వైయస్ఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని వైయస్ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మండిపడ్డారు. వ్యవసాయం కుదైలందని, చంద్రబాబు రైతులను ఆదుకోవడం మరిచిపోయాడని, అమరావతి తప్ప..ఆయనకు ఏమీ పట్టడం లేదని ధ్వజమెత్తారు. మంగళవారం బద్వేల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రైతాంగంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. ఇటీవల చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టినట్టుగానే ఆయన పాలన సాగుతోంది. చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్ అంటూ నిన్న ప్రకాశం జిల్లా దర్శిలో చంద్రబాబు తన మనసులోని మాటను బయటపెట్టేశారు. తన పాలన కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. వ్యవసాయాన్ని సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తూ చంద్రబాబు అన్నదాతల ఉసురు తీస్తున్నారు. మా ప్రభుత్వంలో ఐదేళ్లూ వైయస్సార్ రైతు భరోసా ఏటా రూ.13,500 అందించి అన్నదాతకు తోడుగా నిలిచిన పరిస్థితులు ఇప్పుడు లేవు. లక్షణంగా కొనసాగుతున్న రైతు భరోసా పథకాన్ని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు. రెండో ఏడాది ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు దాటిపోయింది. ఇప్పుడు రెండేళ్లకు రూ.40 వేలకు గానూ రూ.5 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా 7 లక్షల మంది అన్నదాతలకు అన్నదాత సుఖీభవ వర్తింపజేయకుండా ఎగ్గొట్టిన పాపాత్ముడు చంద్రబాబు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నకు చంద్రబాబు ప్రభుత్వం కనీస చేయూత ఇవ్వడం లేదు. రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి వ్యవసాయం చేసి చేతులు కాల్చుకున్నట్టుగా తయారైంది. ప్రకృతి విపత్తులను, తెగుళ్లను ఎదుర్కొని పంటలు పండిస్తే సర్కారు నుంచి కనికరం లేదు. మొదటి ఏడాది రైతు భరోసా పూర్తిగా ఎగ్గొట్టడంతో అధిక వడ్డీలకు అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో సాగు చేస్తున్న పంటలనుకాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రైతుల కష్టాలేవీ ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? యూరియా, కాంప్లెక్స్ ఎరువులు సబ్సిడీపై సర్కారు అందించాలి. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉన్న ఊళ్లోంచి కదిలే పని లేకుండా ఎరువులు సబ్సిడీపై అందేవి. ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చేసిన కూటమి ప్రభుత్వం.. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసేంది. విత్తు నుంచి పంట అమ్మకం దాకా రైతన్నను చేయిపట్టి నడిపించిన తీరు నుంచి ఇప్పుడు ఆర్బీకేలు ఎత్తేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు పంట కొనుగోళ్లు కూడా మా హయాంలో బ్రహ్మాండంగా జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ రకమైన చేయూత ఇవ్వడం లేదు. ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు గానీ, ఏ వర్గాలు గానీ క్యూల్లో నిలబడిన పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు చంద్రబాబు పుణ్యాన అన్నదాతలు మళ్లీ ఎర్రటి ఎండల్లో గంటల తరబడి క్యూల్లో నిలబడే దుస్థితి దాపురించింది. యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొరత ఉన్నా కనీసం రైతులకు వాటిని అందించాలనే ఆలోచన కూడా చంద్రబాబు కానీ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కానీ చేయడం లేదు. ఎంతసేపూ రాజకీయ కక్షలే తప్ప అన్నదాతల సంక్షేమం, వ్యవసాయంపై శ్రద్ధ చూపడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఎరువుల సమస్యపై సాక్షాత్తూ ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలోనే రైతన్నలను తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎరువుల్లేవు.. అన్నీ సమస్యలే ఉన్నాయంటూప్రభుత్వానికి రైతులు ఫోన్ కాల్స్ లో చెప్పిన పరిస్థితులు పత్రికల్లో కథనాలుగా వచ్చాయి. అయినా ఈ ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎరువుల కష్టాలు తప్పడం లేదని, ఆర్బీకేలు, పీఏసీఎస్ ల ద్వారా కూడా అరకొరగానే ఇస్తున్నారని రైతులు ప్రభుత్వానికి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. సబ్సిడీకి ఎరువులు అందించాల్సింది పోయి... ప్రైవేటులో కొనుక్కొనేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వం ఇవ్వకుండా మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలను సైతం పెంచేస్తున్నారు. ఎరువుల కంపెనీలు రూ.100 నుంచి రూ.255 వరకు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేసినా ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది. యూరియా, డీపీఏ ఎరువుల బస్తాపై రూ.100-రూ.500 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. గత వారం రోజుల క్రితం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని రైతు సేవా కేంద్రానికి 440 బస్తాల యూరియా వచ్చింది. అదే సెంటర్ పరిధిలో ఉన్న కొట్టుగుమ్మకి చెందిన ఉదయ్ అనే టీడీపీ నాయకుడు తన అనుచరులతో కలిసి 200 బస్తాల యూరియాను దౌర్జన్యంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. గ్రామస్తులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ప్రక్రియ ఆగింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయంలో 245 బస్తాల యూరియాను పంపిణీ చేస్తామని ముందస్తుగా చెప్పడంతో సచివాలయానికి భారీగా రైతుల చేరుకున్నారు. గంటల తరబడి వేచి చూసినా పంపిణీ జరక్కపోవడంతో ఆందోళనకు దిగారు. గత జూలై నెల 10న శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రానికి 440 బస్తాలు యూరియా వచ్చింది. దీంతో దాదాపు 1300 మంది రైతులు అక్కడికి చేరుకుని గంటల తరబడి క్యూల్లో నిలబడిన దుస్థితి మనం పత్రికల్లో చూశాం. ఎరువులు రైతులందరికీ ఇచ్చేలా మా ప్రభుత్వంలో పటిష్ట కార్యాచరణ రూపొందించి ఎక్కడా ఇబ్బందులు లేకుండా అమలు చేశాం. కానీ ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. బఫర్ స్టాక్ కింద 2 లక్షల టన్నులు లక్ష్యం కాగా ఇందుకు రూ.100 కోట్లు అవసరం. బడ్జెట్లో మాత్రం రూ.40 కోట్లే కేటాయించారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందులో విడుదల చేయలేదు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఏకంగా 13.31 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేశాం. జూలై 16న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కారు. గంటల తరబడి పడిగాపులు కాచినా ఎరువులు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆగ్రహించారు. జూలై 14న కర్నూలు జిల్లా పెద్దకడుబూరు సొసైటీ వద్ద యూరియా కోసం అన్నదాతలు క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు కాశారు. ఇలా రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఎరువుల కోసం రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా నిల్వలు రాష్ట్రంలో ఎక్కడా లేకపోవడం చంద్రబాబు అసమర్థతకు, రైతన్నల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. అదనపు సమాచారం మరోవైపు రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మామిడి..గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు బాధలు పడుతున్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు ధర పలికితే.. నేడు ఆ ధర కిలో రూ.2కు కూడా కొనడం లేదని రైతులు వాపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య రైతులు ఫ్యాక్టరీల వద్ద, జాతీయ రహదారులపైనా మామిడి పంటను పారబోసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయ్యింది. 24 గంటల్లోనూ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని డప్పు కొట్టిన ప్రభుత్వ పెద్దలు.. మూన్నాళ్ల ముచ్చటగా మార్చేశారు. రెండు నెలలు దాటిపోయినా ధాన్యం డబ్బులు రాక ఎదురు చూపులు చూస్తున్నారు. బస్తాపై రూ.300 నుంచి రూ.400కు పైగా నష్టపోవాల్సి వస్తోంది. తేమ శాతం పేరిట సాకులు చూపి సగానికి సగం ధాన్యం కొనకుండా ప్రభుత్వం మొండికేసింది. దీంతో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితులు దాపురించాయి. కోకో రైతుల బాధలు.. కోకో పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. కనీసం ధరల ఒప్పంద ప్రకటన కూడా చేయకుండా మోసం చేస్తోంది. కేవలం మాటల వరకే పరిమితమైంది. కిలో కోకో గింజలను రూ.550కి కొనుగోలు చేస్తామని మంత్రి సమక్షంలో చెప్పి.. అమలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రైతుపై పిడుగు ఆక్వా రైతుల్ని కూటమి సర్కార్ నిలువునా ముంచింది. అమెరికా సుంకాల పేరు చెప్పి ఎగుమతులు పడకేశాయి. ఆక్వా రైతుల బాధలుపట్టించుకోకుండా కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంది. రొయ్యల ధరలు పతనమైనా ప్రభుత్వం చేష్టలుడిగి చూడటంపై అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 100 కౌంట్ ధర వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రూ.280 దాకా పలికితే.. కూటమి ప్రభుత్వంలో రూ.200 - రూ.220 కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. మిర్చి రైతు కంట కన్నీరు మిర్చికి మద్దతు ధర కల్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వంచించింది. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో క్వింటాల్ మిర్చి ధర రూ.27 వేల వరకు పలికింది. కానీ నేడు క్వింటా రూ.8 వేలు, రూ.10 వేలు కూడా పలకగడం గగనంగా మారింది. దీంతో అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నారు. పొగాకు రైతుపై సర్కారు పగ పొగాకు రైతుపై కూటమి సర్కార్ పగ సాధిస్తోంది. వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో దారుణంగా విఫలమైంది. బేళ్లతో మార్కెట్లకు వచ్చి ఎంత కాలం వేచి చూసినా గిట్టుబాటు ధర గగనమే అవుతోంది. నడిరోడ్డుపై పొగాకు బేళ్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపినా చంద్రబాబు కనీసం ఆరా తీసిన పాపాన పోలేదు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కిలో పొగాకు ధర అత్యధికంగా రూ.366 దాకా పలికింది. కానీ నేడు రూ.200 కూడా రాని పరిస్థితి దాపురించింది. టమాటా.. టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధరల్లేక రోడ్డుపక్కన పారబోసి వెళ్లిపోతున్నారు. కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా గిట్టుబాటు కాక టమాటా రైతులు అల్లాడిపోతున్నారు. ఒకానొక దశలో 15 కిలోల బాక్సు గరిష్టంగా రూ.50 కూడా దక్కకపోవడమే టమాటా రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. గత ప్రభుత్వంలోని మంచి వ్యవస్థలన్నీ నాశనం..రైతుకు అండగా నిలుస్తూ గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసింది. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా విత్తు నుంచి పంట అమ్మకం వరకు రైతులకు తోడుగా నిలిచింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు గ్రామంలోనే అందించింది. వైయస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతన్నలకు రూ.34,288 కోట్లు సాయంగా అందించింది. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. 2019-23 మధ్య ఉచిత పంటల బీమా పరిధిలోకి 54.55 లక్షల మంది రైతులు, బీమా కింద రూ.7,802.5 కోట్లు చెల్లింపులు చేశారు. ప్రీమియం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఉచిత విద్యుత్ అమలుకు ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేసింది. ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్ విద్యుత్ అందించింది. సున్నా వడ్డీ పంట రుణాలు అందించింది. సీజన్ ముగిసేలోపే ఇన్ పుట్ సబ్సిడీని రైతన్నలకు అందించింది. ధాన్యం కొనుగోలులో ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. ఇలా అనేక రకాలుగా రైతును చేయిపట్టి నడిపించేలా పాలన సాగింది. వైయస్ జగన్ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేస్తూ ఐదేళ్లలో మొత్తంగా రూ.1,84,567 కోట్లు వెచ్చించారు. కానీ ఇప్పుడా వ్యవస్థలన్నీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం విధ్వంసం చేసేసింది. రైతన్నకు చిల్లిగవ్వ ఇవ్వకుండా మోసం చేసింది. ఆత్మహత్యల బాట పడుతున్న అన్నదాత.. కూటమి ప్రభుత్వం పాలనలో రైతులకు వ్యవసాయం భారంగా మారింది. విత్తనాలు కొరత.. సాగైన కొద్ది పంటనైనా బతికించుకుందామంటే ఎరువుల, పరుగు మందులకు కటకట, పండిన పంటను అమ్ముదామంటే మార్కెట్లో ధరల లేక యాతన.. చివరికి అప్పులు తీర్చే దారి లేక పంట పొలాల్లోనే పరుగుమందు ప్రభుత్వ నిర్వాకం, తాగి అర్ధాంతరంగాతనువు చాలిస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకం అస్తవ్యస్థ విధానాలతో నిరుడు జూన్ 12 నుంచి 250 మందిపైగా ఆత్మహత్యకు పాల్పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో 68. అనంతపురంలో 46, వైయస్సార్ జిల్లాలో 37, శ్రీకాకుళంలో 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం 104 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతోంది. ఇంకో విచిత్రం ఏమంటే గత డిసెంబరు నాటికే 97 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు త్రీమెన్ కమిటీ ధ్రువీకరించిందని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఈ సంఖ్యను 60కి కుదించేసింది. పైగా ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదు.