విశాఖ: నగరంలోని పలు వార్డుల్లో నెలకొన్న మంచినీటి సమస్యపై వైయస్ఆర్‌సీపీ నేత కేకే రాజు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలిసి తాగునీటి సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. నగరంలోని అనేక ప్రాంతాల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. సరఫరా అవుతున్న నీటిలో బురద, పురుగులు వస్తున్నాయని, తాగడానికి సరిపడా మంచినీరు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. విశాఖ నగరంలో మంచినీటి సంక్షోభం నెలకొన్నా పాలకులు మొద్దు నిద్రపోతున్నారని కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా అందడం లేదని, తాగడానికి వాటర్ లేకపోయినా క్వార్టర్ మాత్రం దొరుకుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గోదావరి జలాలను విశాఖ నగరానికి తీసుకువచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజంగా గోదావరి జలాలను విశాఖకు తీసుకువచ్చినట్లయితే నగరంలో మంచినీటి సమస్య ఎందుకు తలెత్తిందని ప్రశ్నించారు. ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కేకే రాజు కోరారు. నాలుగు రోజుల్లో విశాఖ నగరంలోని మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించకపోతే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.