తాడేపల్లి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కూటమి ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారుల అమానుష వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందని .. ఇది ప్రభుత్వం, వ్వవస్ధల పనితీరుకు చెంపపెట్టు అని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అయన పార్టీ లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డిలతో కలిసి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంలో కేవలం కిందిస్థాయి అధికారులైన సీఐ నాగరాజు, కొద్దిమంది సిబ్బందిపై చర్యలతో చేతులు దులుపుకుని అసలు సూత్రధారులైన డీజీపీ, విజయవాడ సీపీ సహా ప్రభుత్వ పెద్దలను రక్షించేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా కుమ్మక్కైందని పేర్కొన్నారు. కేసును తూతూమంత్రంగా ముగించే ప్రయత్నాలను అడ్డుకుంటూ తాము మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేస్తే, నిందితులుగా తేలాల్సిన అధికారులు ఆగమేఘాల మీద హైకోర్టు నుంచి ఎక్స్‌పార్టీ స్టే తెచ్చుకున్నారని వివరించారు. ఈ అన్యాయంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. లాకప్ డెత్ ఉదంతంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, 'ఏపీ డీజీపీ నిద్రపోతున్నారా?' అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు గట్టి మొట్టికాయలు వేసిందని వైయస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఏపీ హైకోర్టులోని మొత్తం పిటిషన్ల రికార్డులను సీల్డ్ కవర్‌లో తక్షణమే తమకు పంపాలని ఆదేశిస్తూ, అక్కడ నడుస్తున్న విచారణను నిలిపివేసి తానే స్వయంగా కేసును విచారణకు స్వీకరించిందని వెల్లడించారు. అంతేకాకుండా అక్టోబర్ 12న డీజీపీ తదితర అధికారులను స్వయంగా తమ ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసిందని తెలియజేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ బాధితుడు కన్నీరు పెట్టినా వారి పక్షాన వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఎల్లప్పుడూ ముందుంటుందని... బాధితుల హక్కుల కోసం, రాజ్యాంగ విలువల రక్షణ కోసం లీగల్ టీమ్ న్యాయపోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తుందని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఎవరేమన్నారంటే... *అధికార మదంతో చేసిన పాపాలు వెంటాడక తప్పవు - పొన్నవోలు సుధాకర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ: అధికారం అనేది తాటిచెట్టు కింద నీడ లాంటిది మాత్రమే. అది ఎల్లకాలమూ ఉండదు. అధికారం మారిన రోజు ఎవరైతే అరాచకాలు చేశారో, ఆ పాపాలు వారిని కచ్చితంగా వెంటాడుతాయి. మే నెలలో ఎన్‌బీడబ్ల్యూ (నాన్ బెయిలబుల్ వారెంట్) అమలు చేయాలనే మిషతో సాయికృష్ణ అనే అభాగ్యుడిని మార్కాపురం నుంచి టాస్క్‌ఫోర్స్ పట్టుకొచ్చింది. నిజానికి ఎన్‌బీడబ్ల్యూ అమలు చేయాల్సింది సంబంధిత పోలీస్ స్టేషన్ పోలీసులు మాత్రమే. కానీ పోలీస్ కమిషనర్ చేతిలో ఉండే టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగడంతోనే అసలు కుట్ర మొదలైంది. కొడుకు ఆచూకీ కోసం స్టేషన్‌కు వెళ్లిన తల్లిని సీఐ నాగరాజు బెదిరించి, కొట్టబోయి గెంటేశారు. లాకప్‌లో కొడుకు అరుపులు విని పరుగెత్తి చూస్తే, అప్పటికే జీవచ్ఛవంలా పడి ఉన్న బిడ్డను చూసి ఆమె ప్రాధేయపడినా కనికరించలేదు. ఆ తర్వాత రాణిగారి తోటలోని ఓ పాడుబడిన బూత్ బంగ్లాలో బంధించి చిత్రహింసలు పెట్టి చంపేశారు. చంపేయడమే కాకుండా, కనీసం ఆ తల్లికి గుప్పెడు బూడిద కూడా ఇవ్వకుండా చేశారు. మే 28న ఆ తల్లి డీజీపీ, సీపీలకు మెయిళ్లు పంపినా నిద్ర నటిస్తూ తప్పించుకున్నారు. జూన్ 15న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వస్తే.. అసలు సాయికృష్ణ ఎవరో తమకు తెలియదని డీజీపీ, సీపీలు పచ్చి అబద్ధాలు చెప్పారు. జూన్ 18న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు బాధితురాలి ఇంటికి వెళ్లి అండగా నిలబడ్డాకే పోలీసుల్లో చలనం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో జూన్ 19న కేసు నమోదు చేసి, సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సీఐ రిమాండ్ రిపోర్టులోనే మే 6న టాస్క్‌ఫోర్స్ పట్టుకొచ్చి కృష్ణలంక పీఎస్‌కు అప్పగించిందని ఒప్పుకున్నారు. మరి జూన్ 15న హైకోర్టుకు ఎందుకు అబద్ధాలు చెప్పారు? పోలీసులే జడ్జి, పోలీసులే ఇన్వెస్టిగేటర్, పోలీసులే ముద్దాయిలుగా మారినందునే మేము ప్రైవేట్ కంప్లైంట్ వేశాం. మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించగానే దొడ్డిదారిన హైకోర్టులో ఎక్స్‌పార్టీ స్టే తెచ్చుకున్నారు. దీనిపై మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం. నేడు సుప్రీంకోర్టు ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల రికార్డులన్నింటినీ సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు పంపాలని ధర్మాసనం సంచలన ఆదేశాలు ఇచ్చింది. 'ఏపీ డీజీపీ నిద్రపోతున్నారా?' అని సుప్రీంకోర్టు అత్యంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు ఆధారాలను మాయం చేసేందుకు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేయడం అత్యంత దారుణం. తన కొడుకును అన్యాయంగా చంపేసి, కనీసం బూడిదను కూడా ఇవ్వకుండా ఆ తల్లి కడుపుకోత మిగిల్చిన రాక్షసులు ఈ అధికారులు. కేసులో అసలు సూత్రధారులు, ప్రోత్సహించిన పెద్దలు ఎవరనేది తేలాల్సిందే.. అక్టోబర్ 12న సుప్రీంకోర్టు ఎదుట అధికారులు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే. "బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న వైఎస్ జగన్ గారి సంకల్పంతో మా లీగల్ టీమ్ అంతా కలిసికట్టుగా పోరాడి వ్యవస్థల అహంకారాన్ని బద్దలు కొట్టింది. *పోలీసులు అడ్డంగా దొరికిపోయారు.. సాక్ష్యాలను మాయం చేశారు: మనోహర్ రెడ్డి* సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడటంలో పూర్తి క్రెడిట్ సీనియర్ కౌన్సిల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికే దక్కుతుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము చివరి వరకు పోరాడాం. అధికార దర్పంతో, మదంతో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులకు ఈ తీర్పు బలమైన గుణపాఠం. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ వ్యవస్థలు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారితే ఎలా బలైపోతాయో చెప్పడానికి ఈ కేసే నిదర్శనం. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అమానుషమైన కేసు. శవమే లేకుండా చేసి, కనీసం బూడిద కూడా ఇవ్వకుండా తప్పుల మీద తప్పులు చేశారు. ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యం సీసీటీవీ ఫుటేజ్. కృష్ణలంక పోలీస్ స్టేషన్, సెంట్రల్ కమాండ్ రూమ్, డీజీపీ ఆఫీస్.. ఈ మూడు ప్రాంతాల్లో లభించాల్సిన సీసీటీవీ ఫుటేజీలను ఉద్దేశపూర్వకంగా మాయం చేసేశారు. డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కై, అధికార పార్టీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటూ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. వీరంతా రేపు న్యాయస్థానాల్లో దోషులుగా నిలబడబోతున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో సమగ్ర విచారణ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఎల్లప్పుడూ బాధితుల పక్షాన, పార్టీ క్యాడర్ పక్షాన పోరాడుతుంది. *రక్షణగా ఉండాల్సిన వ్యవస్థే కంచె చేను మేసినట్లయింది: సుదర్శన్ రెడ్డి* సాయికృష్ణ హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కనీస నిజాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నేటికీ తేల్చలేకపోయింది. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన పోలీస్ వ్యవస్థే కంచె చేను మేసినట్లు వ్యవహరించి ఒక మనిషిని హత్య చేసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించేంత వరకు ప్రభుత్వం కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగినప్పుడే, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని నేనే స్వయంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సమర్థవంతంగా వాదనలు వినిపించారు. కేసులో పైస్థాయి అధికారుల ప్రమేయం ఉన్నా, కేవలం ఒక ఇన్‌స్పెక్టర్‌ను, కొందరు కానిస్టేబుళ్లను మాత్రమే బలిపశువులను చేసి కేసు మూసేయాలని చూశారు. బాధిత తల్లితో సీబీఐ పిటిషన్‌ను బలవంతంగా విత్‌డ్రా చేయించేలా ప్రభుత్వ పెద్దలు, పోలీసులే తెరవెనుక ఒత్తిడి తెచ్చారు. మేజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం రికార్డు కాకుండా అడ్డుకోవడానికి ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా హైకోర్టు నుంచి ఎక్స్‌పార్టీ స్టే తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు డీజీపీని మందలించి, వ్యక్తిగత హాజరుకు ఆదేశించడం చూస్తుంటే ఈ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉందన్న భరోసా కలుగుతోంది. చిన్న గొడవలకు కూడా హత్యాయత్నం కేసులు పెట్టి, అక్రమంగా రౌడీషీట్లు తెరుస్తూ వేధిస్తున్న ఈ ప్రభుత్వ అరాచకాలపై వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాజీలేని పోరాటం చేస్తుంది.