అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటుచేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయానికి మధ్దతుగా రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. వరుస మూడో రోజు విద్యార్దులు, మహిళలు సంఘీభావ ర్యాలీఉ నిర్వహించారు. నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ..పౌరసరఫరాలశాఖమంత్రి కొడాలినాని ఆధ్వర్యంలో గుడివాడలో ర్యాలీ నిర్వహించారు. గుడివాడలో బస్ స్టేషన్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ జరిగింది.ఈ సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం. ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్ పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ విజయవాడ ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ నుంచి డిఆర్ ఆర్ కాంప్లెక్స్ వరకు విద్యార్ధులు,యువజనసంఘాలనేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పునియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.రాష్ర్ట అభివృధ్దికి జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ తోడ్పడుతుందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. పెడన నియోజకవర్గ ఎంఎల్ఏ జోగి రమేష్ ఆధ్వర్యంలో బంటుమిల్లిలో భారీ ప్రదర్శన జరిగింది.నూతన జిల్లాలను ఏర్పాటుచేయడం ద్వారా రాష్ర్టం అభివృధ్ది దిశగా పరిగెడుతుందని జోగి రమేష్ అభిప్రాయపడ్డారు.ఎన్టీఆర్ పేరు కృష్ణాజిల్లాకు పెట్టడం ద్వారా శ్రీ వైయస్ జగన్ రాష్ర్ట అభివృధ్దికి విశాల దృక్పధంతో వ్యవహరిస్తారనేందుకు నిదర్శనం అన్నారు. తిరువూరు నియోజకవర్గ కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటుచేయడాన్ని స్వాగతిస్తూ ఏ కొండూరు మండలం కంభంపాడులో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చిత్రపటానికి ఎంఎల్ఏ కొక్కిలగడ్డ రక్షణనిధి పాలాభిషేకం చేశారు.అనంతరం పాదయాత్ర నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గంలో ఎంఎల్ ఏ కొలుసు పార్ధసారధి నేత్వత్వంలో కానూరు నుంచి యనమలకుదురు వరకు మోటారు బైక్ ర్యాలీ జరిగింది.కార్యక్రమంలో కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ పాల్గొన్నారు. కైకలూరులో ఎంఎల్ ఏ దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజన పై చంద్రబాబునాయుడుకు మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర విద్యుత్,అటవీ,శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు శనివారం ఒంగోల్ లోని విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్ లో సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని జిల్లాల పునర్విభజనలో ప్రకాశం జిల్లాలోనే ఉంచినందుకు కృతజ్ఞతలు చెబుతూ సభ ఏర్పాటుచేసి మంత్రి బాలినేని కి పౌరసన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాలినేని మాట్లాడుతూ ఒంగోలు జిల్లాలో చుట్టూ కలిసున్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచాలనే నిర్ణయం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళామని దానికి ఆయన సానుకూలంగా స్పందించి ప్రకాశంలో విలీనానికి ఒప్పుకోవటం గొప్ప విషయం అని అన్నారు.సమావేశానికి ముందు మంత్రి బాలినేని ఇంటి నుండి జిల్లా కోర్టు , సివిఎన్ రీడింగ్ రూమ్ ,మున్సిపల్ ఆఫీస్ మీదుగా కలెక్టరేట్ సెంటర్, ట్రంక్ రోడ్డు మీదుగా ఒంగోలు విష్ణుప్రియ వరకు 200 మోటార్ సైకిల్ , కార్లలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ సెంటర్ లోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆదేశాలు మేరకు మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు కొత్త జిల్లాల ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ ఆలూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైయస్ఆర్ విగ్రహానికి గుమ్మనూరు శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు కడప జిల్లా పులివెందులలో వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వి. రామ్ లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల లో 2వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాదరెడ్డితోపాటు పలువురు కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురంలో ఎంఎల్ఏ అనంతరామిరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి నేతృత్వంలో కేఎస్ఆర్ కాలేజి సప్తగిరి సర్కిల్ లో వినూత్నంగా ధాంక్యూ సిఎం సర్ అంటూ ఆంగ్ల అక్షరాలలో విద్యార్దులు కూర్చుని తమ ధన్యవాదాలు తెలయచేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ది విభాగం నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్యాణ దుర్గం ఎంఎల్ఏ ఉషశ్రీ చరణ్ నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ కల్యాణదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల విద్యార్ధులతో కలిసి కేక్ కట్ చేశారు. Tq CM Sir అంటూ ప్లకార్డులు పట్టుకుని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. పుట్టపర్తి కేంద్రం గా సత్యసాయి జిల్లా ను ప్రకటించినందుకు సీఎం వైయస్ జగన్ కి విద్యార్థి లోకం తరుపున కృతఙ్ఞతలతో.. కదిరి లో విద్యార్దులు ర్యాలీ నిర్వహించారు. R&B బంగ్లా నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ సాగింది. వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పుట్టపర్తిని శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రకటించడాన్ని స్వాగతిస్తూ అమడగూరు మండలం మహామ్మదాబాద్ నుండి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిని జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని వైయస్సార్ విగ్రహనికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి కార్యకర్తలతో కలసి పాలాభిషేకం నిర్వహించారు. నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు లో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. లావేరు జడ్ పి హైస్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన కూడళ్లమీదుగా సాగింది. ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచడంవల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఎచ్చెర్ల శాసనసభ్యులు శ్రీ గొర్లె కిరణ్ కుమార్ అన్నారు.. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, శాసనమండలి సభ్యుడు పెనుమత్స సురేష్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాలో పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మధురవాడలోని వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు మధురవాడ క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహం నుంచి జివిఎంఎసి జోనల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఐదువేలమందితో భారీ చైతన్య ర్యాలీ నిర్వహించారు. మహిళలు, విద్యార్ధినివిద్యార్దులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు ఈ భారీ చైతన్యర్యాలీలో పాల్గొన్నారు.వైయస్సార్ అడుగుడుజాడల్లో నడుస్తూ రాష్ర్టంలో సుపరిపాలన అందిస్తూ ముఖ్యమంత్రి ప్రజల హృదయాలలో నిలిచిపోయారని మంత్రి ముత్తంశెట్టి అన్నారు.భీమిలి పట్టణాన్ని అభివృద్ది చేసే దిశగా సిఎం నిర్ణయం తీసుకోవడం ముదావహం అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించి గుంటూరు జిల్లా నరసరావుపేట ను పల్నాడు జిల్లాగా ప్రకటించిన నేపధ్యంలో సంఘీభావంగా వేలాదిమంది పల్నాటి ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నరసరావుపేట శివుడి బొమ్మ సెంటర్ నుంచి కోటప్పకొండకు పాదయాత్రగా తరలివెళ్లారు.కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల (పల్నాడు జిల్లా ఏర్పాటు)సాకారం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పల్నాటి ప్రజల హృదయాలలో నిలిచిపోతారని నినాదాలు చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు,రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో నూతన జిల్లాల ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ధన్యవాదాలు తెలియచేస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించారు.లాడ్జిసెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన శంకర్ విలాస్ సెంటర్ వరకు సాగింది. కార్యక్రమంలో నగరమేయర్ కావటి మనోహర్, పశ్చిమ శాసనసభ్యులు మద్దాళి గిరి పాల్గొన్నారు. వినుకొండలో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నేతృత్వంలో విద్యార్ధులతో ర్యాలీ జరిగింది.వినుకొండలోని బ్రహ్మనాయుడు కల్యాణమండపం నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన కూడళ్లు మీదుగా సాగింది.జిల్లాల పెంపుతో విద్యార్దులకు మేలు జరుగుతుందని బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.