వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు   వైయస్‌ జగన్‌తో పలువురు డీఎస్సీ–2025 అభ్యర్థుల భేటీ.

రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులు ఈ పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అనేక అక్రమాలపై మాజీ సీఎంకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

 డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, బాధ, గోడు అన్నింటినీ సావధానంగా విన్న శ్రీ వైయస్‌ జగన్, వారికి భరోసా ఇచ్చారు.

తాడేపల్లి:వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌తో పలువురు డీఎస్సీ–2025 అభ్యర్థుల భేటీ అయ్యారు. శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన సందర్భంగా డీఎస్సీ–2025 అభ్యర్థులు ఎవరెవరు ఏమేం మాట్లాడారంటే..:

ఎం.జగదీష్‌నాయక్‌. వైయస్సార్‌ కడప జిల్లా:

– నేను ఎస్టీని. ఉర్దూ మీడియమ్‌లో చదువుకున్నాను. మెగా డీఎస్సీలో ర్యాంక్‌ తెచ్చుకుని ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యాను. ఎస్‌జీటీ ఉర్దూ మీడియమ్‌లో పరీక్ష రాసింది మేము కేవలం నలుగురం మాత్రమే. అందులో ముగ్గురికి సర్టిఫికెట్ల పరిశీలనకు పిల్చారు. కానీ, తుది జాబితాలో నా పేరు రాలేదు. రోస్టర్‌ నెంబర్లు అటూ ఇటూ చేసి, ఉమెన్‌ కోటాలో అవకాశం ఉన్నా, నాది కాదని, ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్‌ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్‌ ఎందుకు రాలేదని అడుగుతూ, వివరాలు చెప్పమని అప్లికేషన్‌ రాసిస్తే, దాన్ని తీసుకుని పక్కన పడేశారు. దానిపై స్టాంప్‌ వేసి ఇస్తే, కోర్టుకు వెళ్తానని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు.
మంత్రి నారా లోకేష్‌ను కలవడానికి ఛాంబర్‌కు వెళ్తే, ఓఎస్డీ అందుకు అనుమతి లేదంటూ, నా అప్లికేషన్‌ తీసుకుని, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్‌ను కూడా ఆశ్రయించాను. వారు హియరింగ్‌కు పిల్చి, నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. 50 రోజులు గడిచినా, ప్రయోజనం లేకపోయింది. 

అనిగి దుర్గయ్య. పోలవరం మండలం. ప.గో జిల్లా:

– నేషనల్‌ గేమ్స్‌లో బంగారు పతక విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే, అవన్నీ కూడా రజతం, కాంస్య పతక విజేతలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి, నాకు బంగారు పతకం ఉన్నా, ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దానిపై అందరు అధికారులను ఆశ్రయించాను. ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు.

ఎండీ.షాబుద్దీన్‌. విశాఖ జిల్లా.

– ఉర్దూలో చదువుకున్నాను. ఇంటర్‌ నుంచి ఇంగ్లిష్‌ మీడియమ్‌. నాది టెన్త్‌ వరకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఉర్దూ కాగా, సెకండ్‌ లాంగ్వేజ్‌గా తెలుగు. అయితే నా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సందర్భంగా, నాది ఫస్ట్‌ లాంగ్వేజ్‌ తెలుగు ఉండాలని అన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు.

ఇందిర. కృష్ణా జిల్లా.

– నేను ఎస్సీ. నా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చక్కగా జరిగింది. నా ముందే నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈఓ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి, మళ్లీ కుల ధృవీకరణ సర్టిఫికెట్‌ అడిగితే పంపాను. మాకు 3 పోస్టులు ఉండాయి. మేము ముగ్గురమే ఉన్నాం. మాకు చాలా అన్యాయం జరిగింది. నేను ఎందుకు ఫైనల్‌లో లేను. కారణం అడిగితే, స్పోర్ట్స్‌ కోటాలో ఆ జాబ్‌ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారంటూ.. దుఖాన్ని ఆపుకోలేని ఇందిర కన్నీటి పర్యంతం అయ్యారు.

నాగలక్ష్మి. గుంటూరు జిల్లా.

– నేను కరాటే బ్లాక్‌బెల్ట్‌ ఛాంపియన్‌ను. నా ఇంటర్వ్యూ బాగా జరిగింది. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే, నేను ఒక్కదాన్నే పాస్‌ అయ్యాను. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే, అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేసినా, ప్రయోజనం లేకపోయింది. పైనా నాది బీసీ–డీ అయితే, నన్ను బీసీ–సీ గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. నేను ఓపెన్‌ కేటగిరీలో ఉన్నా, రిజర్వేషన్‌ కేటగిరీలో పిల్చామన్నారు. మరి తెలిసి కూడా ఎందుకు పిల్చారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఎందుకు చేశారంటే సమాధానం కూడా చెప్పలేదు.

షర్మిల. మదనపల్లె. అన్నమయ్య జిల్లా.

– మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మాకు మీపై ఎంతో విశ్వాసం ఉంది. నేను బీసీ–ఈ. సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాను. నేను ఎస్‌ఏ పోస్టు కోసం ఇంటర్వ్యూకు వెళ్లాను. నాకు కంగ్రాట్స్‌ అని చెప్పారు. కానీ, సెలక్షన్‌ లిస్టులో నా పేరు లేదు. కారణాలు కూడా చెప్పలేదు. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి లోకేష్‌ను కలవాలని చూసినా, ఏనాడూ ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. వన్‌ ఈజ్‌ టు వన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిల్చినప్పుడు, ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్‌ చేసినంత మాత్రాన జాబ్‌ ఇవ్వాలా అన్నట్లు మాట్లాడారు. వన్‌ ఈజ్‌ టు వన్‌లో పిల్చినా జాబ్‌ ఇవ్వాలన్నట్లు కాదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 

బాలకృష్ణ. కాకినాడ. తూ.గో జిల్లా:

– నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అంటే, నీ కులంలో స్పోర్ట్స్‌ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను పిల్చారు. 1998, 2008  డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి.

లక్ష్మీపార్వతి. వైయస్సార్‌ కడప జిల్లా:

– నాది బీసీ–ఏ. ఒక పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా బాగా జరిగింది. కానీ, చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్‌లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది. ఫిజికల్‌ సైన్స్‌లో మాకు అర్హత ఉంది. నేను ఎమ్మెస్సీ చదివాను. నాకు స్పోర్ట్‌ సర్టిఫికెట్‌ ఉన్నా, జనరల్‌ కేటగిరీలో దరఖాస్తు చేశాను. కానీ నాకు తీరని అన్యాయం చేశారంటూ, దుఖాన్ని అపుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు.

దుర్గామల్లిక. అమలాపురం. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా:

– ఫలితాల్లో నా కంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్‌. ఆమెది ఫేక్‌ సర్టిఫికెట్‌. మేము ఫిర్యాదు చేస్తే, ఆమెది క్యాన్సల్‌ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా, నాకు అవకాశం ఇవ్వలేదు. కానీ, విజయనగరంకు చెందిన ఒక అమ్మాయి ఉంటే, ఆమెకు జాబ్‌ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సల్‌ అయితే, నెక్స్‌ట్‌ క్యాండిడేట్‌కు ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్‌ చేస్తామని చెప్పారు. కానీ, రాష్ట్రంలో తొలిసారిగా విజయనగరం అమ్మాయికి ఇచ్చారు.

శ్రావణ్‌కుమార్‌. రాంబల్లి మండలం. విశాఖ జిల్లా:

– నాది మత్స్యకార కుటుంబం. చేపలు పట్టుకుని మా అమ్మానాన్న చదివించారు. చాలా పేద కుటుంబం. కోచింగ్‌కు కూడా వెళ్లలేక, కష్టపడి చదివాను. ఫిజికల్‌ సైన్సెస్‌లో బీసీ–సీ లో నాది మూడో ర్యాంక్‌. నా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా జరిగింది. నాది ఓవరాల్‌ మెరిట్‌ జాబితాలో నాది 53వ ర్యాంక్‌. ఓపెన్‌లో 10వ ర్యాంక్‌ వచ్చిన ఒక అభ్యర్థిని ఆ కేటగిరీలో పంపించి ఉంటే, నాకు మా కేటగిరీలో జాబ్‌ వచ్చి ఉండేది. నాది మా కేటగిరీలో 3వ ర్యాంక్‌ కాగా, ఓపెన్‌ కేటగిరీలో 53వ ర్యాంక్‌. నాకు జాబ్‌ ఎందుకు రాలేదంటే, ఒక అమ్మాయి స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌తో వచ్చిందని, అది శాప్‌ నుంచి అని చెప్పారు. మా గురించి సాక్షిలో వేస్తే, మమ్మల్ని ఫేక్‌ అని ప్రచారం చేస్తున్నారు.

హెచ్‌.వసంత్‌కుమార్‌. అనంతపురం జిల్లా.
అంధుడైన అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు.

– గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా కూడా లేదు. అంజనప్పకు కన్ను చూపు లేదని మెడికల్‌ బోర్డు (అనంతపురం జీజీహెచ్‌), 40 శాతంతో సర్టిఫికెట్‌ ఇచ్చింది. అయితే అతడు అంధుడు కాదని రిజెక్ట్‌ చేశారు. మేము 40 శాతం అంధత్వం అన్న సర్టిఫికెట్‌ ఇచ్చినా, పట్టించుకోలేదు. మేము ఇచ్చిన సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయలేదు. అడిగితే, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు. విజయవాడకు వచ్చి, కమిషనరేట్‌లో కలిసినా, తామేమీ చేయలేమని చెప్పారు.
వన్‌ ఈజ్‌ టు వన్‌ ఇంటర్వ్యూకు పిల్చినా, ఎందుకు జాబ్‌ ఇవ్వలేదంటే.. నాకు ఏ విషయం తెలియదని, ఆర్‌జేడీ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక మహిళకు కడపలో పరీక్ష చేయించారు. అది నియమావళికి విరుద్ధం.
ఎస్‌ఏ సోషల్‌కు పరీక్ష రాస్తే, అతణ్ని ఎస్‌ఏ ఇంగ్లిష్‌లో చూపి, వైద్య పరీక్షకు పంపించారు. అధికారులది అంత నిర్లక్ష్యం. 

నరసింహారావు. ప్రకాశం జిల్లా:

– నాది జనరల్‌ కేటగిరిలో 76వ ర్యాంక్‌. ఓహెచ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌. నేను జిల్లాలో ఫస్ట్‌ వచ్చాను. కానీ, నాకు కాల్‌ లెటర్‌ రాలేదు. సెకండ్‌ ఫేస్‌లో కాల్‌ లెటర్‌ వచ్చింది. మెడికల్‌ టెస్టులో, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా బాగా జరిగింది. కానీ జాబ్‌ రాలేదు. కానీ, రోస్టర్‌లో మరొకరు ముందుగా ఉన్నారని, ఆమెకు 137వ ర్యాంక్‌ వచ్చినా, జాబ్‌ ఇచ్చారు. నాకు ఎస్సీ కమ్యూనిటీలో రాలేదు. కానీ, ఓహెచ్‌లో వస్తుంది. కానీ అదీ ఇవ్వలేదు.

ఏకాంబరం. మాదిరెడ్డిపల్లి. చిత్తూరు జిల్లా:

– నేను ఎస్‌ఏ సోషల్‌. బీసీ–డీ. మా కేటగిరీలో 7 పోస్టులు ఉండగా, వాటిలో 5 పోస్టులు జనరల్‌లో, మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్‌ పరిశీలనకు వన్‌ ఈజ్‌ టు వన్‌లో పిల్చినా, జాబ్‌ రాలేదు. దానికి ఏదో హారిజంటల్‌ రిజర్వేషన్‌లో ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. డీఈఓ ఆఫీస్‌లో అడిగితే, తమకేమీ తెలియదని, విజయవాడకు వెళ్లమన్నారు. ఇక్కడికి వస్తే, తమకు ఏ సంబంధం లేదని చెప్పారు. 
మీరే మాకు ఎలాగైనా న్యాయం చేయాలి. మీరు మాత్రమే చేయగలరు. మా నిరుద్యోగ అభ్యర్థులందరం మీ వెంటే ఉంటాం. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. 

రాణి. కృష్ణా జిల్లా:

– నాది బీసీ–బీ లో మూడో పోస్టు. నాది తీసేసి స్పోర్ట్స్‌ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నావి అన్నీ చక్కగా జరిగాయి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా బాగా జరిగింది. నాకు సంబంధించి ఏ సమస్యా లేదు. కానీ, జాబ్‌ రాలేదు. అలా అని నాది రిజెక్ట్‌ లిస్ట్‌లో కూడా లేదు. అదే అడిగితే, ఏ సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి, జీరో ర్యాంక్‌ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్‌ కోటా కింద జాబ్‌ ఇచ్చారు.

రాజ్‌కమల్‌. గుంటూరు జిల్లా:

– ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు. మంత్రి నిర్వాకం వల్ల మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాల్సిన మేము, మా భవిష్యత్తు ఇలా మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారం నియమాలు మార్చారు. దాని వల్ల ఏ మాత్రం అర్హత లేని వారు కూడా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలోకి వచ్చారు. మేము అడిగితే మాస్‌ కాపీయింగ్‌ జరిగిందన్నారు. ఆ వివరాలు మేము ఆర్టీఐ కింద అడిగితే, ఆ విషయం తమ పరిధిలో లేదని చెప్పారు. మరోవైపు విద్యా శాఖ కార్యదర్శి మరోలా మాట్లాడుతున్నారు. మేము విద్యా కమిషనర్‌ ఆఫీస్‌కు వెళ్లి, అప్లికేషన్‌ ఇస్తే, కనీసం రిసీవ్డ్‌ స్టాంప్‌ కూడా వేసి ఇవ్వడం లేదు. 
జోన్‌–1లో పీఈటీగా ఎంపికైన అభ్యర్థిని జోన్‌–3లో వేశారు. ఏ పరీక్షలో అయినా, 7 శాతం తప్పులుంటే, ఆ పరీక్ష తిరిగి నిర్వహించాలి. అది రూల్‌. కానీ, ఇక్కడ 10 శాతం తప్పులున్నా, పట్టించుకోవడం లేదు. మేము ఆర్టీఐ కింద ఏది అడిగినా, తమ పరిధిలో లేదన్న సమాధానం చెబుతున్నారు.

వీరవేణి. తూ.గో. జిల్లా:

– మాకు (మహిళలకు) ఓపెన్‌ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. కానీ, అందులోకి స్పోర్ట్స్‌ కోటా కింద ఒకరిని తీసుకొచ్చి, ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి, అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే అర్హత లేకున్నా, ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసి. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్‌ పోయింది.

ప్రతిభ. తూ.గో.జిల్లా:

– నేను అర్హత సాధించానని, కాబట్టి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు కూడా పిల్చారు. కానీ, ఉద్యోగం రాలేదు. మహిళలకు మూడు పోస్టులు ఉండగా, నాది మూడో పోస్టు. అయితే ఓపెన్‌ కేటగిరీలో ఉన్న ఒకరిని తీసుకొచ్చి, మా కేటగిరీలో ఇచ్చారు. దాంతో మాకు అన్యాయం జరిగింది. గ్రీవెన్స్‌ సెల్లో ఫిర్యాదు చేసినా, ఫలితం లేదు. తప్పుడు సమాధానాలు ఇచ్చారు. కటాఫ్‌ మార్కులు కూడా ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది.

సతీష్‌. పశ్చిమ గోదావరి జిల్లా:

– నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నా కంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అయితే అతడిది ఫేక్‌ సర్టిఫికెట్‌ అని తేలడంతో, పోస్టింగ్‌ ఆపారు. ఆ తర్వాత జాబితాలో ఉన్నా, నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్‌ చేశామని చెబుతున్నారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు.

కె.శరత్‌బాబు. కాకినాడ. తూ.గో జిల్లా:

– నేను ఎస్సీ కమ్యూనిటీ. నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురినీ ఓపెన్‌లో చూపారు. గ్రీవెన్స్‌ సెల్‌లో దరఖాస్తు చేస్తే.. నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, అన్నీ సక్సెస్‌ కానీ, జాబ్‌ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నా కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నా కంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్‌లో చూపారు. ఎవరిని కలిసినా, చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

Back to Top