తాడేపల్లి: రాష్ట్రంలోని పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని, ప్రభుత్వం మరియు సంబంధిత యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ యం.వి.ఎస్. నాగిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత రెండు రబీ సీజన్లలో పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రైతు ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో ఉంటే వ్యవసాయ రంగంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కిలోకు రూ.53 వరకు ధర నష్టం 2023-24 సీజన్‌లో 215.35 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, సరాసరి అమ్మక ధర కిలోకు రూ.288.65గా ఉందన్నారు. అయితే 2024-25 సీజన్‌లో ఉత్పత్తి 240.64 మిలియన్ కిలోలకు పెరిగినా, ధర కిలోకు రూ.248.86కు పడిపోయిందని తెలిపారు. అంటే ఒక్క ఏడాదిలోనే రైతులు కిలోకు రూ.39.79 నష్టపోయారని పేర్కొన్నారు. 2025-26 సీజన్‌లో రాష్ట్రంలో 1.17 లక్షల హెక్టార్లలో సాగు జరిగిందని, రెండో ముందస్తు అంచనా ప్రకారం మొత్తం ఉత్పత్తి 266 మిలియన్ కిలోలకు చేరే అవకాశం ఉందన్నారు. కానీ జూన్ 1 నాటికి రాష్ట్ర సరాసరి అమ్మక ధర కిలోకు కేవలం రూ.235.63కే పరిమితమైందని, 2023-24తో పోలిస్తే రైతులు కిలోకు సుమారు రూ.53 నష్టపోతున్నారని చెప్పారు. అదనంగా పెరిగిన ఉత్పత్తి వ్యయం కారణంగా గత రెండేళ్లలో కిలోకు మరో రూ.20 వరకు భారం పెరిగిందని, మొత్తం నష్టం మరింత ఎక్కువగా ఉందన్నారు. వేలం కేంద్రాల్లో భారీగా తిరస్కరణలు ఒంగోలు, టంగుటూరు, కొండెపి, వెల్లంపల్లి, పొదిలి, కనిగిరి, కందుకూరు, కలిగిరి, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం తదితర వేలం కేంద్రాల్లో ఇప్పటికీ పెద్దఎత్తున బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయని తెలిపారు. తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లడానికి ఒక్కో బేళ్లకు సుమారు రూ.2 వేల వరకు అదనపు ఖర్చు అవుతోందని పేర్కొన్నారు. అమ్మకాలు కూడా మందగింపు ఈ సీజన్‌లో 266 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా ఉండగా, జూన్ 1 నాటికి కేవలం 11.10 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే వేలం జరిగిందని చెప్పారు. గత ఏడాది ఇదే 53 వేలం రోజుల నాటికి 39.37 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయని గుర్తు చేశారు. మార్క్‌ఫెడ్ కొనుగోళ్లను గుర్తుచేసిన నాగిరెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చరిత్రలో తొలిసారిగా పొగాకును కూడా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించారని నాగిరెడ్డి పేర్కొన్నారు. మంచి దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి వచ్చినప్పటికీ గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలి రాష్ట్రంలోని అనేక పంటల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని పేర్కొన్న ఆయన, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు, సన్నకారు, చిన్నకారు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకుని వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, మార్కెట్ భరోసా కల్పించే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యవసాయ రంగం మరింత తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని యం.వి.ఎస్. నాగిరెడ్డి హెచ్చరించారు.