కృష్ణా జిల్లా: మంత్రి కొల్లు రవీంద్ర తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తన కుమారుడు పేర్ని కిట్టును గంజాయి బ్యాచ్‌తో సంబంధం ఉన్న వ్యక్తిగా పదేపదే చిత్రీకరించడం మానుకోవాలని హెచ్చరించారు. తన కుమారుడిపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే నిరూపించాలని, లేనిపక్షంలో పరువునష్టం దావాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. తన కుమారుడి కోసం పార్టీలో ఇతరులను తొక్కేస్తున్నానంటూ ప్రచారం చేయడం సరికాదని పేర్ని నాని అన్నారు. నడికుదిటి నరసింహారావుకు అల్లుడు కాకపోతే కొల్లు రవీంద్రకు ఉన్న రాజకీయ అర్హత ఏమిటని ప్రశ్నించారు. ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తన కుమారుడికి రాజకీయ సామర్థ్యం లేదని భావించడం సరికాదని పేర్కొన్నారు. తండ్రీకొడుకులిద్దరినీ జైలులో పెడతానంటూ పలుమార్లు మాట్లాడారని, దొంగ పట్టాలు ఇచ్చానంటూ తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. నిజంగా తాను అక్రమాలకు పాల్పడితే ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తన కుమారుడిపై గంజాయి ఆరోపణలు చేస్తున్న కొల్లు రవీంద్రకు, ఆయన పోలీసులకు నిజాలు బయటపెట్టే ధైర్యం లేదా అని పేర్ని నాని నిలదీశారు. గంజాయి, బెల్టు షాపులు, లైసెన్స్ లేని మద్యం విక్రయాలకు పాల్పడేవారు మంత్రి చుట్టూనే ఉన్నారని ఆరోపించారు. తప్పుడు వ్యాఖ్యలు చేయడం మానుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తన కుమారుడిపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి కొల్లు రవీంద్ర క్షమాపణ చెప్పాల్సిన రోజు వస్తుందని పేర్కొంటూ, చేతనైతే వచ్చే ఎన్నికల్లో పేర్ని కిట్టుపై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.