డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి

  మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్‌

విజయవాడ: నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులపై విద్యార్థులు చేపట్టిన ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు.
మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలోని లక్ష మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని, దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ మొదటి నుంచి పోరాడుతోందని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను వైయ‌స్ జగన్ ఆధారాలతో సహా ప్రజల ముందుంచారని చెప్పారు. అధికారంలో ఉన్నవారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామానే నిదర్శనమన్నారు.

ఏపీలో డీఎస్సీ నిర్వహణ, నియామక ప్రక్రియలో వైయ‌స్ఆర్‌సీపీ లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయానికి నారా లోకేష్ బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ బాధితులకు న్యాయం కోసం  జూలై 28న వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని , నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.

Back to Top