ఏఐ టెక్నాలజీ అంటూ టీటీడీ చైర్మన్ ప్రచార ఆర్భాటం

రెండు గంటల్లో భక్తులకు దర్శనమంటూ ఊదరగొడుతున్నారు

అలాంటప్పుడు మూడో క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి నిర్ణయం ఎందుకు..?

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని సూటిగా ప్రశ్నించిన భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతిలో మీడియాకు వీడియో విడుదల చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: తిరుమలలో ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేస్తున్నదంతా ప్రచార ఆర్భాటమేనని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అంటూ మాట్లాడుతున్న చైర్మన్ శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం ఉన్న రెండు క్యూ కాంప్లెక్స్‌ లు సరిపోవడం లేదని మూడో క్యూ కాంప్లెక్స్‌కు పాలకమండిలో ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉచితంగా మాకు ఏఐ టెక్నాలజీని ఇచ్చేందుకు ముందుకు వచ్చారంటూ గూగూల్, టీసీఎస్‌కు చెందిన ప్రతినిధులకు కొండపైన గెస్ట్‌హౌస్‌లను కేటాయించడం, టీటీడీ వాహనాలను వాడుకునేందుకు అనుమతించడం, టీటీడీ సిబ్బందిని వారి కోసం కేటాయించడం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ సంస్థల ఉద్యోగులకు టీటీడీ ఖర్చుతో వాహనాలను ఎలా అందిస్తున్నారో చెప్పాలన్నారు. తొమ్మిది నెలలుగా ఏఐ టెక్నాలజీని తీసుకువస్తున్నామంటూ ఆయన పదవీ కాలం ముగిసే వారకు ఇదే చెబుతూ కాలక్షేపం చేస్తారా అని నిలదీశారు. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే టీటీడీలో భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన టీటీడీ చైర్మన్ తన ప్రచారం కోసం, పరస్పర విరుద్దమైన నిర్ణయాలను ఎలా తీసుకుంటారన్నారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగానే భక్తుల దర్శన ఏర్పాట్లు ఉండాలే కానీ, ఏఐ పేరుతో కొత్త విధానాలను ఆలయంలో ప్రవేశపెట్టడంపై హైందవధర్మ పరిరక్షకుల సలహాలను ఎక్కడా తీసుకోలేదని అన్నారు.

Back to Top