తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను బలోపేతం చేయాలి

లోక్‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ:  తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను బలోపేతం చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాల గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంటులో ప్ర‌స్తావించారు. ఇందుకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సమాధానం ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చర్యలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదు సంవత్సరాల్లో రూ.28.82 కోట్ల మేర కేంద్ర నిధులు విడుదలైనట్టు మంత్రి తెలిపారు. ఈ నిధులతో కాకినాడ, విశాఖపట్నంలో రెండు 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం లభించిందని, మరో నాలుగు ఆయుష్ ఆసుపత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. అదే సమయంలో ఐదు ఆయుష్ ప్రజా ఆరోగ్య కార్యక్రమాలకు కూడా సహకారం అందించామని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో 126 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 92 కో-లొకేటెడ్ ఆయుష్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం ముఖ్యమైన ఆయుష్ మందుల సరఫరాకు కేంద్రం ద్వారా మద్దతు లభించిందని మంత్రి వివరించారు. అంతేకాక, ఒక కొత్త ఆయుష్ విద్యాసంస్థ ఏర్పాటుతో పాటు, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయం అందించామని తెలిపారు. తిరుపతి జిల్లాలోని చెంగనగుంట రూ.9.08 లక్షలు, కురుగొండ రూ.8.62 లక్షలు, మోమిడి రూ.8.01 లక్షలు, మంగళం ప్రాజెక్టుకు రూ.8.29 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఈ నాలుగు కేంద్రాల ద్వారా ఏప్రిల్ 2024 నుండి జూన్ 2025 వరకు మొత్తం 25,173 మంది లబ్ధిదారులు ఆయుష్ సేవలు పొందారని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ద్వారా ఇటీవల తిరుపతి జిల్లాలోని రాస్-కృషి విజ్ఞాన కేంద్రంలో “నన్నారి సాగు, కోత తర్వాత నిర్వహణ, మార్కెటింగ్ అవకాశాలు” అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడిందని, దాని ద్వారా సుమారు 60 మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లాలో ఒక హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు రూ.10.80 లక్షలు, అశ్వగంధ మొక్కల ప్రచారానికి రూ.18.90 లక్షలు ఆర్థిక సహాయం అందించబడిందని కేంద్ర మంత్రి వివరించారు. 

ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి ఆయుష్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి విస్త్రుతమన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృత సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.

Back to Top