వైయస్ఆర్ జిల్లా: జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ సందర్శనకు సిద్ధమైన వైయస్ఆర్‌సీపీ నాయకులు పోలీసులు ఆంక్షల పేరుతో అడ్డుకున్నారు. సందర్శన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్లాంట్ సందర్శనకు అనుమతి లేదంటూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పరిస్థితులు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమ కార్యకలాపాలపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్లాంట్‌ను సందర్శించాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. కార్యక్రమాన్ని అడ్డుకునే ఉద్దేశంతో జమ్మలమడుగులోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ప్రజా సమస్యలు, పరిశ్రమల పరిస్థితులపై తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు వెళ్లడాన్ని కూడా ప్రభుత్వం సహించలేకపోతోందని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహించాలనుకున్న కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రతిపక్ష నాయకుల కదలికలపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు విమర్శించాయి. అయినప్పటికీ ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని, పరిశ్రమల అభివృద్ధి, స్థానికుల ప్రయోజనాల కోసం వైయస్ఆర్‌సీపీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు.