తిరువూరు : రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, వైయస్ఆర్‌సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో తిరువూరు పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్‌లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు రేగళ్ల మోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, టౌన్, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించేందుకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, పేద మరియు మధ్యతరగతి వర్గాల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పాలన కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన పాలన అందించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని నల్లగట్ల స్వామిదాస్ కోరారు. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.