న్యూఢిల్లీ: ఏపీలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలే కాదు, కనీసం రైతులకు రక్షణ కూడా లేకుండా పోయిందని.. కేంద్రం ప్రకటించిన ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన పాపానికి కూటమి ప్రభుత్వం మహిళా రైతులపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తోందని పొన్నూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి అంబటి మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిళ్లపల్లి బాధిత రైతులు, రైతు కూలీలతోపాటు వైయస్సారీపీ అరకు ఎంపీ తనూజా రాణితో కలిసి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో న్యాయం జరగడం లేదని ఢిల్లీలో మానవహక్కుల కమిషన్, ఎస్సీ, మహిళా కమిషన్ లకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. ధర్నాలో ఉన్న మహిళలను రోప్‌లు మెడకి బిగించి ఈడ్చిపడేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగిందని, దీంతోపాటు రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని కోరినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మామిళ్లపల్లి మహిళలపై పోలీసులు సాగించిన దౌర్జన్యంపై హోంమంత్రి అనిత తక్షణం స్పందించాలని ఎంపీ తనూజా రాణి డిమాండ్ చేశారు. వారితోపాటు మామిళ్లపల్లి మహిళా రైతులు, రైతు కూలీలు అక్కడే మీడియాతో మాట్లాడారు. వారు ఇంకా ఏమన్నారంటే... ● రాష్ట్రంలో న్యాయం జరగడం లేదని రైతులు ఢిల్లీ వచ్చారు - అంబటి మురళీకృష్ణ, పొన్నూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోగా కనీసం భద్రత కూడా లేకుండాపోయింది. కూటమి ఎమ్మెల్యేలే బ్రోకర్లుగా మారి రైతుల శ్రమను దోచుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దళారులుగా మారి రైతుల నుంచి పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి మారుబేరాలకు పక్క రాష్ట్రాల్లో కేంద్రం ప్రకటించిన మద్ధతు ధరకు అమ్మేసుకుని జేబులు నింపుకుంటున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేసినందుకు కాపు కులానికి 5 మంది మహిళలు సహా 14 మంది రైతుల మీద అట్రాసిటీ పెట్టారు. వారికి అండగా నిలబడినందుకు ఎస్సీ కులానికి చెందిన రైతు కూలీల మీద హత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తున్నారు. గిట్టుబాటు ధర కావాలని శాంతియుతంగా నిరసన తెలియజేసిన మహిళా రైతుల మీద పోలీసులు దౌర్జన్యం చేశారు. మెడకు రోప్‌లు బిగించి లాగి పడేశారు. ధర్నాలో ఉన్న వారితో అసభ్యంగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో పోలీసులు సాగించిన దౌర్జన్య కాండకు సంబంధించిన వీడియోలతో సహా ఎస్సీ, మహిళా, మానవహక్కుల కమిషన్ లకు ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. పొన్నూరు రూరల్ సీఐ, కృష్ణయ్య, ఎస్సై శ్రీహరి, తెనాలి అర్బన్ సీఐ నాయక్, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ, పొన్నూరు అర్బన్ సీఐ వీరనాయక్ లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలాంటి నోటీసులు లేకుండా నన్ను బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే జూపూడి ప్రభాకర్‌రావును ఇంటి తలుపులు పగలగొట్టి మరీ పోలీసులు దౌర్జన్యంగా తరలించారు. అడ్డంపడిన మహిళలపై దాడులు చేశారు. ఈ దుర్మార్గాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో న్యాయం జరగదని గ్రహించి జాతీయ మానవహక్కుల కమిషన్, ఎస్సీ, మహిళా కమిషన్‌లని ఆశ్రయించడం జరిగింది. ● హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి - తనూజా రాణి, అరకు ఎంపీ మహిళలు, రైతుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. పండించిన పంటను కేంద్రం ప్రకటించిన మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం కూడా పాపమైపోయింది.శాంతియుతంగా నిరసన తెలియజేసిన మహిళల మీద పోలీసులు దౌర్జన్యం చేసి మెడకు రోప్‌లు బిగించి ఈడ్చిపడేశారు. మహిళా హోంమంత్రి అనిత దీనికి సమాధానం చెప్పాలి. దళిత, కాపు వర్గానికి చెందిన మహిళా రైతులు ఢిల్లీ వరకు వచ్చి మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మద్ధతు ధరకు పంటలు అమ్ముకోవడం రైతుల హక్కు. ఆ హక్కును కూటమి ప్రభుత్వ ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోంది. నినదించిన మహిళా రైతుల మీద అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టడం చంద్రబాబు నిరంకుశ పాలనకు పరాకాష్ట. కూటమి పాలనలో మహిళలకు రక్షణ, గౌరవం లేకుండా పోయింది. మహిళా రైతులను వేధించిన పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలి. మహిళలకు న్యాయం జరిగేవరకు వైయస్ఆర్‌సీపీ వారికి అండగా ఉంటుంది. ● గిట్టుబాటు ధర అడిగినందుకు అట్రాసిటీ కేసులు - సావిత్రి, మహిళా రైతు మేం సాగుచేసిన మొక్కజొన్న పంటకు కేంద్రం ప్రకటించిన గిట్టుబాటు ధర రూ. 2400లు ఇవ్వకుండా దళారులు రూ. 1650లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో తక్కువ ధరకు పంటను అమ్ముకోవడం ఇష్టం లేక స్థానికంగా మామిళ్లపల్లిలో గోడౌన్‌లో పంటను స్టోర్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో ఇది అంబటి మురళీకృష్ణ కి చెందిన గోడౌన్ అంటూ పోలీసులు గోడౌన్ ను ధ్వంసం చేసి సీజ్ చేశారు. ఇది రైతులదని, మురళీకృష్ణకు సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా వినకుండా ధర్నా చేస్తున్న రైతులను తీవ్రంగా వేధించారు. మహిళలం అని కూడా చూడకుండా రోప్‌లతో మెడకు బిగించి లాగిపడేశారు. మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ● నెలరోజులుగా కంటి మీద కునుకు లేదు - మమత, రైతు కూలీ నాయకురాలు పోలీసుల దౌర్జన్యాల కారణంగా మామిళ్లపల్లి గ్రామంలో నెలరోజులుగా రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. గిట్టుబాటు ధర కావాలని శాంతియుతంగా నిరసన తెలియజేయడమే పాపమైపొయింది. మహిళలం అని కూడా మా మీద జాలి చూపించకుండా పోలీసులను ఉసిగొల్పి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాపై దాడులు చేయించాడు. రైతులకు అండగా నిలబడినందుకు రైతు కూలీలమైన ఎస్సీ కులానికి చెందిన మాపై హత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తున్నారు. కనీసం మహిళా పోలీసులు లేకుండా తోసిపడేశారు. మద్ధతు ధర అడిగినందుకు ఇంతలా దాడులు చేయాలా? కుట్ర రాజకీయాల కోసం రైతులను వాడుకోవడం దుర్మార్గం.