తాడేపల్లి: టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. మహిళల చేతిలో నిధులు ఉంటే స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. మహిళలకు చంద్రబాబు మోసంపై వైయస్ఆర్‌సీపీఅధినేత వైఎస్ జగన్ తాజాగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రుణాలు అందితే మహిళల్లో ఆర్థిక స్వావలంభన చేకూరుతుంది. వారి చేతిలో నిధులుంటే ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. రుణాల పెరుగుదల ఆగిపోవటంతో పెట్టుబడులు, ఆదాయాలు తగ్గాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయ వృద్ధి -3.22% నెగటివ్‌గా ఉంది. స్వయం సహాయక గ్రూపులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రాయితీ చాలా కీలకమైన పథకం. మా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించాం. అదనంగా ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించాం. ఇవన్నీ మహిళలకు స్వయం ఉపాధికి మంచి అవకాశాలుగా మారాయి. టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపు రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా చేతులు ఎత్తేసింది. రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ అమలు చేయకపోగా, ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ పథకానికే నిధులు విడుదల చేయట్లేదు. గత రెండేళ్లుగా రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఒక్కో SHG సంఘం మీద సగటున రూ.6 లక్షల రుణభారం ఉందనుకుంటే.. టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం ఏటా సుమారు రూ.3,000 కోట్లు అవసరం అవుతుంది. అంటే ఈ రెండేళ్లకు కలిపి మహిళలకు సుమారు రూ.6,000 కోట్ల ప్రయోజనం అందకుండా పోయింది. మా హయాంలో తీసుకున్న చర్యల వల్ల SHGలకు రుణాల వృద్ధి గణనీయంగా పెరిగింది. మా ప్రభుత్వ చివరి సంవత్సరంలో SHGలకు అందిన రుణాలు రూ.49,696 కోట్లు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మొదటి సంవత్సరంలో అవి రూ.41,623 కోట్లకు తగ్గాయి. 2025-26లో మరింత తగ్గి రూ.41,105 కోట్లకు చేరాయి. ఇలా మహిళా సంఘాలకు ఆర్థిక మద్దతు తగ్గటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది’ అని తన ట్వీట్‌లో వైయస్ జగన్ పేర్కొన్నారు.