోవాలి, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహిళలకు క్షమాపణలు చెప్పాల్సి వస్తే... మహిళల పట్ల నీచంగా మాట్లాడిన మీరు, మీకు హోంమంత్రి పదవి ఇచ్చినందుకు చంద్రబాబు గారు క్షమాపణలు చెప్పాలి. మాజీ మంత్రి రోజా గారిపై అత్యంత నీచంగా మాట్లాడిన మీ నాయకుడు బండారు సత్యన్నారాయణ మూర్తికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా మహిళా మున్సిపల్ కమిషనర్ ని అత్యంత అసభ్యకరంగా బూతులు తిట్టిన వ్యక్తిని స్పీకర్ చేసినందుకు చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి. దళిత మహిళా అధికారిని బూటు కాలుతో తన్నిన వ్యక్తిని మంత్రిని చేసినందుకు చంద్రబాబు గారు క్షమాపణలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి తల్లిని రూ.5 కోట్లు ఇచ్చి మరీ ఐటీడీపీ వారితో తిట్టించినందుకు చంద్రబాబుగారు క్షమాపణ చెప్పాలి. మీ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని తిట్టినందుకు అలాంటి పార్టీకి అధ్యక్షుడైనందుకు చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి. ఇవన్నీ వదిలిపెట్టి మహిళల సాధికారత కోసం, మహిళాభ్యున్నతికి, మహిళలను అన్ని రంగాల్లో ప్రధమస్ధానంలో ఉండేలా కృషి చేసి.. వారిని తమ తోబుట్టవులుగా అక్కున చేర్చుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పాలంటున్న మీకు సిగ్గుందా..? టీడీపీ నేతలందరూ మానసిక రోగులా..? టీడీపీ గూండాల దాడిలో ఇళ్లంతా ధ్వంసం అయిన మా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని, అధికార పార్టీ తప్పుడు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడాన్ని హోంమంత్రి తప్పుపడుతున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మానసిక పరిస్ధితి సరిగాలేదని మాట్లాడుతున్నారు. ఏ మొహం పెట్టుకుని ఈ మాటలు మాట్లాడుతున్నారు. హత్య కేసులో అరెస్టు అయిన జైలుకెళ్ళిన కొల్లు రవీంద్రను ఆ రోజు మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏ మొహం పెట్టుకుని పరామర్శ చేశారు. అంటే ఆరోజు చంద్రబాబు గారి మానసక పరిస్థితి సరిగ్గా లేదా..? ఈఎస్ఐ స్కాంలో అరెస్టు అయి జైళ్లో ఉన్న అచ్చన్నాయుుడు గారిని చంద్రబాబు గారు మానసిక పరిస్థితి బాగాలేకే పరామర్శించారా..? ఆ రోజు చంద్రబాబు జైళ్లో ఉన్నప్పుడు ఆయన్ను పరామర్శించిన టీడీపి నేతలందరూ మానసిక రోగులా..? ఆ ఎమ్మెల్యేది డబ్బు, అహంకారంతో కూడిన మిడిసిపాటు: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అత్యంత దిగజారి వ్యాఖ్యలు చేశారు. చచ్చిపోయిన పార్టీని బ్రతికించడానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు వచ్చారంటున్న ప్రశాంతి డబ్బుందన్న అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గతంలో తాను, తన భర్త అదే పార్టీలో పదవులు అనుభవించిన విషయాన్ని మర్చిపోవద్దు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ అయితే మీకెందుకు అంత ఉలికిపాటు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ప్రజాస్పందన చూసి మరోసారి మా పార్టీ కార్యాలయంపై దాడికి ఉసిగొల్పారు. కేవలం ఇలాంటి దాడుల కోసమే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గంజాయి బ్యాచ్ ను పెంచి పోషిస్తున్నారు. మీ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. ఎన్నిజన్మలెత్తినా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత మీకు రాదు. ఇంత మిడిసిపాటుతో వ్యవహరించిన మహిళా నేత రాష్ట్ర చరిత్రలో మరొక్కరు లేరు. అట్టర్ ప్లాప్, అసమర్థ హోంమంత్రి: హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి, ప్రజలకు మీరు చేసింది శూన్యం. మీరు సక్రమంగా విధులు నిర్వర్తించలేదని మీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే చెప్పారు. మీరు అసమర్థ, అట్టర్ ఫ్లాప్ హోంమంత్రి. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మహిళలు క్షమాపణ చెప్పాల్సి వస్తే అందరికంటే ముందు మీరు క్షమాపణ చెప్పాలి. హోంమంత్రిగా మహిళల భద్రత గాలికి వదిలేసినందుకు, రోజుకు 70కు పైగా మహిళలు, చిన్నారులు పై అఘాయిత్యాలు జరుగుతున్నా ఆపలేకపోతున్నందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. మాజీ మంత్రి ఆర్కే రోజాపై మీ పార్టీ నేత గాలి భానుప్రకాష్ రెడ్డి చేసిన నీచమైన వ్యాఖ్యలకు మీరు క్షమాపణలు చెప్పాలి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక పై టీడీపీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యే మద్ధతుతో దాడి చేస్తే... కనీసం కేసు కూడా నమోదు చేయనందుకు సాటి మహిళా ప్రజాప్రతినిధికి న్యాయం చేయలేనందుకు ఓ మహిళా హోంమంత్రిగా మీరు క్షమాపణ చెప్పాలి. రాప్తాడులో 14 ఏళ్ల దళిత బాలికను మీ టీడీపీ కార్యకర్తలు గ్యాంగ్ రేప్ చేసినా.. వారి పై సకాలంలో చర్యలు తీసుకోనందుకు మీరు క్షమాపణ చెప్పాలి. పోలీసులు నిర్లక్ష్యం కారణంగా తన్మయి హత్య జరిగింది. అందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. మీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు సుబ్రమణ్యం కుమారుడు ఓ యువతిని మోసం చేస్తే.. దాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి మీ మంత్రి ప్రయత్నించడం అత్యంతం అమానుషం. బాధిత తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. అందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. మీ పార్టీ నేత బాలకృష్ణ నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికురాలు ఉద్యోగం కోసం మహిళను పక్కలోకి రమ్మనా మహిళా హోంమంత్రిగా స్పందించని మీరు క్షమాపణ చెప్పాలి. మీ మరో ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం వల్ల ఓ మహిళ వేధింపులకు గురై.. పక్క రాష్ట్రానికి వెళ్లి ప్రెస్ మీట్ లో విలపించినా ఆమెకు న్యాయం చేయలేని మీరు క్షమాపణ చెప్పాలి. మీ పార్టీకే చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేధింపులకు ఓ మహిళా వీఆర్వో ఆత్మహత్యాయత్నం చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి. వంద రోజుల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాను అని చెప్పి... మీరు నివాసం ఉంటున్న విశాఖలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. గంజాయి, మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నందుకు, రాష్ట్రంలో విచ్చలవిడిగా క్రైమ్ రేట్ పెరుగుతున్న ఆపలేని అసమర్థ స్ధానంలో ఉన్న హోమంత్రి అనిత రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు క్షమాపణలు చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్ని మాట్లాడినా..ఎంత నిర్బంధం విధించినా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చి తీరుతారని... చేతనైంది చేసుకొండంటూ... వరుదు కల్యాణి సవాల్ చేశారు. ప్రజల నుంచి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని దూరం చేయడం ఈ జన్మకు కూటమి పార్టీలకు సాధ్యం కాదని తేల్చి చెప్పారు.