నెల్లూరు: చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల తరహాలోనే ఆయన నిర్వహించిన సూపర్ సిక్స్ సక్సెస్ సభ కూడా సూపర్ ప్లాప్ అయిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. అదే సమయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైందని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు కనీసం యూరియా కూడా సరఫరాచేయలని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చుని ఎరువులు కొరత లేదని చెబుతున్న వ్యవసాయశాఖ మంత్రికి దమ్ముంటే మీడియా సాక్షిగా క్షేత్రస్దాయి పరిశీలకు సిద్దమా అని సవాల్ విసిరారు. రైతు సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు అండ్ టీం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అత్యంత హేయంగా వ్యక్తిగత దాడికి దిగడం పై తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం ఎంత నిర్భంధం విధించినా అన్నదాతల సమస్యల పరిష్కారానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు పాలనలో రైతు రోడ్ల పాలు.... ఇవాళ నెల్లూరు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో కలిసి ఎస్సీ విభాగం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రైతు సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా ఎండగట్టారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు, మంత్రులు ఆయనపై అత్యంత హేయమైన భాషతో దాడికి దిగారు. అందులో భాగంగానే వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడారు. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు... మీడియా సాక్షిగా యూరియా కొరత ఉన్న ప్రాంతాలకు వెళ్దాం, మీ పాలనలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం అని చాలెంజ్ చేస్తే దాన్ని ఎదుర్కునే దమ్మూ, ధైర్యం లేకుండా పోయింది. మిమ్నల్ని రైతులు ఎక్కడ ఎదిరిస్తారో, విరుచుకుపడతారేమోనన్న భయంతో ఏసీ రూములకే పరిమితమై ప్రెస్ మీట్ లు పెట్టడం కాదు అచ్చన్నాయుడు గారూ ? మీరు వాస్తవాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించాలి. మాతో పాటు కమ్యూనిస్టు పార్టీలు, రైతు సంఘాల నాయకులు కూడా యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెబితే... 50 శాతానికి మించి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాం, దానివల్ల బ్లాక్ మార్కెట్ ఏర్పడి యూరియా కొరత వచ్చిందిని నువ్వే స్వయంగా ఒప్పుకున్నావ్ అచ్చన్నాయుడు. మరలా దాన్ని సమర్ధించుకుంటూ 70 శాతం మార్క్ ఫెడ్ ద్వారా ఇచ్చాం, మిగిలినదే ప్రైవేటు వారికిచ్చాం అని మాటమార్చావ్ కదా? మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామం దాటివెళ్లాల్సిన అవసరం రాకుండానే ప్రతి రైతుకు యూరియా అందిస్తే... మీరు వచ్చిన తర్వాత ఆర్బీకేల పేరు రైతు సేవాకేంద్రాలు అని మార్చగలిగారు కానీ.. రైతులకు యూరియా మాత్రం ఇవ్వలేకపోయినందుకు సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతు రొడ్డెక్కాల్సిందే, ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే తప్ప రైతులు గోడు మీకు ఎప్పుడూ పట్టదు. మీరు చెప్పినట్లు అందరికీ సమృద్ధిగా లక్షల టన్నుల యూరియా మీరు తెప్పించినా.. ఆ యూరియా రైతులకు అందడం లేదంటే, అది ఎక్కడికి పోయిందో సమాధానం చెప్పాలి? అంటే యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలించిన మాట వాస్తవం కాదా? రూ.270 లకే యూరియా బస్తా అమ్ముతున్నామని మీరు చెబుతున్నారు.. కానీ గ్రామాల్లో రైతులు మాత్రం మేం రూ.600 కొందామన్నా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డికి సవాల్ ? నెల్లూరు జిల్లాలో గ్రావెల్ విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుందని నేను చెబితే అన్ని అనుమతులతోనే గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతున్నారు. సర్వేపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి మీరు చెబుతున్నట్టు అనుమతులు ఒక్కసారి చూపించాలని కోరుతున్నాను. మీడియాను తీసుకుని గ్రావెల్ మైనింగ్ చోటుకి వెళ్దాం.. మీరు అనుమతులు చూపిస్తే నేను ఇకపై వాటి గురించి మాట్లాడను. ఇక నా మీద సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి సంబంధించి లేఖ కూడా రాశాను. నీకు దమ్ముంటే సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాల మీద సీబీఐ విచారణ నువ్వు సిద్ధమేనా సోమిరెడ్డి ? సీబీఐ ఎవరికి క్లీన్ ఛీట్ ఇస్తే వాళ్లే పోటీ చేద్దాం. గిట్టుబాటు ధర కల్పనలోనూ విఫలం... ఇక గిట్టుబాటు ధర చూస్తే... మీరు ప్రత్తి, పొగాకు, ఉల్లి, మామిడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలేక రోదిస్తున్నారు. దాంతోపాటు నెల్లూరు జిల్లాలో ధాన్యం పుట్టి ధర రూ.19770 అయితే, వర్షాల వల్ల రూ.13వేలకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. రైతు ఎకరాకు రూ.30 వేలు నష్టపోతున్నాడు. ధాన్యం దిగుబడి ప్రారంభమైన దాదాపు రెండు వారాలు అవుతున్నా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. మరో రెండు వారాల్లో నెల్లూరు జిల్లాలో వరి కోతలన్నీ పూర్తవుతాయి. అయినా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతుల నడ్డి విరుస్తున్నారు. ఒక పక్క యూరియా దొరక్క రైతులు పంట పండించుకోలేని పరిస్ధితులు, మరోవైపు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలపిస్తుంటే... వారి గోడు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా నోరెత్తి మాట్లాడే అర్హత నీకుందా అచ్చన్నాయుడూ ? అసలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ఉచ్ఛరించే స్థాయి నీకుందా ? నీ కార్యాలయ అవినీతిపై సమాధానం చెప్పు..? మీ ప్రభుత్వంలో ఏపీ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ గా ఉన్న వ్యక్తిని సాక్షాత్తూ నీ శాఖ కార్యాలయానికి, రైతులకు వ్యవసాయ ఉపకరణాలు సరఫరా చేసే కంపెనీలకు మధ్యవర్తిగా వ్యవహరించమన్న మాట వాస్తవం కాదా? నాసిరకం ఉపకరణాలు సరఫరా చేసి వాటినే మంచి పరికరాలంటూ చెప్పమని వాటికి అదనంగా డబ్బులు ఇప్పించి తద్వారా వచ్చిన డబ్బులను మంత్రికి లంచాల రూపంలో రూట్ చేయమని చెబితే సదరు అధికారి దానికి అంగీకరించకపోతే ఆ పోస్టు నుంచి తనను తప్పించారన్న లేఖపై ఏం సమాధానం చెబుతావు అచ్చన్నాయుడు ? ఇంత నీచమైన స్ధితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారెని విమర్శిస్తారా? నిజంగా మీ దగ్గర వాస్తవాలు ఉంటే మాట్లాడండి. రైతులు ఎరువులు కోసం క్యూలైన్లో నిల్చకుంటే భోజనాలు కోసం వెళ్తే క్యూలైన్లో నిల్చోరా అని కూసావ్, మా ప్రభుత్వ హయాంలో ఏనాడైనా రైతులు ఎరువులు, విత్తనాలు కోసం ఇలా క్యూలైన్లో నిల్చున్నారా? మీరు, మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతుల నడ్డివిరుస్తున్నాయి. మీరు రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకోకపోగా.. పుండు మీద కారం జల్లినట్లు వారిని మరింత అవమానించేలా మాట్లాడుతున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పోరాటం చేస్తుంది. రైతుల పక్షాన నిలబడతాం. పోలీసులతో అణిచివేయాలని చూసినా వెనక్కి తగ్గేది లేదు అని కాకాణి స్పష్టం చేశారు. టీ జే ఆర్ సుధాకర్ బాబు, వైయస్ఆర్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో సమావేశం అయ్యాం. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వం. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డీబీటీ ద్వారా రూ.2.75 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందిస్తే అంటులో రూ.50 వేల కోట్లు మాల, మాదిగ, రెల్లి కులస్ధులకు అందించారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని మాట ఇచ్చి.. మా సామాజిక వర్గాల వారికి కూడా హామీ ఇచ్చారు. రాజ్యాధినేతగా మాకు రావాల్సిన రూ.50 వేలకోట్ల నిధులు అంటే ఏడాదికి రూ.10వేల కోట్లు మాల, మాదిగ, రెల్లి కులస్తులకు చంద్రబాబు బాకీ పడ్డారు. మీ ఫ్రీ బస్ మాకు ఏమాత్రం ఉపయోగకరం కాదు. సూపర్ సిక్స్ పథకాలను తొలి ఏడాది అమలు చేయకపోవడం వల్ల మాకు రూ.10వేల కోట్లు నష్టం వాటిల్లింది. రెండో ఏడాది లో కూడా మీరు అమలు చేస్తున్న పథకాల్లో మాకు భాగస్వామ్యం లేదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మా పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకున్నారు. నాడు-నేడు ద్వారా మా పిల్లలు మంచి స్కూళ్లలో చదువుకున్నారు. దళితులంటే మీకు కోపం కాబట్టి... ఇప్పుడు మీ ప్రభుత్వంలో మాకు అవేవీ లేకుండా పోయాయి. మమ్నల్ని ఉక్కుపాదంతో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మా పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయడం ద్వారా మాకు అన్యాయం చేశావు. ఇలా మాకు జరిగిన అన్ని అన్యాయాల మీద ఇవాల్టి కార్యవర్గ సమావేశంలో చర్చించాం. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మీ మాటలే మా పట్ల మీకున్న చిన్నచూపునకు నిదర్శనం చంద్రబాబూ. మీకు రాజకీయాలు ఎందుకురా అని మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నప్పుడే చంద్రబాబుకు ఓటేయాలంటే మాకు సిగ్గుండాలి. ఈ అంశాల మీద మాట్లాడుకోవడానికే మేం సమావేశమయ్యాం.