నెల్లూరు: మాజీ సీఎం వైయస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాటిని తిప్పికొట్టారని, ఆయన పర్యటనను విజయవతం చేశారని నెల్లూరు వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నేతలు ఆనం విజయ్‌కుమార్ రెడ్డి, మేరగ మురళి, కాకాణి పూజిత తదితరులు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మాజీ సీఎం పర్యటనకు జనం రాకూడదని రోడ్లను కూడా తవ్వేయడం, జేసీబీ లను అడ్డం పెట్టడం చూశామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భంధాలను అధిగమించి వేలాదిగా జనం వైయస్ జగన్ వెంట నడిచారని, ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు ఇది నిదర్శనమని అన్నారు. ఎవరెవరు ఏమన్నారంటే... పోలీసులు ఇచ్చే నోటీసులు సంతోషంగా స్వీకరిస్తాం : ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడూ లేనిది నెల్లూరు జిల్లా రాజకీయాలను భ్రష్టుపట్టించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా సీనియర్ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో వారికి అండగా ఉన్నానని చెప్పడానికి జిల్లాకు మాజీ సీఎం వైయస్ జగన్ వస్తుంటే ఆయన్ను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో వైయస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన గురించి జిల్లా వాసులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. నెల్లూరు జైలు నుంచి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వరకు 7.7 కిమీల ప్రయాణంలో అడుగడుగునా వైయస్ జగన్ వచ్చిన అభిమానులు నీరాజనాలు పలికారు. చెట్లు గుట్టలతో ఉన్న ప్రాంతంలో అనుమతి ఇస్తే, 5 రోజులుపాటు శ్రమించి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని సిద్ధం చేసుకున్నాం. కిలో మీటర్ రోడ్డు మేమే వేసుకున్నాం. హెలిప్యాడ్, జైలు దగ్గర పది మందికి మించి ఉండకూడదన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద ఒక్కరు కూడా ఉండకూడదన్నారు. వైయస్ జగన్ తోపాటు మూడు వాహనాలకు మించి ఉండకూడదన్నారు. కానీ పోలీసులు మాత్రం 12 వాహనాల్లో వచ్చి అభిమానులు ఎవరూ మా నాయకుడిని చేరుకోకుండా ఆటంకాలు సృష్టించారు. ఒక ప్రజా నాయకుడు వస్తుంటే ఇన్ని ఆంక్షలు విధించడం సమంజమేనా.? మరీ దారుణంగా 35 రకాల కండిషన్లు పెట్టారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో లిస్ట్ తయారు చేసి ఆధార్ నంబర్లతో ఇవ్వమంటారు. వాహనాలు పెడితే వాటి నెంబర్లు ముందుగానే ఇవ్వమన్నారు. 3 వేల మందికిపైగా వైయస్ఆర్‌సీపీ నాయకులకు నోటీసులిచ్చారు. ఎవర్నైయినా కార్యక్రమానికి తీసుకెళితే కేసులు పెడతామని బెదిరించారు. ఆఖరుకి వైయస్ఆర్‌సీపీ మహిళా నాయకుల ఇళ్లకు మహిళా కానిస్టేబుళ్లు లేకుండా అర్థరాత్రి వెళ్లి నోటీసులు ఇచ్చారు. కార్యకర్తలు రాకుండా అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ రోడ్లను బారికేడ్లతో నిర్బంధించి దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించారు. ఆయనకు రక్షణ కల్పించాల్సిందిపోయి ఆయన్ను అడ్డుకోడానికి పోలీసులను కేటాయించారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మహిళలపైనా పోలీసులు లాఠీచార్జ్ చేశారు: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. హోంమంత్రి, డీజీపీ, ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ జిల్లాకు వస్తుంటే విజయవంతం కాకూడదని ప్రభుత్వం చేయని కుట్ర లేదు. తన ఏడాది పాలనకే చంద్రబాబులో భయం మొదలైంది. పోలీసులు ఖాకీ చొక్కాలు తీసేసి పచ్చచొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరించారు. ఒంగోలుకి చెందిన పోలీస్ ఒకాయన నామీద లాఠీతో దాడికి దిగాడు. గోర్లతో రక్కారు. తిరిగి నా మీద రెండు కేసులు పెట్టారు. అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదు. ఈరోజు కూడా ప్రెస్ మీట్ జరగకుండా అడ్డుకునేందుకు పార్టీ ఆఫీసు మీదకు టీడీపీ గూండాలను పంపించారు. అయినా మేం ఆగిపోలేదు. ఇలాంటి దాడులకు, కేసులకు వెరసే ప్రసక్తే లేదని ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. జగనన్న ఇచ్చిన భరోసా ఎంతో ధైర్యాన్నిచ్చింది: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె కాకాణి పూజిత కష్టాల్లో ఉన్న మా కుటుంబానికి వైయస్ జగన్ నెల్లూరు వచ్చి భరోసా ఇవ్వడం మాకెంతో బలాన్నిచ్చింది. మాజీ సీఎం వైయస్ జగన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక అన్నలా మాకు భరోసా ఇచ్చారు. కానీ దాన్ని కూడా కొన్ని పత్రికలు వక్రీకరించి రాశారంటే వారిని ఏమనాలో అర్థం కావడం లేదు. వైయస్ జగన్ కోసం కార్యకర్తలు రావొద్దని మైకులతో రోడ్లపై ప్రచారం చేశారు. దీంతో మేం ఒక్క కార్యకర్తను కూడా తరలించకుండానే స్వచ్ఛందంగా వేల మంది వైయస్ జగన్ కోసం తరలివచ్చారు. వైయస్ జగన్ మీద ఉన్న ప్రజాభిమానం నెల్లూరు జిల్లా పర్యటనతో మరోసారి ప్రపంచానికి తెలిసింది. మానాన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, అక్రమ కేసుల్లో జైల్లో నిర్బంధించారని ప్రజలు నమ్ముతున్నారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యం లోనే ఉన్నామా లేక బ్రిటీష్ రాజ్యంలో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయని కాకాణి పూజిత అన్నారు. లాఠీ చార్జీ చేసినా కార్యకర్తలు వెరవలేదు : ఆనం విజయకుమార్ రెడ్డి, మేరగ మురళి వైయస్ జగన్ నెల్లూరు వస్తుంటే వారికి స్వాగతం పలకడానికి వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైయస్ జగన్ మీద ప్రజల్లో ఉన్న వెలకట్టలేని అభిమానానికి నెల్లూరు జిల్లా పర్యటన ప్రత్యక్ష ఉదాహరణ. సూళ్లూరుపేట నుంచి ఉదయగిరి వరకు ప్రధాన రహదారులను మూసేశారు. వేలమంది వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు రెండు రోజుల ముందు నుంచే నోటీసులిచ్చారు. కేసులు పెడతామని బెదిరించారు. పోలీసుల ఆంక్షలు, బెదిరింపులను తట్టుకుని, కేసులను లెక్కచేయకుండా వైయస్ కోసం వచ్చారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లాఠీ చార్జీ చేసినా మా కార్యకర్తల ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదు. వైయస్ జగన్ పర్యటనకు వచ్చిన ప్రజాభిమానాన్ని చూసి కూటమి నాయకులు ఓర్వలేక మీడియా ద్వారా వారి అక్కసు వెళ్లగక్కుతున్నారు. వాహనాలు ఏర్పాటు చేసి తరలించిన ప్రజాభిమానం కాదని వారికీ అర్థమైపోయిందని పార్టీ నేతలు అనం విజయకుమార్ రెడ్డి, మేరగ మురళిలు అన్నారు.