15వ ఫైనాన్స్ నిధులు తక్షణమే విడుదల చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి  డిమాండ్‌

ఎన్ఆర్ఈజీఎస్ చట్టం ప్రకారం ఉపాధి హామీ పనులు సర్పంచుల తీర్మానం మేరకే పనులు జరపాలి 

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి ప్రోటోకాల్ ని పాటించాలి 

పెండింగులో ఉన్న గౌరవ వేతనాల్ని తక్షణమే విడుదల చేయాలి 

తాడేపల్లిలోని పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ... రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. 

కమిషనర్ కృష్ణ తేజ‌కు వినతి పత్రం సమర్పించిన సర్పంచులు

తాడేపల్లి:  కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసిన‌15వ ఫైనాన్స్ నిధులు తక్షణమే విడుదల చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి  డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వ‌ర్యంలో తాడేప‌ల్లిలోని కమీషనర్ కార్యాలయం వద్ద స‌ర్పంచ్‌లు ధర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఒక దగా ప్రభుత్వమని, సాధారణ ఎన్నికలకు ముందు సర్పంచ్‌ల‌కు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్లి గవ్వ కూడా నిధులు విడుదల చేయకపోగా కేంద్రం విడుదల చేసిన 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను డిసెంబ‌ర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాటిని స్థానిక సంస్థల ఖాతాలో జమచేయక పోగా మొత్తం దారి మళ్లించడం ఎంతవరకు సమంజసమని ప్ర‌శ్నించారు. గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చ‌ల్లుకోవడానికి, తాగునీటి బోర్ల మరమ్మతులకు, శానిటేషన్‌కు నిధులు లేకపోతే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయని అయన కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్.. నీ శాఖలోని స్థానిక సంస్థలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని నిల‌దీశారు. నీ వ్యక్తిగత వైభవం కోసమా లేక ప్రజలకు సేవ చేయడానికా మీరు డిప్యూటీ సీఎం అయ్యింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక్కసారి నీ అంతరాత్మ‌ను ప్రశ్నించుకోవాలని వెన్నపూస రవీంద్రా రెడ్డి హితవు పలికారు. కార్య‌క్ర‌మంలో స‌ర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్, శ్రీ రామ మూర్తి, వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీపీల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముళ్ళపూడి గాంధీ,  పంచాయతీ రాజ్ విభాగం కృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, దాసరి రాజు,రాష్ట్ర కార్యదర్శి చక్రారెడ్డి,సర్పంచ్ల సంఘము నాయకులు మహేష్ రెడ్డి, జయరామి రెడ్డి, నాగరాజు, రసూల్, అరుణ్ కుమార్, సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top