నరసరావుపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను బుధవారం నరసరావుపేట గుంటూరు రోడ్డులోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేశారని, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, తల్లికి వందనం, పెన్షన్లు, బీసీ–మైనారిటీల సంక్షేమ పథకాలు, రైతులకు ఆర్థిక సహాయం వంటి అనేక హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ప్రజలపై భారాలు మోపిందని విమర్శించారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను రెండేళ్లుగా మోసం చేసిన కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 4న రొంపిచర్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం, జూన్ 5న నరసరావుపేట మండలంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే జూన్ 12న నరసరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.