అనంతపురం : చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడిలో వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి హాజరై ఏడాదిగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్లు ఆవిష్కరించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..`ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారు. ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది కాలంలో ఒక్క హామీని అమలు చేయలేదు. సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ప్రజలకు రూ.81 వేల కోట్లు బాకీ పడింది. ప్రజల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాటం చేయడం వల్ల తల్లికి వందనం పథకాన్ని అరకొరగా అందించారు. ఇంకా లక్షలాది మందికి పథకం అందలేదు. 2024–25 సంవత్సరంలో తల్లికి వందనంను చంద్రబాబు ఎగ్గొట్టారు. రైతుకు ఆర్థిక సాయం అందించాలని కోరితే ‘మోదీ ఇస్తేనే’ నేను ఇస్తానని చంద్రబాబు అంటున్నాడు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందలేదు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని ఇవ్వలేదు. భవిష్యత్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తే రాజు.. వాళ్లు చెప్పిందే జరుగుతుంది. ఇది వైయస్ జగన్ మాట. ఎమ్మెల్యే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉన్నాయి. గతంలో ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే టీడీపీ నాయకులు బయటకు వచ్చారు. కానీ మనం ప్రజల తరఫున ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాం. రాజకీయ పార్టీ గానీ, రాజకీయ నాయకులు, కార్యకర్తలు గానీ అధికారం కోసం మాత్రమే కాదు.. సమాజ అభ్యున్నతి కోసం పని చేయాలి. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మనం ఉండాలి. వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.17500 ఇచ్చాం. గత ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామని చెప్పినా చంద్రబాబు ఇవ్వలేదు. చంద్రబాబు మోసాల వల్ల ఎంత నష్టం జరిగిందో ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలి. గ్రామ స్థాయిలోని ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రజాప్రతినిధులు ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పాల్గొనాలి. క్యూ ఆర్ కోడ్‌తో ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు ఎక్కడకు వెళ్లాయి?. గతంలో వైయస్ జగన్ నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించారు. ప్రతి పైసా ప్రజలకు పారదర్శకంగా చేరింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రకృతి సహకరించడం లేదు. వర్షాలు కురవడం లేదు. కూటమి ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడుతోంది. గత ఏడాదికి సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. పంటల బీమా ప్రీమియం 60 శాత మంది రైతులు కట్టలేదు. జగన్ హయాంలో ప్రభుత్వమే ఉచిత బీమా అందించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైయస్ హయాంలో 18 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయ్యేవి. ఆ తర్వాత క్రమంగా 13 లక్షల ఎకరాలకు తగ్గింది. కానీ ఇప్పుడు 48 వేల ఎకరాల్లో మాత్రమే విత్తనం వేశారు. పరిస్థితి దారుణంగా ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు ఇసుక, మట్టి, మద్యం అమ్ముకుందాం అనే రీతిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 10 కోట్లు పెట్టాను? రూ.20 కోట్లు పెట్టాను అంటూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రత్యేక రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. అధికారులను చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నారు. ప్రశ్నిస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని బెదిరిస్తున్న పరిస్థితి ఇక్కడుంది. ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడదాం. మనలో అభిప్రాయ భేదాలు ఉంటే పక్కన పెట్టండి. గత ఎన్నికల్లో మన ఓడిపోయామంటే అందులో మన తప్పులూ ఉన్నాయి. మళ్లీ అలాంటివి పునరావృతం కాకూడదు. ఐకమత్యంతో వెళ్దాం. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుదాం. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇక ఆరు నెలలు మాత్రమే ఉంది. అందుకే వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని టీడీపీ కుట్ర చేస్తోంది. వాటిని గట్టిగా ఎదుర్కొందాం. ఇప్పటికే వైయస్ జగన్ చుట్టూ ఉన్న అధికారులు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మనమంతా ఎదుర్కొందాం. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా మేం ముందుంటాం. సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్‌గా ఉండాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయాలి` అని అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దిలిప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.