తాడేపల్లి : దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో ముగ్గురు సీఎంల ముచ్చట నడుస్తోందని.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కేవలం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసమే రూ.109 కోట్ల ప్రజాధనాన్ని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మంచినీళ్లలా ఖర్చుచేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయినా కేవలం ప్రచార ఆర్భాటాలతో పబ్లిసిటీ పీక్, విషయం మాత్రం వీక్ అన్న చందంగా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ లు ముగ్గురు ముఖ్యమంత్రుల్లా వ్యవహరిస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో కోసం జరుగుతున్న ఖర్చును గణాంకాలతో సహా నిలదీశారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన 38 సంక్షేమ పథకాల్లో 34 పథకాలను అడ్డగోలుగా ఎత్తేసిన కూటమి ప్రభుత్వం, మిగిలిన అరకొర పథకాలనే ప్రతి నెలా జిల్లాల వారీగా పదే పదే ప్రారంభిస్తూ ప్రజల సొమ్ముతో ప్రచార ఈవెంట్లు నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు. - రాజకీయాల్లో చంద్రబాబును మించిన బూటకపు స్టార్ లేడు. సినిమాల్లో వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు ఉన్నారు. వాళ్లది నటన వృత్తి. కానీ రాజకీయాల్లో ప్రజాసేవ చేయాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక మాయల మరాఠీగా మారారు. నటనలో, డ్రామాల్లో, బూటకాల్లో చంద్రబాబును మించిన స్టార్ దేశంలోనే లేడు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తెస్తే వివరాలు చెప్పడం ఆనవాయితీ. కానీ 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ' అన్నట్లు ఒకే పథకాన్ని ప్రతి నెలా ఒక్కో జిల్లాలో మళ్లీ మళ్లీ ప్రారంభిస్తూ చంద్రబాబు ఈవెంట్ మేనేజర్‌గా మారారు. నిన్న ప్రకాశం జిల్లాలో జరిగింది కూడా అదే తతంగం. కేడర్‌ను ఉత్తేజపరచడానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. - ఆత్మస్తుతి.. పరనింద.. జగనన్న జపం.. ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి వింత జీవిని ఎక్కడా చూసి ఉండం. వేదిక ఏదైనా ఆయన నోట వినిపించేది మూడే విషయాలు. ఒకటి ఆత్మస్తుతి, రెండు పరనింద, మూడు జగనన్న జపం. 45 ఏళ్ల అనుభవం ఉందని సొంత డబ్బా కొట్టుకోవడం ఆత్మస్తుతి అయితే, ప్రసంగంలో 70 శాతం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పరనింద. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బుర్రల నిండా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న జగన్ గారి స్థానాన్ని చెరిపివేయలేక వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. వర్షాభావం, కరువు, రైతాంగ సమస్యలపై మాట్లాడకుండా పదే పదే గత ప్రభుత్వంపై బురద చల్లడం వీరి దిగజారుడుతనానికి నిదర్శనం. - పరిపాలన చంద్రబాబుది.. జపం మాత్రం జగన్‌దే! చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీరు, మీ ప్రసంగాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరునే పదేపదే ప్రస్తావిస్తున్నారు? మీ ఆలోచనల్లో, మీ రాజకీయాల్లో జగన్‌గారే కనిపిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. జగన్‌గారిని విమర్శించడం, ఆయన కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారం చేయడం మానేసి, మీ పాలన గురించి మాట్లాడండి. 28 నెలల పాలనలో ఏం సాధించారో, సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏమిటో, సూపర్ సెవెన్ గురించి ఏం చెబుతారో ప్రజలకు వివరించండి. మద్యం కేసు, వివేకానందరెడ్డి కేసు వంటి అంశాలను పదేపదే ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని మళ్లించడం కాకుండా, మీ ప్రభుత్వ పరిధిలోని బాధ్యతలపై సమాధానం చెప్పండి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై దృష్టి పెట్టి, వారికి ఎంత పరిహారం ఇస్తారో ప్రకటించండి. జగన్‌గారిని విమర్శించడం కాదు.. మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పమని సవాల్ చేస్తున్నా. - ముగ్గురు సీఎంలు.. హెలికాప్టర్లకే మంచినీళ్లలా రూ.109 కోట్లు ఖర్చు చంద్రబాబు తాను లక్ష కోట్ల అధిపతి ఎలా అయ్యారో ప్రజలకు టెక్నిక్ చెప్పాలి. హెరిటేజ్ దుకాణాలతో, రెండు ఎకరాలతో లక్ష కోట్లు ఎలా వచ్చాయి? ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. కరకట్ట ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం, గమ్యస్థానంలో మళ్లీ హెలికాప్టర్.. ఇలా ఒక్క పర్యటనకే మూడు వాహనాలు వాడుతున్నారు. ఈయనతో పాటు అబ్బాయి లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ఉంటే, ఇక్కడ ముగ్గురు సీఎంలు ఉన్నట్లుగా దోపిడీ సాగుతోంది. 2024-25లో విమాన ప్రయాణాలకు రూ. 54.41 కోట్లు, 2025-26లో రూ. 54.63 కోట్లు.. మొత్తంగా 28 నెలల కాలంలో కేవలం విమానాలు, హెలికాప్టర్ల కోసమే రూ. 109.04 కోట్లు తగలేశారు. 2026-27 బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పటికే రూ. 31 కోట్లు ఖర్చు చేసేశారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ కల్యాణానికి వెళ్తే టీటీడీ లెక్కల్లో రూ. 35 లక్షల ఖర్చు చూపించారు. లేస్తే ఖర్చు, కూర్చుంటే ఖర్చు అన్నట్లుగా ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. సభా వేదికలు, టెంట్లు, కుర్చీలు, మైకులు, విద్యుత్, ఎల్‌ఈడీ తెరలు, హెలిప్యాడ్లు, ప్రజల తరలింపునకు బస్సులు, ఇతర వాహనాలు, స్వాగత ఏర్పాట్లు, బ్యానర్లు, ప్రచార సామగ్రి, అధికారుల ద్వారా చెల్లించే బిల్లులు—వీటి ఖర్చులు ఇంకా అదనం. ఇవన్నీ ప్రజల సొమ్ము కాదా? ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో ఇంత ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు, ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా పర్యటనలకే ఇంత ఖర్చు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. - ఈవెంట్ మేనేజ్‌మెంట్ పాలన - ప్రచార ఖర్చు రూ.44.62 కోట్లు. రాష్ట్రంలో పరిపాలన సాగడం లేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కుటుంబాలను కలవడం, టీ బంకుల వద్దకు వెళ్లడం, మర్మరాల వ్యాపారిణితో మాట్లాడటం వంటి కార్యక్రమాలను ప్రచార ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్టు ప్రకారం ప్రశ్నలు, సమాధానాలతో సాగిన ఈ కార్యక్రమం కోసం రూ.44.62 కోట్లు ఖర్చు చేశారు. రోజుకు వందల మందికి మర్మరాలు అమ్ముతూ వేలల్లో ఆదాయం వస్తోందని చెప్పిన వ్యాపారినికి ముఖ్యమంత్రి అక్కడికక్కడే పెన్షన్ మంజూరు చేసినట్లు ప్రకటించడం కూడా ప్రచారానికే పరిమితమైంది. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన ప్రభుత్వం, ప్రచార కార్యక్రమాలకే ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నాం. - ఒకే పథకానికి పదే పదే ప్రారంభోత్సవాలు.. కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ పీక్స్.. రియాలిటీ వీక్ అన్నట్లుగా ఉంది. జగన్ హయాంలో 38 పథకాలు ఉంటే, బాబు వచ్చాక 34 పథకాలను పీకేశారు. ఇచ్చే అరకొర పథకాలకే వందల కోట్ల ప్రచారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో ఇప్పటివరకు 28 సార్లు వేర్వేరు జిల్లాల్లో ప్రారంభోత్సవాలు చేశారు. మీ భూమి-మీ హక్కు పేరుతో 9 సార్లు సభలు పెట్టారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పేరుతో 21 సార్లు, సంజీవని ఆరోగ్య కార్యక్రమం పేరిట 4 సార్లు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఒకే పథకాన్ని ఇన్నిసార్లు ప్రారంభిస్తూ ప్రజల పన్నుల సొమ్ముతో సభలు, ఫ్లెక్సీలు, డీజేలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. - దోపిడీ కోసమే పల్లె పండుగ.. ప్రాజెక్టుల వద్ద క్రెడిట్ చోరీ.. పల్లె పండుగ పేరిట కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులతో రొటీన్‌గా జరిగే పనులను తెచ్చి రూ. 11 వేల కోట్ల నిధులు తమ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. గతంలో సీ-ప్లేన్ అంటూ పెద్ద డ్రామా ఆడారు, ఇప్పుడది ఎక్కడుందో తెలియదు. వెలుగొండ ప్రాజెక్టును 85 శాతం పూర్తి చేసింది వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి గారే. కానీ చంద్రబాబు అక్కడికి వెళ్లి బొక్కబోర్లా పడుకుని దండాలు పెడుతూ క్రెడిట్ చోరీ డ్రామాలు ఆడుతున్నారు. అనకాపల్లి జిల్లా జిల్లాకు గోదావరి జలాలు తరలింపు అంశంలో కూడా సేమ్ డ్రోన్లు, కెమెరాలు, బొక్కబోర్లా పడుకోవడం, అప్పటికే ఉన్న లిఫ్ట్ ద్వారా నీరు తరలించి పోలవరం కాలువ ద్వారా గోదావరి నీటిని అనకాపల్లి తీసుకొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తూ చంద్రబాబు హంగామా చేశాడు. అక్కడ కూడా చంద్రబాబు బొక్కబోర్లా పడుకుని దండాలు పెట్టాడు. కెమెరా అనగానే చంద్రబాబులోకి పది మంది ఎన్టీఆర్‌లు, చిరంజీవులు పూనినట్లు నటిస్తారు. - పాస్ పుస్తకాలపై రంగుల మార్పు.. కమిషన్ల దందా.. ప్రకాశం జిల్లా కొండేపికి వెళ్లి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు... వైయస్.జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాలకు కేవలం రంగు మార్చి ఇస్తున్నారని.. అయితే అందులో కూడా పేర్లు, సర్వే నంబర్లలో తప్పులతో ఉన్నాయని సుధాకర్ బాబు మండిపడ్డారు. గతంలో రూ. 55.79 పైసలకే అత్యాధునిక క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్‌తో పుస్తకాలు ఇస్తే.. నేడు వాటి ధరను రూ. 76 చేసి.. ఒక్కో పుస్తకంపై పెంచిన రూ. 20 కమిషన్ ఎవరి జేబుల్లోకి వెళ్తోందని నిలదీశారు? వైయస్ జగన్ హయాం కంటే ఒక్క విషయంలోనైనా మెరుగ్గా పరిపాలించానని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. వైయస్.జగన్ ఒక్క ఎస్సీలకే రూ. 70 వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా అందించారని.. ఆయన పెట్టిన అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇళ్ల పట్టాలు అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని సుధాకర్ బాబు నిలదీశారు.