ఇసుకపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా?

మంత్రి పెద్దిరెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

అమరావతి: ఇసుకపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు. టీడీపీ హయాంలో ఇసుకను పెద్ద ఎత్తున దోపిడీ చేశారని విమర్శించారు. చంద్రబాబు 17 సార్లు ఇసుక పాలసీపై జీవోలు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబు నివాసం ఉండే కరకట్ట వద్దే పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా చేశారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వనజాక్షిని కొట్టింది చంద్రబాబు హయాంలోనే కదా అన్నారు. వనజాక్షి, చింతమనేనిని చంద్రబాబు పిలిచి పంచాయితీ చేశారని ధ్వజమెత్తారు. వంశధార, నాగావళి, పెన్నాలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేశారని ధ్వజమెత్తారు.  

 వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, మైనింగ్‌ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీపీటీ(పవర్ పాయింట్ ప్రజెంటేషన్) ద్వారా, ఇసుక పాలసీపై పూర్తి గణాంకాలతో సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో జరిగిన దోపిడీ- వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక పాలసీ, తద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని మంత్రి వివరించారు.

ఇసుకపై బాబు, లోకేశ్‌ల ఓవరాక్షన్ః
ఇసుక తవ్వకాలు, అక్రమాలంటూ చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్‌ ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. అనుమతులున్న ఓపెన్‌ రీచ్‌ల దగ్గరకు కూడా వెళ్లి సెల్ఫీలంటూ వాళ్లు ఓవర్‌ యాక్షన్‌ చేయడం అందరూ చూస్తున్నారు. ఇసుక దోపిడీపై మాకు గడువిచ్చామని.. 48 గంటల్లో సమాధానం చెప్పకపోతే.. తదుపరి చర్యలుంటాయని రంకెలేస్తున్నారు. అనుమతులున్న ఇసుక రీచ్‌ల దగ్గరకు పోయి టీడీపీ నేతలు ధర్నాలు చేయడాన్ని చూశాం. అందుకే, ఈ సందర్భంలో ఇసుక పాలసీకి సంబంధించి ఎవరి హయాంలో ఏం జరిగిందనేది నేను పీపీటీ ద్వారా వివరిస్తున్నాను.  

బాబు హయాంలో 19 జీవోలతో దోపిడీః
ఇసుక గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. బాబు ఐదేళ్ల పాలనలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారంగా జరిగాయి. ఇసుక పాలసీకి సంబంధించి ఆయన హయంలో దాదాపు 19 సార్లు జీవోలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా జీవోలను మార్చుకుని మైనింగ్‌ దోపిడీ ఎలా చేశారనేది.. అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు చేరిన ఆదాయమేంటి..? ఇప్పుడున్న ఆదాయమేంటనేది మేమూ పీపీటీ ద్వారా వివరిస్తున్నాం. 

పేరుకే ఉచితం.. బ్లాక్ మార్కెట్ తో రాష్ట్ర ఖజానాకు సున్నంః
చంద్రబాబు ఇసుక పాలసీపై మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఆయన నోటి వెంట ఇసుక దోపిడీ గురించి మాటలు వినిపిస్తుంటే.. దొంగే.. దొంగా దొంగా.. అని కేకలేసినట్లుగా ఉంది. 2014 నుంచి 2019 వరకు కృష్ణానది కరకట్ట మీదనున్న చంద్రబాబు ఇంటి వెనుకే కృష్ణా నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరగలేదా..? అని ప్రశ్నిస్తున్నాను. మొదట్లో డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక సప్లై అన్నాడు. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం అన్నాడు. పేరేమో ఉచితమన్నాడు గానీ.. ఇసుక బ్లాక్‌మార్కెట్‌ ను అమాంతం పెంచి ప్రభుత్వ ఖజనాకు సున్నంపెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పుకోవాలి. నాడు పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే.. సామాన్యులకు ఇసుక దొరక్క, టీడీపీ నేతలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. 

టీడీపీ హయాంలో నెలవారీ మామూళ్ళుః
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాల్ని జరిపారు. నెలవారీగా తమకు ఆదాయవనరుల్లో ఇసుకను ఒక భాగంగా చేసుకున్నారు కనుకే.. పశ్చిమగోదావరి జిల్లాల్లో అప్పట్లో తహశీల్దార్‌ వనజాక్షి గారు ఇసుక అక్రమ తవ్వకాల్ని అడ్డుకుంటే ఆమెపై దాడిచేశారు. ప్రభుత్వ అధికారిణి అని కూడా చూడకుంటా ఆమెను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఈడ్చిపడేశాడు. అప్పట్లో వారిద్దర్నీ రాష్ట్ర సచివాలయానికి పిలిపించుకుని రాజీ చేసింది ఈ చంద్రబాబు కదా..? మహిళా అధికారిణిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. బాధితురాల్నే బెదిరించి రాజీచేసిన నీచుడు చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. 

లోకేశ్‌కు ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పంః
 చంద్రబాబు హయాంలో, ఇసుక అక్రమ తవ్వకాలపై, ఎవరైనా ఫిర్యాదు చేయాలన్నా అది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా చేశాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి అనుచరుల్ని పెట్టి కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, గోదావరి నదుల్లో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేశారు. ఇదంతా చంద్రబాబు కొడుకు లోకేశ్‌ కనుసన్నల్లోనే జరిగిందని.. ఆయనకు ఇసుక దోపిడీకి సంబంధించి ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం కట్టి మరీ ఇసుకమాఫియా ముఠా వ్యాపారం చేసిందని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలుసు.

బాబు హయాంలో ఎన్‌జీటీ రూ.100 కోట్ల జరిమానాః
శ్రీకాకుళం దగ్గర్నుంచి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) విచారణ కూడా జరిపింది. అప్పట్లో ఇసుక తవ్వకాలపై ఆధారాలు రుజువైనందునే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్‌జీటీ తీర్పు సైతం వచ్చింది. దాదాపు రూ.100 కోట్ల జరిమానాను విధిస్తూ తీర్పిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు ఇంటి వద్ద కరకట్ట పక్కన జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆధారాల్ని కూడా అప్పట్లో ఎన్‌జీటీ పరిగణలోకి తీసుకుంది. మరి, ఎన్‌జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడు..? 

పారదర్శక ఇసుక పాలసీని జగన్‌ గారే తెచ్చారుః
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసుకుని కొనుగోలు చేసుకునే మెరుగైన పారదర్శక ఇసుక పాలసీని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేశాం. ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నాం. జగన్‌ గారు ఇసుక తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది నూతన పాలసీని తేవడం జరిగింది. ఇసుకపై 04.09.2019న మెరుగైన నూతన పాలసీని తెచ్చారు. ఆ తర్వాత ఈ పాలసీపై 17.07.2020న మంత్రుల సబ్‌కమిటీ నియమించి ప్రజాభిప్రాయసేకరణ చేసి ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. దీంతో మరింత మెరుగైన ఇసుక విధానంపై 12.11.2020న జీవో.నెం. 78ను జారీ చేశాం. పాలసీ అమలును పరిశీలిస్తూనే.. నిబంధనల్లో మార్పులు చేస్తూ మరలా 16.04.2021న జీవో నెం. 25ను తెచ్చాం. ప్రస్తుతం ఇదే జీవో ద్వారా ఇసుక పాలసీని కొనసాగిస్తున్నాం. 

కేంద్రప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే టెండర్లుః
ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో టీడీపీ మాదిరిగా మేము దొంగచాటుగానో.. ఎవరికీ తెలియకుండానో టెండర్లు ప్రక్రియను పూర్తిచేయలేదు. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన మెటల్‌ అండ్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) ద్వారా టెండర్లును ఆహ్వానించడం, నిర్వహణ, పర్యవేక్షణ జరుగుతుంది. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేలా అవకాశమిచ్చాం. అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి.. అత్యధిక బిడ్‌ కోట్‌ చేసిన జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి టెండర్‌ను ఖరారు చేయడం జరిగింది. 

చంద్రబాబు,రామోజీ టెండర్లలో పాల్గొనలేదేం..?
ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబు, రామోజీరావులు అప్పట్లో ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ఎందుకు పాల్గొనలేదు..? రామోజీ కూడా పెద్ద వ్యాపార వేత్తనే కదా.. మరి ఆ టెండర్‌లో పాల్గొంటే.. ఎంత పారదర్శకంగా ఇసుక టెండర్‌ ప్రక్రియ జరుగుతుందో స్వయంగా తెలుసుకునే వారు కదా..? ఇలాంటి పారదర్శక పాలసీని చంద్రబాబు గతంలో ఏనాడైనా తెచ్చాడా..? అని నిలదీస్తున్నాను. దీనిపై దమ్ముంటే చంద్రబాబు, రామోజీ సమాధానం చెప్పాలి. 

టన్ను రూ. 475కే..
ఇంత పారదర్శకంగా ఇసుక పాలసీని తెస్తే చంద్రబాబు, పచ్చమీడియా కలిసి రోజుకో పిచ్చి ప్రేలాపన చేస్తుంది. రకరకాలుగా ఆరోపణలతో కథనాలు రాస్తున్నాయి. ఇసుక నూతన పాలసీ ప్రకారం ఒక కంపెనీ టెండర్‌ దక్కించుకుంది. ఎక్కడ తవ్వకాలు జరిపినా అదే కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆ కంపెనీ అక్కడ తవ్వుతుంది..? ఇక్కడ తవ్వుతుంది..? అన్న వాదనలకు ఆస్కారం ఎక్కడుందని అడుగుతున్నాం. ఈ కంపెనీ ప్రస్తుతం టన్నుకు రూ.375 ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. దీనిపై వారు రూ.100 కలుపుకుని టన్ను ఇసుకను రూ.475కు అమ్ముకుంటున్నారు. వారు కలుపుకుంటున్న రూ.100లోనే అడ్మినిస్ట్రేషన్‌ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయం మొత్తాన్ని భరించుకోవాల్సి ఉంటుంది. మరి, టీడీపీ నేతలు, చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఇసుకకు సంబంధించి ఏదో జరిగిపోతుందని ఎందుకు ఆరోపణలు చేస్తుంది..? అని అడుగుతున్నాను. 

ఇసుక సొమ్మంతా బాబు, లోకేష్ జేబుల్లోకే...
ఇసుక నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం వస్తుంది. అంటే, ఐదేళ్లకు రూ.3825 కోట్లు జమ అవుతున్నాయి. మరి, చంద్రబాబు హయాంలో ఇన్ని వేల కోట్లు ఏమయ్యాయి..? ఎక్కడ జమ అయ్యాయి..? లోకేశ్‌ జేబులోనా... చంద్రబాబు జేబులోనా..? అని నిలదీస్తున్నాను. ఇంత ఆదాయం ప్రభుత్వం కోల్పోయినప్పుడు ప్రశ్నిస్తానన్న నేతలు గానీ.. మీడియా గానీ ఎందుకు కళ్లుమూసుకుంది. అప్పట్లో టెండర్లు ఎందుకు పిలవలేదు..? ఇలాంటి మెరుగైన పారదర్శక విధానాన్ని చంద్రబాబు ఎందుకు తేలేదు..? దీనిపై వారు సమాధానం చెప్పాలి.

ఇసుక తవ్వకాల అక్రమాలపై ఉక్కుపాదంః
ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్రమాలు ఎక్కడైనా జరిగితే... ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు కఠిన చట్టాల్ని సైతం అమలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎవరైనా ఎక్కువ అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకునేలా వ్యవస్థను నడిపిస్తున్నాము. అటువంటివారికి రూ.2 లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన చట్టాన్ని తెచ్చాం. అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేయాలన్నా టోల్‌ఫ్రీ నెంబర్‌ 14500ను అందుబాటులో ఉంచి ప్రచారం కూడా చేయిస్తున్నాం. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్ఈబీ) ద్వారా ఇప్పటికే 18వేల కేసులు నమోదు చేశాం. 6.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను సీజ్‌ చేయడం జరిగింది. చాలామందికి శిక్షలు కూడా పడటం జరిగింది. మరి, చంద్రబాబు హయాంలో ఇలాంటి కఠిన చట్టాలు అమలు చేయడం, జరిమానాలు, శిక్షలు విధించడం చేశారా..? నాడు ఆయన హయాంలో పట్టాభూముల్లో కూడా ఇసుకను యథేచ్ఛగా తవ్వుకుని అమ్ముకున్న దాఖలాలున్నాయి.    

ఇసుక కొరత లేకుండా చూస్తున్నాం...
ఇసుక కొరత, అక్రమ తవ్వకాలు అంటూ.. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని మేం ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు రాష్ట్రంలో నిర్మాణ రంగానికి అండగా ఉన్నారు. వర్షాకాలంలో కూడా ఎక్కడా ఇసుక కొరత రాకుండా అన్నిరకాల జాగ్రత్త చర్యలు చేపట్టి.. ఎండాకాలంలోనే స్టాక్‌యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచేలా ఆదేశాలిచ్చారు. కనుకే, ఇప్పటి వరకు మాకు ఇసుక దొరకడం లేదని ఎవరూ చిన్నపాటి కంప్లైంట్‌ కూడా చేయలేదు. ఇసుక కొరత రాష్ట్రంలో లేనేలేదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపుపై చెక్‌పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘాను కట్టుదిట్టం చేశాం.  

చంద్రబాబుకు బంపర్‌ఆఫర్ః
ఇసుకపై చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. సంబంధంలేని అంశాలతో శిరోముండనం అంటూ ముడేస్తాడు. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇసుకకు ఏం సంబంధం ఉంది. ఆయన మతిచలించి మాట్లాడుతున్నాడు..? ఒక్కపక్కన లోకేశ్‌ ఏమో ఇసుక దోపిడీ రూ.4వేల కోట్లంటాడు. చంద్రబాబునేమో రూ.40వేల కోట్ల ఇసుక అక్రమాలంటాడు. కనుక, ఈ ఆరోపణలన్నీ పక్కనబెడితే.. ప్రభుత్వానికి రూ.4వేల కోట్లు ఇస్తే ఇసుక కాంట్రాక్ట్‌ను మొత్తం చంద్రబాబుకే అప్పగిస్తాం. ఆయనకు ఇది మా బంపర్‌ ఆఫర్‌. 

బాబూ.. వాస్తవాలివిగో..
ఈ నాలుగున్నరేళ్లలో ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70 కోట్ల టన్నులు ఇసుకను తవ్వితే మొత్తం రూ.2300 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. బాబు అడుగుతున్న జీఎస్టీ లెక్కలతో ప్రభుత్వానికేం సంబంధం ఉంటుంది. ఆ కాంట్రాక్టు సంస్థ కేంద్రానికి చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 136 స్టాక్‌ పాయింట్లు ఉంటే.. వాటిల్లో ఇప్పుడు సుమారు 64 లక్షల టన్నుల ఇసుక నిల్వలున్నాయి. ప్రస్తుతం 110 ఓపెన్‌రీచ్‌ల్లో సుమారు 77 లక్షల టన్నుల తవ్వకాలకు ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌లున్నాయి. కానీ, వరదలు, వర్షాల కారణంగా కొన్నిచోట్ల తవ్వకాలు నిలిచిపోయాయి. 42 డీసెల్టింగ్‌ పాయింట్లలో జరుగుతున్న ఇసుకకు సంబంధించి 90 లక్షల టన్నులకు అనుమతులున్నాయి. 

మైనింగ్‌ ఆదాయంలో పురోగతిః
మైనింగ్‌ రెవెన్యూ విషయానికొస్తే జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన నూతన సంస్కరణలు మెరుగైన ఫలితాల్ని తెచ్చిపెట్టాయి. చంద్రబాబు పాలనలో కంటే ఇప్పుడు మైనింగ్‌ రెవెన్యూలో చాలా పురోగతిని సాధించామని చెబుతున్నాం. 2018–19లో అంటే చంద్రబాబు హయాంలో రూ.1950 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తే.. 2022–23 నాటికి అంటే, ఇప్పుడు జగన్‌ గారి హయాంలో రూ.4756 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఏపీఎండీసీ విషయానికొస్తే చంద్రబాబు ఉన్నప్పుడు (2018–19) రూ.833 కోట్లు వస్తే.. మా హయాంలో (ప్రస్తుతం) రూ.1806 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి చేరింది. 
-ఇలా మేము ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సంస్కరణలతో ముందుకు పోతున్నాం. మరోవైపు  చంద్రబాబు మాత్రం అసత్యాల్ని అల్లుతూ ప్రభుత్వంపై బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు అధికారం లేదనే తీవ్రమైన ఫ్రస్టేషన్‌తో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఉన్నాడు. 
-ఇసుక తవ్వకాలపై గతంలో పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు కూడా మాట్లాడినప్పటికీ.. వారిద్దరికీ ఈ విషయంపై అంతగా అవగాహన ఉండదు కనుక పెద్దగా పట్టించుకునేదిలేదు. చంద్రబాబు ఊహాజనితమైన లెక్కలతో ఆరోపణలు చేసి తన స్థాయిని మరింత దిగజార్చుకోవద్దని.. ఇలాగే మాట్లాడితే.. ప్రజల చేతుల్లో పరాభవం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నాను. 

 జేపీ కాంట్రాక్టు కాలపరిమితి ఏడాది పెంపుః
జేపీ పవర్‌ వెంచర్స్‌ కంపెనీ కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాదికి పొడిగించాం. ఆ ఉత్తర్వులతోనే ప్రస్తుతం జేపీ సంస్థ తవ్వకాలు జరుపుతుంది. సబ్‌ కాంట్రాక్టు అగ్రిమెంట్లతో ప్రభుత్వానికి ఏమీ సంబంధంలేదు. ప్రభుత్వంతో కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీ, వారికి అనుబంధంగా ఇతర సంస్థలకిచ్చిన సబ్‌కాంట్రాక్టుల వ్యవహారాలు కూడా మా దృష్టికి రాలేదు. 

Back to Top